శ్రావణ మాసం రాకతో వర్షరుతువు మొదలవుతుంది. పరిసరాలన్నీ పచ్చగా కళకళలాడే వర్షాకాలంలో వచ్చే శ్రావణంలో ఇళ్లన్నీ పూజాదికాలతో శోభిల్లుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ప్రత్యేకం. ఈ మాసంలో ప్రతి రోజూ, ప్రతి ఘడియా శుభసమయంగా పరిగణిస్తారు. ఈ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఆకాశంలో కలిగే మార్పులను, ప్రకృతిలో చోటుచేసుకునే పరిణామాలను సమతుల్యం చేయడానికి అనువైన మాసం శ్రావణం.
ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించే దిశగా ధర్మాచరణను పండుగగా ఆచరించే క్రమంలోనే శ్రావణ మాస నియమం ఏర్పడింది. మనసు మీద మంచి ప్రభావం చూపించి మానసిక ప్రశాంతత పొందడానికి, ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కలిగే అనార్యోగాల బారినుంచి కాపాడుకోవడానికి శ్రావణం అనువైనది. ఈ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించాలంటూ నియమబద్ధం చేయడం శ్రావణం పట్ల మహర్షుల ముఖ్య ఉద్దేశంగా చెప్పాలి. ఒకవైపు ఆధ్యాత్మికంగా, మరోవైపు శాస్త్రీయంగా ఈ మాసం సకల జనులకు శ్రేయస్సును కలుగజేస్తుంది.
శ్రావణ మాసంలో పండుగలు వెల్లువలా వస్తాయి. ఈ మాసంలో తెలుగునాట గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలతో, సందడి చేసే మహిళలతో ప్రతీరోజూ ఇంటింటా పండుగ వాతావరణం కనిపిస్తుంది. శ్రావణం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏరోజుకారోజు ప్రత్యేకమే! శ్రావణ సోమ, మంగళ, శుక్ర, శనివారాలు.. అంటే వారంలో నాలుగురోజులూ ఎక్కడ చూసినా స్త్రీపురుషులు వ్రత నియమాలతో కూడి ఆధ్యాత్మిక భావంతో కనిపిస్తారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని పూజించి వ్రతాలు చేయడం ఆచారం. శ్రావణం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా సోమ, శనివారాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ సోమవారాలు శివుడిని ఆరాధిస్తే, శనివారాల్లో వేంకటేశ్వరస్వామిని పూజించడం, ఉపవాసాలు ఉండటం గమనిస్తుంటాం.
తిథుల విషయానికి వస్తే.. విదియ రోజు అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవికి పూజలు చేయడం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు భార్యాభర్తలిద్దరూ హోమం చేస్తారు. పంచమి రోజు నాగుల పంచమిగా నాగమయ్యను పూజిస్తారు. శ్రావణపౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా రాఖీ వేడుకలు జరుగుతాయి. శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమిని జన్మాష్టమిగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకొంటారు. వీటితో పాటు నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి.. ఇలా ఎన్నో పండుగల సమాహారంగా శ్రావణం నెల రోజులూ పండుగశోభ కనిపిస్తుంది.
శ్రావణ పౌర్ణమి రోజు బ్రహ్మచారులు, గృహస్తులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీకగా భావించే యజ్ఞోపవీత ధారణతో జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం ఉంటుందని వేదోక్తి. ఇదే రోజు విష్ణుమూర్తి వేదాలను రక్షించడానికి హయగ్రీవుడిగా అవతరించడంతో శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకొంటారు. ఆ స్వామిని ఉపాసన చేస్తే ఏకాగ్రత, బుద్ధికుశలత, జ్ఞానం, ఉన్నత చదువు ప్రాప్తిస్తాయని ప్రతీతి. శ్రవణం వల్ల అంటే వినడం ద్వారా నేర్చుకోవలసినది వేదం. ఈ మాసాన్ని వేదాధ్యయన కాలంగా భావించి.. శ్రావణ పౌర్ణమి మరుసటిరోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. కొత్తగా ఉపనయనం అయిన వారికి జంధ్యాల పౌర్ణమి రోజు మౌంజీ బంధనం తొలగిస్తారు. ఈ మాసంలో వేద గ్రంథాల ముద్రణకు సహకరించినా, వేద విద్యార్థులకు గ్రంథాలు దానం చేసినా శ్రీమహావిష్ణువు సంతసిస్తారని పెద్దలు చెబుతారు.

