తిరుమల : సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న శ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, కమిషనర్ కుమరగురువరన్, టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, వీజీఓ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ తులసీప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.