శ్రీశుక ఉవాచ- రాజేంద్రా! రామకృష్ణులు గోపకులతో కూడి బృందావన ధామానికి దూరంలో గోవులను మేపుతున్నారు. అది మండు వేసవి. చండ కిరణుని ఎండ తాపం భరించలేక దండి చెడి- బడలిపోయి గోప కుమారులు తరుల దండ- వృక్ష సమూహాలను అండగా గైకొన్నారు. గొడుగుల వలె నీడలు ఇస్తున్న ఆ చెట్లను చూచి కడు వేడుక పడి గోప బాలకులు శ్రీకృష్ణ బలరామాదులతో ఇలా నుడివారు..
మ॥ ‘అపకారంబులు సేయవెవ్వరికి నేకాంతంబు లందుండు నా
తప శీతానిల వర్ష వారణములై త్వగ్గంధ నిర్యాస భ
స్మ పలాశాగ్ర మరంద మూల కుసుమ చ్ఛాయా ఫలశ్రేణిచే
నుపకారంబులు సేయు నర్థులకు నీ యుర్వీజముల్ గంటిరే?’
‘మిత్రులారా! ఈ మ్రానులను చూడండి. ఎవ్వరికీ ఎలాంటి హాని కలిగించవు. ఒకరి జోలి- జోక్యం లేకుండా, కాని పనులకు పోకుండా ఏకాంతంగా ఉంటాయి. ఎండ వాన చలిగాలి మంచుల బారి నుండి ఆశ్రయించిన వారిని రక్షిస్తాయి. కోరువారికి భూరిగా- జోరుగా తమ పట్టలు- బెరళ్లు, గంధం, జిగురు, భస్మం, చిగురుటాకులు, తేనెలు, వేళ్లు, పూలు, పండ్లు సమంచితంగా పంచి ఇచ్చి ఎంతగానో మేలుచేస్తాయి.’ ఇలా చెప్పుకొంటూ బాలలందరూ తిన్నగా కాళిందీ తీరానికి చేరుకున్నారు. అందులో ఉన్న పెద్ద మడుగులో మెల్లగా పశువులకు చల్లని నీరు తాగించి, ఆ దగ్గరలోనే వాటికి కసవు మేపుతూ… ‘అన్నా! ఆకలి వేస్తోంద’ని కన్నయ్యకు విన్నవించారు. తన భక్తురాండ్రగు ముని భార్యలను కనికరింపదలచి వనమాలి మాధవుడు ఆ యాదవ బాలురతో… ‘వల్లవ కుమారులారా! ఈ వనంలో వేదవేత్తలైన విప్రులు స్వర్గలోక ప్రాప్తికై ఘనంగా ఆంగిరసమనే జన్నం- యజ్ఞం చేస్తున్నారు. వారి చెంతకు వెళ్లి నేను అడిగానని ఇంత అన్నం అర్థించి తెండి’ అని అన్నాడు. శుకముని ఔత్తరేయునితో- అవనీపతీ! గొల్లపిల్లలు గ్రద్దన- వేగంగా యాగశాల వద్దకు వచ్చారు. గగనం దద్దరిల్లే విధంగా నిగమ- వేదధ్వని వినిపిస్తోంది. జన్నపు పెద్దలను కని మ్రొక్కి పిన్నలు… ‘అవనీ సురు(బ్రాహ్మణు)లారా! ఓ మహనీయులారా! బలరామకృష్ణులు వని- అడవిలో పసువులను మేపుతూ అలసి ఆగొన్నారు. దయచేసి అన్నం పెట్టండి’ అని అర్థించారు.
మ॥‘క్రతువున్ మంత్రము దంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దే
వతయున్ ధర్మము నన్యముల్ దలప నెవ్వాడట్టి సర్వేశ్వరున్
మతి నూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిం జూచి దు
ర్మతులై యన్నము లేదు లేదనిరి సమ్మాన క్రియా శూన్యులై.’
