Sri Rama Navami | సీతారాములు ఒకే ఆత్మగా మసిలిన ఆదర్శదంపతులు. వారు ఇద్దరు కాదు.. ఒక్కరే అని చెప్పడానికి రామాయణమంతా నిదర్శనమే! వారి ప్రేమానురాగాలు, దాంపత్య జీవితాన్ని గురించి బాల, అయోధ్యకాండల్లో అందంగా వివరించారు వాల్మీకీ కవి. సుందరకాండలో చాలాచోట్ల సీతారాముల ఏకత్వాన్ని, ఎడబాటులోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని, వారిద్దరూ ఒకరేనంటూ రుజువు చేసే అంశాలను ఆవిష్కరించారు. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అనుబంధాన్ని హనుమంతుడు అనేక సందర్భాల్లో దర్శించాడు.
సీతమ్మను అశోకవనంలో చూసిన హనుమ ఆమె నిద్రాహారాలు మాని శ్రీరాముడి కోసం ఎదురుచూస్తున్నదనే విషయాన్ని గ్రహించాడు. సీతారాములు ఇద్దరు కాదు ఒక్కరే అన్న మాటకు నిదర్శనం అనడానికి రావణాసురుడితో సీతమ్మ పలికిన ఈ శ్లోకం నిదర్శనం.
శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా
అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా॥ (సుందరకాండ 21-15)
‘ఎట్టి ధనాశలకు గానీ, ఐశ్వర్యాది ప్రలోభాలకు గానీ నేను లొంగేదానిని కాను. సూర్యుడి నుంచి కాంతి వేరుకానట్టుగా శ్రీరాముడి నుంచి నేను వేరుగాను’ అని చెబుతుంది సీతమ్మ. ‘నీకు తెలియక సీతారాములు ఇద్దరు అని భ్రమిస్తున్నావు. మేమిద్దరం ఒకటే’ అంటుంది. రావణుడు వచ్చి సీతమ్మను పలురకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే గడ్డిపరకను అడ్డుపెట్టి… లంకేశ్వరుణ్ని గరికపాటిగా తీసిపారేస్తుంది. ‘రావణుడికి భార్యవైతే.. నీకు గౌరవం దక్కుతుంది’ అని సీతమ్మను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు రాక్షస స్త్రీలు. వారి మాటలకు కుంగిపోకుండా సీతమ్మ దృఢచిత్తంతో ఇలా పలుకుతుంది..
దీనోవా రాజ్యహీనోవా, యోమే భర్తా సమే గురుః
తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా॥ (సుందరకాండ 24-9)
‘దీనుడే కానీ, రాజ్యహీనుడే కానీ నా భర్తే నాకు ప్రత్యక్షదైవం. అతని పట్ల నా అనురాగం శాశ్వతం. శచీదేవి ఇంద్రుని, అరుంధతి వసిష్ఠుని, రోహిణి చంద్రుని, లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవన మహర్షిని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని, దమయంతి సైదసుని, కేశిని సగరుని, దమయంతి నలుని అనువర్తించినట్లే నేను ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ని అనుసరిస్తాన’ంటూ స్పష్టం చేస్తుంది సీతమ్మ. లోకంలో పతివ్రతా ధర్మం గురించి చెప్పేటప్పడు సుందరకాండ 24వ సర్గలోని 8 నుంచి 12 వరకు ఉన్న శ్లోకాలు ఉదహరించడం నేటికీ కనిపిస్తుంది. రామునితోడే జీవితం అనుకున్నది కాబట్టే సీతమ్మవారు అంతగొప్ప పతివ్రతగా గుర్తింపు పొందింది.
సీతమ్మ తన భర్త అయిన రాముణ్నే తలుచుకుంటూ నిద్రాహారాలు లేకుండా ఉండటం హనుమంతుడు ప్రత్యక్షంగా చూస్తాడు. రావణాసురుడితో మాట్లాడే సందర్భంలో తన భర్తను తూలనాడితే తాచుపాములాగా లేచి తన భర్త గొప్పతనాన్ని రావణుడికి వివరించిన మహాసాధ్వి ఆమె. సీతావియోగంతో రాముడు నిద్రాహారాలు మాని ఉన్నాడని, రుచికరమైన పదార్థాలు చూడగానే సీత గుర్తుకు వస్తున్నదని, క్షణమాత్రం నిద్రపట్టినా సీతా అని కలవరిస్తున్నారని సీతమ్మతో చెబుతాడు హనుమ. ఒకరి దగ్గర మరొకరు లేకున్నా నిరంతరం ఒకరినొకరు తలుచుకుంటూ నిద్రాహారాలు మాని ఒకరై దర్శనమిచ్చారు. కష్టకాలంలో, సుఖాల్లోనూ ఒకేలా తోడూనీడలా జీవించిన సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని గుర్తు చేస్తూ, వారిలాగా నూతన దంపతులు కలిసి జీవించాలని, ఎడబాటులోనూ విడిపోకుండా మనసా వాచా కర్మణా ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోవాలని రామాయణ ఇతిహాసం ప్రబోధిస్తుంది.
లంకానగరంలో రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పంటించినప్పుడు సీతమ్మ తన పాతివ్రత్యానికి తానే పరీక్ష పెట్టుకుంది. ‘నేను రాముడి పట్ల ఎంత ప్రేమగా ఉన్నానో రాముడికి కూడా నామీద అంతే ప్రేమ ఉన్నది నిజమైతే హనుమ తోకను తాకిన అగ్నిహోత్రం చల్లబడుగాక’ అని నమ్మకంగా చెప్పింది. ఆ వెంటనే వాలాన్ని కాలుస్తున్న మంట హనుమకు వేడికి బదులు చల్లదనాన్ని అందించింది.
కైకేయి రాముడిని అరణ్యవాసం చేయాలని కోరినప్పుడు.. సీతమ్మ కూడా వెంట వస్తానంటుంది. రాముడు వారిస్తాడు. ‘మీరు అరణ్యంలో కష్టపడుతుంటే.. నేను అంతఃపురంలో ఎలా ఉంటాన’ని అంటుంది. అయినా రాముడు అంగీకరించడు. అప్పుడు సీత కాస్త పదునైన మాటలతోనే రాముణ్ని విమర్శిస్తుంది. ఆ మాటలకు రామచంద్రుడు నొచ్చుకోకపోగా.. తనతో రావడానికే సీత అలా మాట్లాడిందని అర్థం చేసుకుంటాడు. తనతోపాటు వనానికి రావడానికి అంగీకరిస్తాడు.
సీతారాములు మానవతా ధర్మాన్ని, గృహస్థాశ్రమ విలువలను లోకానికి చాటిచెప్పిన వారు. తెలుగువారి శుభలేఖల్లో తప్పనిసరిగా ‘జానక్యా కమలామలాంజలిపుటే’ అనే శ్లోకం ఉంటుంది. అంతేకాకుండా ‘ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ’ అన్న జనకుని అప్పగింతల మాటలో సహధర్మచారిణిగా తన పుత్రిక శ్రీరాముడి నీడవలె అనుసరిస్తుందన్న శ్లోకం తెలుగునాట ప్రసిద్దికెక్కింది. అందుకే కంచి కామకోటి పూర్వ పీఠాధిపతి, నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు తరచుగా ఒక మాట చెప్పేవారు. కల్యాణ శుభలేఖ వేస్తే అందులో సీతారాముల ఏకత్వానికి గుర్తుగా వారి చిత్రం వేయాలని, సీతారాములు లేకుండా కల్యాణ శుభలేఖ ఉండొద్దని సూచించేవారట.
సమాజానికి కుటుంబం పునాది అనే భావనను ప్రకటిస్తూ కష్టకాలంలో కూడా సతీధర్మాన్ని, కుటుంబ విలువలను సీతారాములు ఎలా కాపాడారో రామాయణం చెబుతుంది. సీతమ్మతల్లి జీవితమంతా కష్టాలే అంటారు. కానీ, సుఖదుఃఖాల్లోనూ ఆమె మనసు రామవశమే. రామయ్య సీతమ్మ వశం. అందుకే వారిద్దరూ యుగాలు దాటినా ఆదర్శదంపతులుగా పూజలు అందుకుంటున్నారు. వారి కల్యాణం లోకానికి కల్యాణకరం.. సమస్త జగత్తుకు శుభకరం.
-రంగనాథ్ మిద్దెల ,9866573461