చాలా మంది ప్రార్థన గురించి తమకేం తెలియదంటూ, వారి వారి సమస్యలన్నీ మనసు విప్పి చెప్పేస్తారు. కావలసినవీ అడుగుతారు. అయితే విచిత్రమేమంటే వారి అభ్యర్థనలో ప్రార్థన ఉందని వారు గుర్తించలేరు. ఎప్పుడూ సామాన్య జనంతో తిరిగే ప్రభువు.. ఏకాంతంగా ఒకసారి ప్రార్థన చేసుకొని, తిరిగి వచ్చాడు. ఆ శిష్యుల్లో ఒకరు ‘మాకూ ప్రార్థించడం ఎలాగో నేర్పించండి’ అని ప్రభువును అడిగాడు. అసలు మనకేం కావాలో దేవుణ్ని అడగాల్సిన అవసరం ఉందా, అనేది కొందరి అనుమానం! ‘మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును’ (మత్తయి 6:8 ) అని వాక్యం. అయినప్పటికీ, ‘అడగాల్సిందే!’ అన్నట్టుగా సమాధానం ఇచ్చారు ప్రభువు. అడగనిది అమ్మయినా పెట్టదు కదా! దేవుడు సర్వజ్ఞుడైనా.. అమ్మను అడిగినట్టు.. ఆ దైవాన్నీ మనకేం కావాలో కోరాలి. ‘ఆయన రహస్యంగానే ఉంటాడు. రహస్యంగానే వింటాడు’
(మత్తయి 6:4).