వైదిక కర్మలు, మంత్రాలు, తంత్రాలు, హవిస్సులు, పుణ్యకాలాలు, పవిత్ర స్థలాలు, ఇంద్రాది దేవతలు, యజమాని, అవికల- సంపూర్ణ యాగఫలమూ, ఈ సకలం ఏ మహావిష్ణువో, ఆ అకలంకుడే- మాయాదూరుడే అరవిందాక్షుడు కృష్ణుడని, అజ్ఞతతో అంతరంగంలో భావించలేక, కేవలం నందసుతుడని- గోపబాలకుడని తలచి ఆ విప్రులు మందమతులై, గోవిందుడు పంపిన గొల్లపిల్లలను ఆదరించక ‘అన్నం లేదు లేద’ని అదలించి పొమ్మన్నారు. స్వర్గాది తుచ్ఛఫలాలు ఆశించి యాగాలు సాగిస్తున్న వీరు జ్ఞాన దృష్ట్యా బాలురు- అజ్ఞానులైనా తమను తాము జ్ఞానవృద్ధులుగా భావించే వ్యర్థులు!
రాజా! నిరాశతో మరలివచ్చిన బాలురను శోకరహితుడు, మురళీ మనోహరుడు లోక మర్యాదను అనుసరిస్తూ… ‘అరే! ఎంతటి వెర్రివాళ్లురా మీరు? ‘భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’ ఆకలి బాధ అమ్మలకు- అన్నపూర్ణలకు తెలుసు కాని అయ్యగార్లకేం తెలుసు? ‘క్షుధా తృషార్తాః జననీం స్మరంతి’ (ఆకలి దప్పులతో అల్లాడు పిల్లలు తల్లినేగా తలచేది) పిల్లలూ! మీరీమారు ఆర్యులను- పెద్దలను కాక వారి భార్యలను అడగండి’ అంటూ వారిని మరల పంపాడు. ఆనక, వారంతా యాగశాల వెనుక నుంచి లోనికి చని, భాసురంగా- వెలిగిపోతున్న భూసురుల భార్యలను- వాసుదేవుని భక్తురాండ్రను కని, అవనికి తలలు తాకించి నమస్కరించారు. తమను ఆదరించిన అన్నపూర్ణ స్వరూపలకు ఇలా విన్నవించారు- ‘ఓ బుద్ధిమతులారా! గోవిందుడు గోవులను మేపుతూ అలసి ఆగొన్నాడు. ఓ తులసీమతల్లులారా! మిమ్ములనడిగి అన్నం తెండని మమ్ము పంపించాడు. రండమ్మా! అన్నం పెట్టండమ్మా!’
శుకుడు- రాజా! ఆ పలుకులు ఆలకించి ‘నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా’ అని మనసున భావించే ఆ పతివ్రతామ తల్లులు పరవశించి పోయారు. నిత్యం కృష్ణ కథా శ్రవణ సంస్కారం వలన పరమాత్మ దర్శనం కొరకు పరితపించారు. వారికి యజ్ఞవిధిలో చిత్తం లేదు. యజ్ఞేశ్వరుని నైవేద్యంతో నిమిత్తం లేదు. తాము తినడంతో అస్సలు పనేలేదు. అయస్కాంత అచలం ఆకర్షించిన సూదుల్లాగా, పల్లానికి పారే జలధారల్లాగా, ‘సముద్రమివ నిమ్నగాః’ (భాగవతం)- సాగరుని చేర నరిగే సరిత (నదు)ల లాగా, బిడ్డలు భర్తలు తోబుట్టువులు, బంధువులూ- ‘హద్దు మీరుతున్నారు, వెళ్లవద్దు. వెళితే తిరిగి వద్దకు రానివ్వం’ అని గద్దరిస్తు- అరుస్తున్నా, ‘అడ్డగించకండి, తప్పుకోండి’ అంటూ కడలికేసి వెడలే నదులు చిరు కట్టలకు నిలువనట్లు; ‘పచామ్యన్నం చతుర్విధం’ అన్నట్టు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు- పలు విధాల పానీయాలతో అన్నం విడివిడిగా పాత్రల్లో పళ్లేరాల్లో నింపుకొని విప్ర వనితలు అప్రమత్తలై, సుప్రసన్నలై కలివిడిగా, వడి-వడిగా తరలిపోయారు. అలా వెళ్లి కాళిందీ తీరంలో క్రొంజిగురు జొంపాలతో ఇంపారుతూ- కొత్త చిగుళ్ల గుబురులతో అందగిస్తూ, వనచరుల వేదనలు హరించే ఒక అశోక వృక్షం క్రింద, సుందర ప్రదేశంలో సందడి చేస్తున్న నందనందనుని అరవింద నేత్రలు (విప్ర పత్నులు) సందర్శించారు.
