ప్రకృతిః త్రిగుణావలంబినీ
(యోగసారోపనిషత్తు 10)
ప్రకృతి అంటే త్రిగుణాలను అవలంబించేది. త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు. వాటి వెంట ప్రకృతి పిచ్చిగా పరుగెత్తుతూ ఉంటుంది. అంటే వాటివల్ల ఎప్పుడూ ప్రభావితమవుతూనే ఉంటుంది.. అని భావం. మరో రకంగా చెప్పాలంటే మానవుడి ప్రకృతి లేదా స్వభావం సత్వ రజస్తమో గుణాలను అనుసరించి ఉంటుంది. అందులో సత్వ గుణాన్ని మిగతా గుణాల బారినుంచి జాగరూకతతో పరిరక్షించుకుంటూ పెంపొందించుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే పరబ్రహ్మానుభూతికి పాత్రులమవుతాం. లేకపోతే సాధకుణ్ని శివానందం కాకుండా శివుడి భిక్షాపాత్రయే వరిస్తుంది. దానికి ఈ చిన్ని హాస్య సంభాషణమే ఉదాహరణం. రాజుగారి సహాయంకోసం ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ‘ఎక్కడ నుంచి వస్తున్నావు?’ అన్నాడు రాజు. ‘కైలాసం నుంచి ప్రభూ!’ అన్నాడతడు చమత్కారంగా. రాజు సంతోషించి.. ‘ఓహో! పరమేశ్వరుడు బావున్నాడా!’ అని ప్రశ్నించాడు. ‘ఇంకెక్కడి పరమేశ్వరుడు మహారాజా! అంతా ఐపోయింది. ఆయన మరణించాడు’ అన్నాడు బ్రాహ్మణుడు.
‘అదేమిటి? మృత్యుంజయునికి మరణమా! అసంభవం..’ అన్నాడు రాజు. ‘విష్ణువుకు తన శరీరంలో సగ భాగం ఇచ్చివేశాడు శంకరుడు. మిగిలిన సగం పార్వతికి ఇచ్చాడు. ఇంకా శివుడు ఎక్కడున్నాడు ప్రభూ!’ అని బ్రాహ్మణుడు ఏడుపు ముఖం పెట్టాడు. బ్రాహ్మణుడి సమయస్ఫూర్తికి ఆనందించిన రాజు అన్నాడు కదా! ‘అది సరేనయ్యా! పరమశివుడి ఆస్తిపాస్తులు ఏమయ్యాయి’ అని మళ్లీ ప్రశ్నించాడు,‘ప్రభూ! శివుడు మాయంకాగానే తలమీది నెలవంక ఆకాశానికి ఎగిరిపోయింది. జటాజూటంలోని గంగమ్మ సముద్రం చేరింది. నందీశ్వరుడేమో పొలం దున్నేందుకు భూలోకానికి వచ్చేశాడు. భూషణాలైన నాగులన్నీ పాతాళానికి పరుగుదీశాయి. ఆఖరికి పరమేశ్వరుడి మంచితనం దానగుణం మొదలైనవి మీలోపల లీనమైనవి. శివుని భిక్షాపాత్రమటుకు నాచేతిలోకి వచ్చింది’ అన్నాడు. మహారాజుకు విషయం అర్థమైంది. అనుకోకుండా రజోగుణమో తమోగుణమో మనలో ప్రవేశించి మనం ఏమరుపాటుగా ఉంటే నిలదొక్కుకుంటుంది. ఇక మన ప్రమేయం లేకుండానే ఒకదాని వెంట ఒకటి సంభవిస్తూ ఎంత దూరం వెళుతుందో చెప్పడానికి ఈ సంభాషణ చాలు.