ఓ అధ్యాత్మికవేత్త వారణాసికి వెళ్తూ ఒక ఊళ్లో ఆగాడు. రెండురోజులపాటు అక్కడే ఉండి నాలుగు మంచి విషయాలు గ్రామస్తులకు చెప్పి వెళ్దామని అనుకున్నాడు. విషయం తెలిసిన ఒక గృహిణి నేరుగా ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ్లి, నమస్కరించి ‘నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారి అల్లరి భరించలేక పోతున్నాను. సహనం కోల్పోయినప్పుడు వారిని తిట్టికొట్టాలనిపిస్తుంది. మళ్లీ కొద్దిసేపటికే ‘పిల్లలు దేవుళ్లతో సమానం కదా. అన్నెం పున్నెం తెలియని వారినెందుకు తిట్టడం, కొట్టడం అని ఆగిపోతాను. దీనికి పరిష్కారమేమిటి?’ అని అడిగింది.
దానికి ఆధ్యాత్మికవేత్త చిన్నగా నవ్వి ‘గురువు చెప్పినట్లు చెయ్’ అని చెప్పి పంపాడు. ఆ సమాధానం ఆమెకు సంతృప్తిని కలిగించలేదు.ఆధ్యాత్మిక వేత్త తన ప్రశ్నను సరిగా వినలేదని భావించింది. మరుసటి రోజు కూడా సందేహ నివృత్తి కోసం వెళ్లింది. ‘మా అత్త నాపై చీటికీమాటికీ అరుస్తుంది. ‘అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టిన కుండ కొత్త కుండ’ అని తిట్టే రకం. ఆమె అరిచినప్పుడల్లా నాకు ఎదురు తిరగాలనిపిస్తుంది అయితే కొద్దిసేపటికే ‘అయ్యో… పెద్దావిడ చాదస్తంతో అలా మాట్లాడుతున్నది’ అని నాకు నేను సర్దిచెప్పుకొంటాను. ఏమి చేయమంటారు?’ అని ప్రశ్నించింది.
ఆయన మళ్లీ చిరు నవ్వు నవ్వి ‘పెద్ద గురువు చెప్పినట్లు చెయ్’ అని సమాధానమిచ్చాడు. ఆమె అసహనంగా ‘నాకు గురువే లేడు. ఇక పెద్ద గురువును ఎక్కడి నుంచి తీసుకురాను?’ అని అడిగింది. ఆధ్యాత్మికవేత్త ఆమెను ఓదారుస్తూ ‘మన మనస్సాక్షికి మించిన గురువు లేడు. నీకు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. నీ మనసు నీకు కొన్ని విషయాలు చెబుతుంది. దాన్ని పాటిస్తే చాలు’ అని చెప్పాడు. ఆమెకు విషయం అర్థమయ్యింది. ‘మన మనసును మించిన పెద్ద గురువు లేడు. మనసెప్పుడూ మనకు మంచే చెబుతుంది, మన మంచే కోరుతుంది. మనల్ని మోసం చేయదు’ అని తెలుసుకుని ఇంటికి వెళ్లింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821