వేద పురాణేతిహాసాల పుట్టిల్లు భారతదేశం. ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిన వేద పురాణేతిహాసాలలోని కథలను, జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు. ఆ జ్ఞానంతో మంచిచెడులను విశ్లేషించుకుంటాడు. ఆయా పాత్రలను తలచుకుని.. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అనుకుంటాడు. అనుకున్నది ఎంతవరకు ఆచరిస్తాడంటే కాలధర్మానికి కట్టుబడి మాత్రమే మనిషి జీవించగలుగుతాడు. కానీ, అనుకున్నదంతా ఆచరించి.. ఆ ఆనందంతో జీవించలేడు. ఈ నేపథ్యంలో వేదాలు ప్రభు సమ్మితాలని, శాస్ర్తాలు మిత్ర సమ్మితాలని, కావ్యాలు కాంతా సమ్మితాలని పండితులు చెప్పారు. ఆ దృష్టితోనే వాటిని చదివితే బాగుంటుందనిఅన్నారు. అనడం వరకు బాగానే ఉంది కానీ అందరి దృష్టి ఒకే విధంగా ఉండదు. ఒకే విధంగా ఉందామన్నా కాలం ఉండనివ్వదు. ఇది జగమెరిగిన సత్యం.
భాగవత ప్రియులు విష్ణుమూర్తి పదో అవతారం కల్కి అవతారం అంటారు. కొంచెం భాగవతాన్ని అధ్యయనం చేసినవారు కపిలుడు, యజ్ఞుడు వంటి అవతారాలను కలిపి విష్ణుమూర్తి 21 అవతారాలను ధరించాడని చెబుతారు. ఇంకా వేద పురాణేతిహాసాల మూలాల్లోకి వెళ్లిన వారు విష్ణుమూర్తి రమారమి 45 అవతారాలను ఎత్తి దుష్ట శిక్షణ చేశాడని వివరించారు. కలియుగాంతంలో కల్కి అవతరించి దుష్టశిక్షణ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని, అందులో మానవ జన్మ అతి పవిత్రమైనదని పండితులు అంటారు. అన్ని రకాల జీవరాశులను అందరూ చూశారా? అంటే ఏడు లక్షల జీవుల రూపాలు భూమ్మీద, ఏడు లక్షల జీవుల రూపాలు నీటిలో, ఏడు లక్షల జీవుల రూపాలు అగ్నిలో, ఏడు లక్షల జీవుల రూపాలు గాలిలో అంటూ లెక్కలు చెబుతారు. అందరూ అన్నీ చూడలేరు అన్నది ఎంత నిజమో గతమంతా అజ్ఞానం, కాలక్షేప పురాణం అనుకోవడం తప్పు అన్నదీ అంతే నిజం.
వేదపురాణ ఇతిహాసాలు అనగానే మనకు ముందుగా వాల్మీకి రామాయణం, వ్యాసుని మహాభారతం, భాగవత కథలు గుర్తుకువస్తాయి. ఆపై అందులోని పాత్రలు కండ్ల ముందు కదలాడతాయి. మానవ జీవన కుటుంబ చదరంగ రూపమే రామాయణం. అది స్వార్థ నిస్వార్థ త్యాగ ఆధ్యాత్మికతల సుందరవలయం అని రామాయణం గురించి కొందరంటే, మానవ జీవితమే ఒక మహాభారతం.. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం అని మరికొందరు అన్నారు.
రామాయణ భారతాల్లోని పాత్రలు ఏయే సురరాక్షసాది అంశలతో జన్మించారో కూడా ఆయా పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల పునర్జన్మల మీద నమ్మకం పెంచడం ఒక ఎత్తయితే, ఆయా పురాణ పురుషులు గత జన్మలో ఎలాంటివారో తెలియడం వల్ల ఆ కాలంలో వారివారి గుణగణాలు ఎలాంటివో కొన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది. గత జన్మ వాసనల ప్రభావంతో వారు అలా ప్రవర్తించారు, ఇలా ప్రవర్తించారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. రామాయణంలో సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మిస్తే, ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. అదే భారతంలో సూర్యుడి అంశతో కర్ణుడు జన్మిస్తే, ఇంద్రాంశతో అర్జునుడు జన్మించాడు. విష్ణువు శ్రీరాముడిగా అవతరించి సుగ్రీవుడిని కాపాడాడు. అదే విష్ణువు శ్రీకృష్ణుడిగా ఇంద్ర అంశతో జన్మించిన అర్జునుడికి అండగా ఉన్నాడు. కృష్ణార్జునులే నరనారాయణులుగా పేరుగాంచారు.
