క్రీస్తు సామెతల్లో ‘తేలికైన బోధన – బరువైన భావన’ తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్రీస్తు చుట్టూ ఉన్నది పామర జనం. ఆయన ఎక్కువగా పల్లెల్లో తిరిగాడు. గుండె గుండెనూ పలకరించాడు. వారి సమస్యల్ని తాకాడు. చెప్పవలసినవి చెప్పాడు. చేయవలసిన చోట అద్భుతాలు చేశాడు. అలా సందర్భోచితమైన సాయం అందించాడు. రోగుల కోసమే కదా వైద్యుడు అనే సిద్ధాంతంతో నిరక్షరాస్యుల మధ్య జ్ఞాన జ్యోతుల్ని వెలిగించాడు. వివేకాన్ని కలిగించాడు. జరుగుతున్న అన్యాయం పట్ల వివేచనా శక్తి రగిలించాడు. ఇక్కడే మేల్కొంది యూదా సంఘపు మూఢాచార వ్యవస్థ. ఇక్కడే రోమన్ల రాచరిక వ్యవస్థ ఆయన్ను అడ్డుకుంది.
క్రీస్తు పట్ల అసూయాద్వేషాగ్నులు కార్చిచ్చులా ఎగిసిపడ్డాయి. ఆయన మాటలు అమాయకుల్ని ఆకట్టుకున్నాయి. ఆయన చిన్న మాటల్లోనే అనంతమైన నిగూఢార్థాన్ని నింపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడు. ఈ బోధనా లక్ష్యాన్ని చేరుకోడానికి ఉపమాన కథలే వాహికలుగా కనిపించాయి. అప్పటి వరకు దాగిన రహస్యాలు బట్టబయలు అయ్యాయి.
కంటికి కనిపించని ఆవ గింజంత పరలోక సూత్రాన్ని ప్రజల మనసు పొలాల్లో నాటాడు. అది పెరిగి పెద్దదై విశ్వవ్యాప్తమైంది. అట్లు వేయడానికి పులియబెట్టిన రవ్వంత పిండి.. రెండో రోజు గిన్నె ఎల్లలు దాటి ఎలా పొంగిపోతుందో.. అలా ప్రభువు చెప్పిన సత్యాలు ద్విగుణీకృతమయ్యాయి. ఇటువంటి ప్రభువు బోధనలు ఓ పక్క యూదుల్ని, మరో పక్క రాజుల్ని నిద్రపోనివ్వలేదు. వెలుతురుని చూస్తే చీకటికి నిద్రపడుతుందా మరి!
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024