e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home చింతన అవి ధర్మబద్ధం కావు!

అవి ధర్మబద్ధం కావు!

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరోజనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥

భగవద్గీత (3-21)

- Advertisement -

‘ఆచారం’ అంటే ‘నడవడి’. ఒకప్పుడు మన పెద్దలు ఏదైతే నడిచి చూపించారో అదే క్రమేపీ ఆచారంగా మారింది. దానివల్ల కలిగే ప్రయోజనాల నేపథ్యంలో అది ఒక నమ్మకంగా మారి, అది చేయకపోతే ఏమవుతుందో అనే భయమే దురాచారాలకు, మూఢనమ్మకాలకు దారితీసింది. ‘మూఢుడు, మూర్ఖుడు’ అంటే ‘మంచి చెడు ఆలోచించని వాడని’ అర్థం. ‘అంటితే’ (తాకితే) ఏదో అనర్థం, అనారోగ్యం’ అనే ఆచారం ద్వారా ‘అంటు’ ఏర్పడింది. ఇదే రకమైంది ‘అంటరానితనం’. ప్రాచీనకాలంలో తమ ప్రవృత్తితో ఎంచుకొనే వృత్తియే కులాలకు మూలాధారమైంది. ‘మడి’ అంటే ‘మడత వస్త్రమూ’, ‘స్వచ్ఛత’ అని అర్థాలున్నాయి. స్వచ్ఛతకోసం పరిశుభ్రమైన మడతతో ఉన్న వస్ర్తాలను ధరించి, మలినపు వస్ర్తాలను తాకకుండా సంప్రదాయవాదులు పూజలు చేసేవారు. ‘మడతనేదే’ ‘మడి’గా, ‘మలిన’మనేది ‘మైల’గా మారి, దురాచారాలు అయ్యాయి. ఇవి ఎంతమాత్రం క్షంతవ్యం కాదు.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

మనుస్మృతి (3-56)


‘ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు’ అని ‘మనుస్మృతి’ చెప్పినా, సృష్టికి మూలమైన స్త్రీల నడవడిని నియంత్రించడానికి అందులోని తర్వాతి అధ్యాయంలోనే మరో నియంత్రణ చేయడం గమనార్హం.

పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
రక్షన్తి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి

మనుస్మృతి (9-3)


ఇలా శాసించడంతో అదే ‘వెఱ్ఱితలలు’ వేసింది. భర్తను కోల్పోయిన స్త్రీలను పరపురుష సంగమం నుంచి నియంత్రించడం కోసం ‘ముండనం’ (తలవెంట్రుకలను తీసేయించడం), చులకనగా చూడటం, సతీ సహగమనం వంటి మూఢవిశ్వాసాలు ప్రబలినా ఇప్పుడవి అంతరించాయి. జనాభాలో స్త్రీ పురుషుల హెచ్చుతగ్గులనుబట్టి ఏర్పడినవే వరకట్న- కన్యాశుల్కాలు. ఒక వర్ణవ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి తప్ప మిగతా వాటినిగురించి వేదాలలోగానీ, రామాయణ మహాభారతాలలోగానీ ఎక్కడా ఇలాంటి అసాంఘిక చర్యలను సమర్థించడం జరుగలేదు. కనుక, వీటికి ఏ ప్రామాణికతా లేకపోవడమేకాక, మన సనాతన ధర్మానికి వీటితో ఎలాంటి సంబంధం లేదనే సంగతిని అందరూ గ్రహించాలి.

మూర్ఖపు విశ్వాసాలు, దురాచారాలు (ఉదా॥కు అంటరానితనం, అంట్లు, కులాల పట్టింపులు, మడి, వితంతు విరుద్ధ పనులు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం వంటివి) మన సనాతన ధర్మానికి బాగా చెడ్డపేరు తెచ్చాయి. అసలు ఇలాంటి అమానవీయ, అసాంఘిక, అద్వైత విరుద్ధ కర్మలకు ప్రామాణికత ఉందా? – ఆర్‌.విశ్వేశ్వర్‌రావు, రాయలాపూర్‌, మెదక్‌జిల్లా

శాస్ర్తుల రఘుపతి
73867 58370

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana