సంప్రదాయం జీవ నది లాంటిది. అది నిరంతరం గతిని మార్చుకొని ప్రవహిస్తుంటుంది. కానీ, మౌలిక మైన జల లక్షణాన్ని కోల్పోదు. అలాగే ఆచారాలు కూడా! ఒక వ్యవస్థ ఎంతో ఆలోచించి ఏర్పరచిన ఆచారాలు, నియమాలు, పద్ధతులను అకారణంగా మార్చకూడదు. దానివల్ల వ్యవస్థను నమ్ముకొని, విశ్వసించేవారు క్షోభకు గురవుతారు.. ఇదంతా దేనిగురించంటే గత దశాబ్ద కాలంగా భద్రాద్రి రాముని గుడిలో గాడి తప్పిన రాములోరి ‘ప్రవర’ మార్పు గురించి..
ప్రవర అంటే హిందూ సంప్రదాయంలో ఒక వ్యక్తి తన గోత్రంలోని ప్రసిద్ధ మహర్షుల వంశానుగత పరిచయాన్ని తెలియజేసే ప్రక్రియ. వివాహం వంటి శుభకార్యాలలో అగ్నిదేవుణ్ని ప్రార్థిస్తూ తమ పూర్వికులైన ముగ్గురు, ఐదుగురు లేదా ఏడుగురు రుషుల పేర్లను ప్రస్తావిస్తారు. దేవతలకు సహజంగా గోత్రాలు ఉండవు, కానీ వారు అవతరించినప్పుడు లేదా భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వారికి గోత్ర ప్రవరలను ఆపాదించడం జరుగుతుంది. దేవుడు మానవ రూపంలో అవతరించినప్పుడు, ఆయన ఏ వంశంలో జన్మించారో ఆ వంశపు గోత్ర ప్రవరలను ధరిస్తారు. దశరథుని ఇంట జన్మించినందున, శ్రీరాముడికి రఘువంశానికి సంబంధించిన గోత్రం ఉంటుంది. దేవుడికి కల్యాణం జరిపించేటప్పుడు శాస్ర్తోక్తంగా దేవతలకు కూడా గోత్ర ప్రవరలను ఉచ్ఛరిస్తారు.
భద్రాచలంలో జరిపే శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతమైనది. కల్యాణ ఘట్టంలో వేద పండితులు శ్రీరాముడి ప్రవరను చెబుతూ ఆయన సూర్య వంశానికి (ఇక్ష్వాకు వంశం) చెందినవాడని, వాశిష్ఠ, మైత్రా వరుణ, కౌండిన్య త్రయార్షేయ అని ప్రవర చెబుతారు. రఘు వంశానికి చెందిన రాముడు… రఘు మహారాజు మునిమనుమడు, అజ మహారాజు మనుమడు, దశరథ మహారాజు కుమారుడు. అలాగే సీతమ్మవారి ప్రవరలో ఆంగీరస, ఆయాస్య, గౌతమ త్రయార్షేయ అని చెబుతారు. సీతాదేవి జనక మహారాజు పుత్రిక. మిథిలా నగర రాజవంశానికి (నిమి వంశం) చెందినది. ఆమె గోత్రం ఆంగీరస. సీతమ్మ వారు స్వర్ణరోమ మహారాజు మునిమనుమరాలు, హ్రస్వరోమ మహారాజు మనుమరాలు, జనక మహారాజు పుత్రిక. శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో ఈ గోత్ర ప్రవరలను వినడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇదిలా ఉండగా భద్రాచలంలో సీతారాముల కల్యాణంలో కొంత కాలం క్రితం సీతారాముల గోత్రాలను, ప్రవరలను మార్చారు. శ్రీరాముడి గోత్రం వశిష్ఠ అని, ప్రవరాన్ని నాభాగ, అజ, దశరథ అని జపించాలి. దీనికి విరుద్ధంగా, చినజీయర్ స్వామి వారు అనుసరించే ‘పాంచరాత్ర ఆగమ’ శాస్త్రం ప్రకారం.. దేవాలయంలో అర్చామూర్తిగా ఉన్న రాముడు కేవలం దశరథుడి కొడుకు (మనుష్యుడు) మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అందుకే ఆయనకు విష్ణుమూర్తి గోత్రమైన ‘అచ్యుత గోత్రం’ చెప్పాలని, రాముడిని ‘రామనారాయణుడు’ అని పిలవాలని.. సీతమ్మ వారిది గౌతమ గోత్రానికి బదులుగా సౌభాగ్య గోత్రం అని, ఆమెను ‘సీతా మహాలక్ష్మి’గా పేర్కొంటు ప్రవరలో మార్పులు సూచించారని ఒక కథనం. దాంతో అర్చకులు రామ నారాయణుని ప్రవరను పరబ్రహ్మ శర్మ, వ్యూహ నారాయణ శర్మ, విభవ వాసుదేవ శర్మ అని జపించారు. విష్ణుమూర్తి ప్రవరాన్ని సూచించేటప్పుడు ఉపయోగించే పేర్లు ఇవి. దాంతో ఈ మార్పులను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు అనుమతించారు. దీనికి భక్తులు నివ్వెరపోయారు. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి, అతిపెద్ద వివాదంగా ముదిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేయడం దాక వెళ్లింది.

భక్త రామదాసు వంశానికి చెందిన 12వ తరం వాడైన కంచర్ల వెంకటరమణ అనే భక్తుడు మొట్టమొదట 2022లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మరికొందరు భక్తులు కూడా రిట్ పిటిషన్లు వేశారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఉభయ పక్షాల వాదాలను విన్న కోర్టు ఈ విషయాన్ని నిపుణులకు నివేదించాలని ఆదేశించింది. భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన ఎండోమెంట్ రిజిస్టర్ను సమర్పించాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. తెలంగాణలోని ఇతర ప్రముఖ రామాలయాల్లో ఏ గోత్ర ప్రవరలను అనుసరిస్తున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను కోరింది. దీనిపై ప్రభుత్వం ఒక ఐదుగురు సభ్యుల నిపుణులతో కమిటీని నియమించి, అసలైన గోత్ర ప్రవరలు ఏమిటో నిర్ధారించమని ఆదేశించింది.
భద్రాచలం సీతారాముల గోత్ర ప్రవరలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ తన నివేదికను 2024 లోనే ప్రిన్సిపల్ సెక్రటరీకి, దేవస్థాన అధికారులకు అందజేసింది. భక్త రామదాసు కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలను, ఆలయ రికార్డులను సదరు కమిటీ విశ్లేషించింది. అంతేకాదు స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు ‘శ్రీమద్రామాయణ’ పారాయణదారుల నుంచి వివరణలు కోరింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించకుండా అధికారులు కాలయాపన చేస్తుండటం అసహనానికి గురిచేస్తున్నది. దాంతో కోర్టు ధిక్కరణ కింద అధికారులకు కోర్టు లీగల్ నోటీసులు కూడా జారీచేసింది. అయినా అధికారులు తాత్సారం చేయడం శోచనీయం. ఆలయ ఆచార వ్యవహారాలు ఆగమ శాస్ర్తాలకు లోబడి ఉంటాయని, కోర్టులు ఇలాంటి మతపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం సరికాదని కొందరు సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో తిరిగి వాదనలు మొదలయ్యాయి. పిటీషనర్ పక్షాన సీనియర్ అడ్వకేటు సీతారామమూర్తి ఈ నెల 16,17,18 తేదీల్లో జస్టిస్ సూరేపల్లి నంద బెంచ్ ముందు తన వాదనలు వినిపించారు. కేసు తిరిగి మార్చి 23వ తేదీకి వాయిదా పడింది. దీనిని బట్టి ప్రభుత్వం సైతం ప్రస్తుత మార్పులనే సమర్థిస్తున్నట్లు అర్థమవుతుంది. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతుండటంతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని భక్తులు భావిస్తున్నారు.
వాల్మీకి రచించిన రామాయణం బాలకాండ 70,71 సర్గలలో ఈ ప్రవరను వంశవృక్షంగా ప్రస్తావించడం కనిపిస్తుంది. శివ ధనుర్భంగం తదుపరి సీతారాముల వివాహం నిశ్చయమయ్యాక, విడిది ఇంటిలో దశరథుడు తన వంశం గురించి జనకునికి చెప్పవలసిందిగా వశిష్ఠుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు రాముని పూర్వికులైన సూర్య వంశ రాజుల గురించి వివరిస్తాడు. ‘నాభాగస్య బభూవాజః ఆజాద్దరథోభవత్ అప్మద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ( బాలకాండ సర్గ 70, శ్లోకం 43) అని స్పష్టంగా ఉంది. ఇందులో ‘రామనారాయణు’డి ప్రస్తావనే లేదు. ఆ తరువాత జనకుడు ‘ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే’ (బాలకాండ సర్గ 71, శ్లోకం 2) అని, కన్యాదాన సమయంలో తమ కులం వంశం గురించి చెబుతాడు. ఇందులో ‘దేవకన్యతో సమానమైన సీత’ ( మమ సుతాం సీతాం సురసతోప మామ్- శ్లోకం 21) అని మాత్రమే చెప్పాడు. మహాలక్ష్మి ప్రస్తావనే లేదు. ఏతావాతా చెప్పేదేమంటే.. శ్రీరాముడి ప్రవర మార్చడం అంటే ఆయన దశరథనందనుడే కాడనే అర్థం ధ్వనిస్తుంది. ఇది ఎంత వరకు సమర్థనీయం?! శ్రీరామ నవమి నాడు జరిగే సీతారాముల కల్యాణం లోక కల్యాణంగా ప్రసిద్ధి. చినజీయర్ స్వామివారి అభిప్రాయలకు (ఆదేశాలు కావు) ప్రాధాన్యం ఇచ్చి.. ప్రభుత్వం వాటినే అమలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ప్రజల మాట.