అసూయ మనిషికి ఉండకూడని లక్షణం. ఒకరికి దక్కిన దైవానుగ్రహాన్ని చూసి ఓర్వలేనితనంతో అది వారికి దక్కకుండా నశించాలి అని కోరుకోవడమే అసూయ అంటారు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహ్మ). అసూయ, ఈర్ష్య పెద్ద పాపాల కోవకు చెందినవి. అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే. ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, అసూయ, ద్వేషాలు వాటిని చూపిన వారినే దహిస్తాయి. ఈర్ష్య మూలంగానే షైతాన్ తొలిసారిగా అల్లాహ్ను ధిక్కరించాడు. ఖాబిల్ తన సోదరుడైన హాబిల్ని అసూయతోనే హత్య చేశాడు.
దైవప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన పట్ల చేసిన చెడు వ్యవహారానికి అసలు కారణం ఈ అసూయే. అందుకే అసూయకు అందరూ దూరంగా ఉండాలి. మనకు కావాల్సిన వాటిని స్వశక్తితో సంపాదించుకోవాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు.. ‘అసూయకు దూరంగా ఉండండి. ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే.. అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది. ఇతరులను చూసి అసూయ పడొద్దని, తోటి సోదరులతో మూడు రోజుల కంటే ఎక్కువగా (అయిష్టంతో) మాట్లాడకుండా ఉండొద్దని ప్రవక్త (స) హితోపదేశం చేశారు.
?ముహమ్మద్ ముజాహిద్, 96406 22076