పరిశుద్ధ వాక్కును అల్లాహ్ ఓ చెట్టుతో పోల్చాడు అని చెబుతున్నది ఖురాన్. ఖర్జూర చెట్టు వేరు భూమిలోనికి లోతుగా నాటుకొని ఉంటుంది. కొమ్మలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభువు ఆదేశానుసారం అది విశేషంగా పండ్లను ఇస్తుందని ఖర్జూర చెట్టు గురించి ఖురాన్లో పేర్కొనడం విశేషం. ఒకసారి ప్రవక్త (స అసమ్) తన దగ్గరికి వచ్చిన ఇబ్నె ఉమర్(రజి)తో మాట్లాడుతూ ‘ముస్లిం మాదిరిగా ఎల్లకాలం ఫలాలనిచ్చే వృక్షం ఏదో నాకు చెప్పండి’ అని ప్రశ్నించాడు.
ఉమర్ (రజి)కి ‘ఖర్జూర చెట్టు’ అయి ఉంటుందన్న ఆలోచన తట్టింది. కానీ, ఆ సమయంలో అక్కడ అబూబక్(్రరజి), ఉమర్(రజి) వంటి ఉద్దండులు ఉపవిష్టులై ఉండటంతో సమాధానం చెప్పలేకపోయారు. పెద్దల ముందు మాట్లాడటం సబబు కాదని ఊరుకున్నాడు.
వారెవరూ సమాధానం ఇవ్వకపోవడంతో ప్రవక్త (స) ‘అది ఖర్జూర చెట్టు’ అని చెప్పారు. సగటు ముస్లిమ్ (విశ్వాసి) ఖర్జూరపు చెట్టులాంటి వాడని ఎందుకన్నారంటే.. ఖర్జూరపు చెట్టు అన్ని కాలాల్లోనూ ఫలాలను ఇస్తుంది. అలాగే దైవ విశ్వాసి నిత్యం అందరి శ్రేయాన్ని కోరుకుంటాడని అర్థం.
ఖర్జూరపు చెట్టు మొదలు నుంచి చివరి దాకా అన్నీ ఉపయోగపడేవే! ఖర్జూరపు కాయలు, పండ్లు, చెట్టు ఆకులు, దాని కలప, విత్తనాలు ఇలా అన్నీ పనికొచ్చేవే. ఖర్జూరపు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఎన్నో రోగాలకు ఔషధంగా పనిచేస్తాయి. ఖర్జూరం విత్తనాలు కూడా ఎన్నో రుగ్మతలకు విరుగుడుగా ఉపయోగపడతాయి. అలాగే దైవ విశ్వాసి తన జీవితాన్ని సమాజానికి, కుటుంబానికి అంకితం చేయాలని ప్రభువు యోచన. అందుకే, దైవ విశ్వాసిని ఖర్జూరంతో పోల్చారు ప్రవక్త (స).
– ముహమ్మద్ ముజాహిద్,96406 22076