ఇటీవల విడుదలైన ‘కరుప్పు’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ అగ్ర హీరో సూర్య. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300కోట్ల మైలురాయిని దాటింది. గత కొంతకాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న సూర్య కెరీర్‌కు ‘కరుప్పు’ మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. తనకు ‘జై భీమ్’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో సూర్య మరో సినిమా చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇదొక డాక్టర్ బయోపిక్ అని తెలిసింది. చెన్నైలో ఛాతీ వైద్యుల నిపుణుడిగా, పేదల పాలిట పెన్నిధిగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చెన్నై ఫిల్మ్‌నగర్ టాక్. కేవలం 5 రూపాయల ఫీజుతో పేదప్రజలకు వైద్యాన్నందించి సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ కృష్ణ వరదాచారి. వైద్యపరంగా ఆయన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసిన ఈ లెజండరీ డాక్టర్ జీవితంలోని ముఖ్యఘట్టాలను తీసుకొని సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.