క॥ ‘కని లోచన రంధ్రంబుల
మునుమిడి హరి లలిత రూపమును లోగొని నె
మ్మనముల బరిరంభించిరి
తను మధ్యలు హృదయ జనిత తాపము వాయన్’
రాజా! శ్యామసుందరుని, కామ జనకుని, వనమాలా విరాజితుని… ‘భువన మోహన నటవేష భూతివాని, గనిరి కాంతలు కన్నుల కఱవుదీర’… జగాలను సమ్మోహపరచే నటవేషంతో జిగేలుమను వానిని ఆ రామలు- ఉత్తమ స్త్రీలు కన్నుల కరవు తీర కనుగొన్నారు. నళినాయతాక్షుని ఆ సుందరరూపాన్ని నయన ద్వారాల గుండా మనో మందిరాలలో పదిలంగా నిలుపుకొని త్రివిధ తాపాలు తొలగునట్లు హృదిలోనే కౌగిలించుకొన్నారు. సర్వాంతర్యామి శ్రీకాంతుడు వారి ఆంతర్యాన్ని గ్రహించి, తదేకంగా చూస్తూ, చిరునవ్వు చిందిస్తూ, అభినందిస్తూ ఇలా అన్నాడు… ‘కాంతా రత్నములారా! మీమీ గృహాలలో అంతా కుశలమే కదా? మీరెంతో ఉల్లాసంతో ఫలాపేక్ష లేకనే- నిష్కామంగా ఏకాంత భక్తితో మా చెంతకు ఏతెంచారని మాకు తెలుసు. సంతోషం! మీ వలెనే బుద్ధిమంతులు నిష్కామభావంతో నన్ను సేవించి శ్రీమంతులు- మోక్షభాగులవుతారు. సతులారా! మీ పతులు నిర్వహించే క్రతువు నిర్విఘ్నంగా నెరవేరడానికి మీరిప్పుడే యజ్ఞశాలకు వెళ్లండి.’ పుణ్యసతులు… ‘పురుషోత్తమా! ఇంత పరుషంగా పలకడం నీకు తగునా? మా మగవారందరూ వారించినా నీ యందలి చనువుతో నీ చరణాల చెంతకు చేరాము. తీరా ఇప్పుడు మరలిపోతే, దామోదరా! మమ్ములను వారు చేరదీస్తారా? సారసాక్షా! మాకది సమ్మతం కాదు. వాసుదేవా! నీదే భారం. నీ దాసీజనంగా భావించి రక్షించు.’ అని అతిదీనంగా విన్నవించుకున్న వనితలతో పన్నగశాయి ఇలా పలికాడు… ‘సతులారా! నాకు సమర్పితలైన పుణ్యవతులు కనుక, మీ పతి సుతాదులు మీయందు కినుక పూనరు- నొచ్చుకోరు. దేవతలు సైతం మిమ్ములను మెచ్చుకుంటారు. నా సన్నిధి ముక్తికి పెన్నిధి! నా మాటలు నమ్ముట మీకు విధి.’ పిమ్మట శ్రీహరి ఆ సాధ్వీమణులు అర్పించిన ఆహారాన్ని తోడివారితో కూడి ఆరగించాడు.