ఇక శ్రావణమాసం రైతుల మాసంగా చెప్పాలి. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకోవడంతో గ్రామాల్లో పొలం పనులు జోరుగా సాగుతుంటాయి. శ్రావణ బహుళ అమావాస్య రోజున పొలాల అమావాస్యగా గ్రామాల్లో రైతులు పశువులను అలంకరించి పూజలు చేస్తారు. వర్షాకాలం చేపల వంటి జలచరాల సంతానోత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది కాబట్టి ఈ మాసాన్ని ప్రేమమాసంగా పిలుస్తారు.
సకలదేవతా వ్రతాలకు శుభసమయం శ్రావణం. తమ ఇల్లు సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని శ్రీమహాలక్ష్మిని, మంగళగౌరి అమ్మవారిని పూజిస్తారు. మహాలక్ష్మిని పూజిస్తూ చేసే వరలక్ష్మీవ్రతం ఈ మాసానికే ప్రత్యేకం. మహిళలు ఈరోజు కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని నిర్వహించి తమ ఇల్లు సుఖసంతోషాలతో, ఐష్టెశ్వర్యాలతో విలసిల్లాలని అమ్మవారిని పూజిస్తారు. తర్వాత ముత్తయిదువలకు వాయినాలు ఇస్తారు. ప్రతి గృహిణీ తన మాంగళ్యబలం కోసం మంగళగౌరిని ఆరాధిస్తుంది. కొత్తగా వచ్చిన కోడళ్లు ఐదేళ్లపాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణం కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన మాసంగా అందరూ అనుకుంటారు . కానీ ఈ మాసంలో స్త్రీలతో పాటు పురుషులు కూడా వ్రతనియమాలతో ఉంటారు. ‘పురుషానాం అయం మాసః శ్రావణం పరికీర్తితః’ అని పురాణోక్తి. అంటే ఈ మాసం పురుషులకు కూడా ప్రత్యేకమైనదే. చాతుర్మాసాల్లో ఒకటిగా ఉన్న శ్రావణంలో బ్రహ్మచారులు, గృహస్తులు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు, సన్యాసులు ప్రత్యేక వ్రతాలు చేస్తారు. స్కాంధపురాణ అంతర్గతమైన శ్రావణమాస వైభవంలో ఈ మాసంలో ముప్పై వ్రతాలు ఆచరించాలని మహర్షులు చెప్పారు. లవణ వ్రతం, దదీ వ్రతం, మౌన వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, వేంకటేశ్వరస్వామి ఏడువారాల వ్రతం, శ్రవణ నక్షత్రం రోజున సత్యనారాయణస్వామి వ్రతం.. ఇలా అనేక వ్రతాలకు నిలయం శ్రావణం. ఇదే నెలలో దేవుడి కోసం కూడా ఒక వ్రతం చేస్తారు. అదే పవిత్రోత్సవం. ఏడాది మొత్తంలో అర్చకులు చేసిన పూజలలో జరిగే లోపాలను సరిదిద్దుకుంటూ స్వామివారిని పవిత్రలతో అలంకరించి చేసే ప్రక్రియగా వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. .
శ్రావణ మాసం ప్రతీరోజూ భక్తి శ్రద్ధలతో, ఉపవాసదీక్షలతో కొనసాగుతుంది. ఈ సమయంలో మద్యమాంసాలకు దూరంగా ప్రతీ ఒక్కరూ నియమ నిష్ఠలతో భగవంతుని సేవలో తరిస్తారు. ఈ సమయంలో చేసే ఉపవాసాలు, ఉపాసనలు, వ్రతాలు మనిషి జీవన ప్రమాణాలను క్రమబద్ధీకరించి ఆయురారోగ్యాలను పెంచే శాస్త్రీయతను కలిగి ఉంటాయి. వర్షాల కారణంగా సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల జీవరాశికి విటమిన్ డి తక్కువగా లభిస్తుంది. ఈ లోపల జీర్ణవ్యవస్థను క్లిష్టంగా చేసి దాని పనితీరును నెమ్మదింపజేస్తుంది. మాంసాహారం తినడం వల్ల జీర్ణం కావడం కష్టమై వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైరస్లు ప్రబలే కాలం కావడంతో ఈ సమయంలో ఉపవాసదీక్షలు, సాత్విక ఆహారంతో తగ్గిపోతున్న రోగనిరోధకశక్తి సమతుల్యమై ఆరోగ్యం మెరుగవుతుంది. ఉపవాస సమయంలో ఈ రుతువులో లభించే పండ్లు, వ్రతాల్లో చేసే ఆరోగ్యకరమైన ప్రసాదాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు శాస్త్రీయంగా సకల ఫలాలనిచ్చే శుభసమయం శ్రావణం.