ద్రోణునికి కామక్రోధాలు కలగలిపి అశ్వత్థామగా జన్మించాడని మహాభారతంలోని ఆదిపర్వం తృతీయ ఆశ్వాసంలో ఉంటే, రుద్రుడి అంశతో అశ్వత్థామ జన్మించాడని మరోచోట ఉంది. ఏదేమైనా అశ్వత్థామ మనుగడలో కామక్రోధాలతో కూడిన రుద్రత్వమే ఉంటుంది. ఇలా మన వేద పురాణేతిహాసాలు ఆయా పురాణపాత్రలు అలా ప్రవర్తించడానికి గల కారణాలను స్పష్టంగా వివరించాయి. ఆ తర్వాత తర్వాత కవిపండితులు పురాణ కథలను, పురాణ పాత్రలను అన్ని కోణాల్లో పరిశీలించి వాటిని విస్తరించకుండా పురాణపాత్రల గుణగణాలను తమతమ భావజాలానికి అనుగుణంగా మార్చేశారు. పురాణపాత్రల గుణాలను మార్చడం వల్ల సమాజానికి అవి దూరమవుతాయి తప్పించి వారు గొప్ప అనుకున్న పురాణ పురుషుడు.. సమాజానికి ఏ మేలూ చేయడు.
ఇక పురాణపాత్రలలో ఎవరు గొప్ప అంటే… నిజం చెప్పాలంటే ఎవరికి వారే గొప్ప! ఈ సృష్టిలో ఆది నుంచి అంతం వరకు కర్మఫలమే మనిషిని నడిపిస్తుంది. అయితే సామాజిక భావోద్రేకాలలో పడి మనిషి తనను తానే మరిచిపోతుంటాడు. ఏది మరిచిపోయినా, ఏది గుర్తు ఉన్నా మనిషి తన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. రాక్షస వంశానికి చెందిన రావణకుంభకర్ణ విభీషణులు ముగ్గురూ వేద వేదాంగాలు చదువుకున్న వారే. ధర్మం తెలిసిన వారే. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు మీదపడినా ధర్మం తప్పనివాడు విభీషణుడు ఒక్కడే. మిగతావారు తమ వ్యసనాలకు, తమ ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చి తాము చేసే పనుల్లోనే ధర్మం ఉందని ధర్మ వక్రీకరణ చేస్తూ కడకు కాలగర్భంలో కలిసిపోయారు. అందుకే అతి బలమైనది విధి అని అంటారు. దాని ముందు దైవనింద చేసినవారు సహితం తలవంచాల్సిందే.
ద్వాపరయుగ అంశతో శకుని జన్మిస్తే, కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడని మహాభారతం చెబుతున్నది. సుయోధనుడి ప్రాణ స్నేహితుడు కర్ణుడు. సూర్య భగవానుడి అనుగ్రహంతో కుంతీ కుమారికి కానీనుడిగా కర్ణుడు పుడితే, గాంధారి గర్భంలో కాకుండా వ్యాస భగవానునిచే సంరక్షణ పొందిన గాంధారి గర్భ పిండాల్లో మొదటి పిండం నుంచి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. సూర్య భగవానుణ్ని సూర్య నారాయణుడు అని అంటారు. వ్యాసుణ్ని వ్యాసో నారాయణో హరిః అంటారు. అంటే సుయోధనకర్ణుల పుట్టుకలో ఏదో ఒక రీతిన నారాయణుని ప్రమేయం ఉందని వారి జన్మ మూలాల్లోకి వెళితే తెలుస్తుంది. ఇక నర నారాయణులే అర్జున, కృష్ణులు అని తెలిసిందే. కాలధర్మాన్ని యుగధర్మాన్ని బాగా తెలుసుకుని కష్టనష్టాలను, సుఖశాంతులను, చీకటివెలుగులను సమానంగా స్వీకరించిన వారు పాండవులు. కలి అంశతో ద్వాపరయుగంలో జన్మించి యుగధర్మాన్ని, తదితర ధర్మాలను అనుసరించక తన అవసరం కోసం కర్ణుడిని
తన దగ్గరకు తీసుకున్న కలి అంశ ఉన్న ద్వాపరయుగ సంచార రారాజు సుయోధనుడు.
తన మనుగడ కోసం తనని ఆదరించిన రారాజు దుర్యోధనుడి కోసం ద్వాపరయుగ ధర్మాన్నే విస్మరించాలని అనుకున్నవాడు కర్ణుడు. ఇతగాడు ద్రౌపది వస్ర్తాపహరణ సందర్భంలో ద్రౌపదిని పట్టుకొని, ఏకవస్త్ర అయితేనేమి? విగతవస్త్ర అయితేనేమి? అని అంటాడు. అలా అనడం ద్వాపరయుగ ధర్మం కాదు. కలియుగ ధర్మం. కలి అంశతో పుట్టిన దుర్యోధనుడి ప్రభావం వల్ల అతను అలా అన్నాడు. నాలుగు రోజులు స్నేహం చేస్తే వారు వీరవుతారంటారు కదా? కర్ణుడు తనకు దుర్యోధనుడు ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడన్న అహంకారంతోనే నిండు సభలో ద్రౌపదిని అంతమాట అనగలిగాడు. ఇక వ్యాసభారతం చదివితే కర్ణుడు మహావీరుడు అనిపించదు.