క॥ ‘పరమేశ్వరార్పణంబుగ
బరజనులకు భిక్షయిడిన బరమ పదమునం
బరగెదరట! తుది సాక్షా
త్పరమేశుడు భిక్షగొన్న ఫలమెట్టిదియో?’
శుకుడు- రాజా! ‘పరమేశ్వరార్పణమస్తు’ అంటూ పరులకు భిక్ష పెడితే పరమపదం ప్రాప్తిస్తుందే! అలాంటిది- ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడే భిక్ష స్వీకరిస్తే కలిగే ఫలం ఇది, ఇట్టిది అని ఎవరు గట్టిగ చెప్పగలరు? విప్ర వనితలకి యజ్ఞం వెయ్యి రెట్లు పండిపోయింది. సర్వేశ్వరుడు, సర్వరూపుడైన శ్రీహరికి ఆహారం నివేదించి తమ ధర్మపత్నులు ధన్యురాండ్రు అయ్యారని తెలిసి ఆ బ్రహ్మవాదులు- బ్రాహ్మణులు పశ్చాత్తప్తులయ్యారు. ‘విప్రాః పశ్చిమ బుద్ధయః’- ‘ఉర్వీసురులకు- విప్రులకు పెడతలనుండు బుద్ధి’ అన్న ఆర్యోక్తని అయ్యవార్లు అన్వర్థం- సార్థకం చేసుకున్నారు. చేతులు కాలినాక ఆకులు తడుముకొన్నారు.. ‘కటకట! మోసపోయితిమి, కాంతల పాటియు బుద్ధిలేదు’- అయ్యయ్యో! ఎంత మోసపోయాం! మన అతివ (భార్య)లకున్నంత మతి కూడా మనకు లేకపోయెనే? ఇంత దుర్గతి పాలయితిమే! వాసుదేవుని దర్శనానికి వెళ్లకపోతిమే! మనం దుష్టచిత్తులం, పరమ పాపాత్ములం. దామోదరునికి దూరమైన మన ప్రజ్ఞలెందుకు? తపస్సులు, తీర్థయాత్రలు, నియమనిష్ఠలు, యజ్ఞాలు, శీలసదాచారాలు ఎందుకు? తగుల వేసేటందుకా?
క॥ ‘జప హోమాధ్యయనంబులు
దపములు వ్రతములును లేని తరుణులు హరి స
త్కృప బడసి, రన్ని గలిగియు
జపలత బొందితిమి భక్తి సలుపమి నకటా?’
– ‘జపాలు, హోమాలు, వేదాధ్యయన తపోవ్రతాలు- ఇవి ఏవీ లేని అబలలు అచ్యుతుని అనుగ్రహానికి పాత్రమయ్యారు. ఇవన్నీ ఉన్నప్పటికీ భక్తికి నోచుకోనందు వలన మనం బుద్ధి చాంచల్యానికి గురియై విచ్యుతులం- పతితులం అయ్యాం. శ్రీమహాలక్ష్మిచే నిత్యం సేవలందుకునే ఆ భగవంతుడు విష్ణువు మనలను అన్నమడుగమని పంపడం- ఆ యాచన ప్రజలను మోహపెట్టేది కాదా! కృష్ణుని విష్ణువుగా గుర్తింప లేకపోవడం మన గొప్ప మౌఢ్యం కదా!’. యజ్ఞాలు చేస్తున్నారే కాని యజ్ఞఫల భోక్త ఎవ్వడనే విజ్ఞత- జ్ఞానం వారికి ఉన్నట్టు లేదు. శుకుడు- రాజా! ఆ విప్రపుంగవులు పరిపరి విధాల పశ్చాత్తాపం చెంది కూడా కంసుడి భయం వలన బలరామకృష్ణుల దర్శనానికి వెళ్లలేదు. ఆ శ్రీహరిని స్మరిస్తూ ‘ఆ నందనందనునికి ఇవే మా వందనాలు’ అంటూ తమ అపచారాన్ని క్షమించమని అక్కడి నుండే దండాలు పెట్టారు.’