అల్లాహ్ ద్వారా మానవాళి కోసం అవతరించిన దివ్య గ్రంథం.. ‘ఖురాన్’. ఇహ, పరాల్లో జీవిత సాఫల్యతకు దారిచూపే నైతిక సూక్తుల భాండాగారం ఈ గ్రంథరాజం. ఖురాన్లోని విషయాలు సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. మనుషులు ఎలా జీవించాలి? స్త్రీ, పురుషులకు ఉండే వేర్వేరు బాధ్యతలు ఏమిటి? మానవత్వానికి అర్థం ఏమిటి? ధైర్యానికి నిర్వచనం ఏమిటి? వివాహ ధర్మాలేమిటి?.. ఇలా మనిషి జీవితానికి సంబంధించిన సమస్త అంశాలకు మార్గ నిర్దేశం చేసే అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆ గ్రంథంలోని ముఖ్యాంశాలను మననం చేసుకుని మనసా, వాచా, కర్మణా ఆచరిద్దాం.
ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. ఎక్కువమంది చెప్పిందే సత్యమని భ్రమపడకుండా ప్రవక్తలు చెప్పిన సత్యాలనే నిజమని నమ్మాలి. ఎదుటివారికి నీతులు బోధించే ముందు మనం వాటిని ఆచరించాలి. ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఇతరులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎవరినీ గుడ్డిగా అనుసరించకూడదు. వడ్డీకి అప్పు ఇవ్వరాదు. పాపపు పనులు, దౌర్జన్యాలు చేసే వారికి సహకరించకూడదు.
ఇతరులతో మృదువుగా మాట్లాడాలి. పరిచయస్తులతో ఆప్యాయంగా మెలగాలి. ఇతరుల సంపదను అయాచితంగా ఆశించకూడదు. ఒకరి ఉన్నతిని చూసి అసూయ చెందకూడదు. వీలైతే మంచిపనుల్లో ఇతరులకు తోడ్పాటు అందించాలి. ఇతరుల రహస్యాలు వినకూడదు. ఒకరి గురించి ఇంకొకరికి చాడీలు చెప్పకూడదు. ఇతరుల తగాదాలకు తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు న్యాయం ఎటువైపు ఉందో వారికి అనుగుణంగా తీర్పునివ్వాలి. తప్పు చేసినవారికి తగిన శిక్షను విధించాలి. ఇతర మతాల విశ్వాసాలనూ గౌరవించాలి. వారితో సామరస్యంగా మెలగాలి. అన్న పానీయాలను వ్యర్థం చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలి.
అల్లాహ్ ప్రసన్నత కోసం పాటుపడాలి. నిరుపేదలకు సాయం చేయడం కూడా దైవారాధనే అని తెలుసుకోవాలి. అల్లాహ్ కారుణ్యం ఆలస్యమైనా నిరాశ చెందకుండా నిరీక్షిస్తూ ఉండాలి. సన్యాసం జోలికి పోకుండా సంసార బాధ్యతలను నిర్వహిస్తూనే దైవాన్ని ప్రార్థించాలి. పరిశుద్ధతను పాటిస్తూ ఖురాన్ పఠించాలి. తరచూ సంప్రదాయ వస్త్రధారణలో మసీదుకు వెళ్లి నమాజ్ చేయాలి. మసీదులకు వెళ్లే వారికి అడ్డు పడకుండా దారి ఇవ్వాలి. పరిశుభ్రతను పాటించాలి.
లంచగొండితనానికి పాల్పడకూడదు. శత్రు దేశంతో యుద్ధం వచ్చినప్పుడు వెన్ను చూపకూడదు. శత్రువులతో చేతులు కలిపి మనం ఉంటున్న రాజ్యానికి ద్రోహం చేయకూడదు. రాజ్యాధికారానికి అర్హత కలవారినే పాలకులుగా ఎన్నుకోవాలి. మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదు, వాటిని అమ్మకూడదు. జూదానికి దూరంగా ఉండాలి. వ్యాపారం చేస్తున్నట్టయితే కొలతలు, తూనికలలో మోసాలకు పాల్పడకూడదు. నిస్సహాయులు ఎవరైనా శరణు కోరితే, వారికి కొంతకాలం మన ఇంట్లో ఆశ్రయమివ్వాలి. ఇతరులతో పని చేయించాల్సి వచ్చినప్పుడు వారి సామర్థ్యానికి మించి భారం వేయకూడదు.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076