అథ ఖలు క్రతుమయః పురుషో
యథా క్రతుః అస్మిం లోకే పురుషో భవతి !
తథేతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత !
‘పరమాత్మ యజ్ఞమయుడు. ఈ లోకంలో మానవుడు ఎటువంటి పుణ్యకర్మలు చేస్తాడో, అటువంటి కర్మలకు తగిన పుణ్య లోకాలను మరణానంతరం పొందుతున్నాడు’ అని పై శ్లోకానికి భావం. దేవేంద్రుడిని ‘శతక్రతువ’ని గౌరవంగా సంబోధిస్తారు. అంటే నూరు యజ్ఞాలు చేసిన వాడని భావం. వృత్రాసురుణ్ని వధించడం వల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకున్నది. కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోవలసి వస్తుంది. స్వర్గానికి రాజు లేకపోవడంతో దేవతలు అందరూ సమాలోచించుకొన్నారు. దేవేంద్ర పదవికి యోగ్యుడైనవాడు భూలోకంలోని నహుషుడని తీర్మానించినారు. ఆయన చంద్రవంశానికి చెందిన మహారాజు. ధర్మాత్ముడు. అనేక రాజసూయ, అశ్వమేధాది గొప్ప యజ్ఞాలు చేశాడు. వేదోక్తంగా బ్రాహ్మణులను సత్కరించాడు. అపారమైన ధనాన్ని రుషులకు, ఎంతోమందికి దానం చేశాడు. అహంకారం లేకుండా సేవాభావంతో ప్రజలను ధర్మ మార్గంలో పాలించాడు. దేవేంద్ర స్థాయికి సమానుడు అని భావించి దేవతలు, రుషులు ఆయన్ను కలిసి, ప్రార్థించారు. స్వర్గ లోకానికి రప్పించి తాత్కాలికంగా ఇంద్రపీఠం మీద ఆసీనుడిని చేశారు.
నహుషుడి పాలన కొన్నాళ్లు సజావుగానే కొనసాగింది. క్రమంగా అతనికి అహంకారం నెత్తికెక్కింది. అధికారానికి మరిగాడు. తాను ఇంద్రుడైనందున.. ఇంద్రుని భార్య శచీదేవి తనకు భార్య కావాలని కబురంపాడు. శచీదేవి ఒక ఉపాయం ఆలోచించి సప్త రుషులు మోసే పల్లకి మీద వస్తే అంగీకరిస్తానన్నది. నహుషుడు ఆదేశించగా సప్తర్షులు పల్లకి మోశారు. అగస్త్యుడు పొట్టిగా ఉండడంవల్ల నడిచేటప్పుడు పల్లకి ఊగిసలాడింది. తొందరగా వెళ్లాలనే ఆరాటంతో నహుషుడు ‘సర్ప సర్ప’ అన్నాడు. అంటే త్వరగా త్వరగా అని భావం. అంతేకాదు కాలితో తన్నాడు. ఆగ్రహించిన అగస్యుడు ‘సర్పానివై పడిపో’ అని నహుషుణ్ని శపించాడు. తక్షణమే నహుషుడు కొండచిలువై భూమిపై పడిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే శ్రేయస్కరమని నహుషుడి వృత్తాంతం తెలియజేస్తుంది. అహంకారానికి లోబడితే ఎంతటి వాడికైనా పరాభవం తప్పదని హెచ్చరిస్తుంది.