కర్ణుడు ఉత్తర గోగ్రహణ సమయంలో ఓడిపోవడమే కాదు, తన తల కుచ్చులు ఉత్తర కుమారుడు కోసుకుపోతున్నా ఏం చెయ్యలేక పోయాడు. ఇక మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలోనూ, భీమసేనుడి చేతుల్లోనూ చావు దెబ్బలు తిని పారిపోయి మళ్లీ కొంత సమయం అయ్యాక యుద్ధానికి వచ్చాడు. బాగా మధువు తాగి సమరానికి వచ్చాడని కొందరంటారు. రెండు పాదాల మీద ధర్మం నడిచే ద్వాపరయుగంలో కర్ణుడు ఉన్నందుకుగానూ అతను మిత్రధర్మాన్ని అనుసరించి మంచి అయినా చెడైనా ఇంతే అంటూ దుర్యోధనుడి దగ్గరే ఉండి చివరికి సమరంలో ప్రాణం విడిచాడు. అతను అలా చేయడానికి ప్రధాన కారణం అతను ఉన్న ద్వాపరయుగ ధర్మం.
ఇక దుర్యోధనుడు కర్ణుడిని అవసరానికి ఉపయోగించుకోవాలని అనుకున్నాడు, కానీ కర్ణుడిని తన ప్రాణ స్నేహితుడిగా భావించలేదు. కర్ణుడు ఒకసారి యుద్ధరంగంలో ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు ద్రోణుడి ముందు కర్ణుణ్ని నిందిస్తాడు. అతనిలోని కలి అంశ అతనితో ఆ పని చేయించింది. రెండు పాదాల మీద ధర్మం నడిచే ద్వాపరయుగంలో పుట్టి రమారమి 128 ఏండ్ల ఆయుష్షు ఉన్న దుర్యోధనుడు చెయ్యరాని తప్పులెన్నో చేశాడు. 60 ఏండ్ల ప్రాయంలోనే చనిపోయాడు అని కొందరు అంటారు. ఏది ఏమైనా కలి అంశతో ఉన్న దుర్యోధనుడికి తాను ప్రాణ స్నేహితుడినని భావించాడు కర్ణుడు. కానీ, దుర్యోధనుడు మాత్రం అలా అనుకోలేదు. అదే అతనిలోని కలి అంశ ప్రభావం. ఏదేమైనా కొందరు కర్ణుడు జ్ఞానంలో గొప్ప అనుకుంటే… కోతలు కోయడంలో, మతిమరుపులో మహాగొప్ప అని చెప్పాలి. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం శాపాలు వరాలు తీసి పక్కనపెడితే అతివాగుడు మతిమరుపును పెంచడమే కాదు ఆయుష్షునూ తగ్గిస్తుంది అన్న సత్యం కలి ప్రాణ స్నేహితుడు కర్ణుడిలో కనపడుతుంది.
ఈ సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. కానీ, ఒకే కర్మ కలిగిన మనుషులు ఏడుగురు ఉంటారని ఎవరూ అనరు! అయితే వేద పురాణేతిహాసాల ధర్మం మీద అభిమానం ఉన్నవారు సహితం కొందరు నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అంటూ ఉంటారు. అది అసాధ్యమని మన పురాణ లెక్కలే చెబుతున్నాయి. ఎలాగంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే, త్రేతాయుగంలో మూడు పాదాల మీద నడుస్తుందంటారు. అదే ద్వాపరయుగంలో రెండు పాదాల మీద నడిస్తే కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద కుంటుతుందని పురాణాలే చెబుతున్నాయి.
మూడు పాదాల ధర్మం ఉన్న త్రేతాయుగంలో శ్రీరాముడు ఉన్నాడు కాబట్టే సీతమ్మను అగ్నిప్రవేశం చేయమన్నాడు. అదే నాలుగు పాదాల ధర్మం ఉన్న సత్యయుగంలో ఉండి ఉంటే, సీతమ్మను అగ్నిప్రవేశం చేయమనేవాడు కాదు. తనే అగ్నిదేవుని నడుమ నిలబడేవాడు అన్న ధర్మసూక్ష్మాలు ఎందరికి తెలుసు? ఇవి తెలియకుండా రాముడు సీతమ్మను ఎందుకు అగ్నిలోకి దూకమన్నాడు? సీత రాముణ్ని ఎందుకు అగ్నిలోకి దూకమనలేదు? వంటి నిందలు వేస్తే ప్రయోజనం శూన్యం. యుగధర్మాన్ని బట్టి కాలధర్మం నడుస్తుంది. కాలధర్మాన్ని అనుసరించి మనిషి నడవాలి. అంతే!
– వాగుమూడి లక్ష్మీ రాఘవరావు 98494 48947