గంగానది తీరంలో వెలిసిన తీర్థరాజం కాశీ. ఈ క్షేత్రాన్ని పరమేశ్వరుడే స్వయంగా త్రిశూలాకారంలో రూపొందించాడని శివపురాణం చెబుతున్నది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చాటుతున్నాయి. ఎవరైనా ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే, ఆ దేహాన్ని పట్టిపీడించే పాపాలన్నీ పక్షి రూపంలో ఎగిరి, పొలిమేరలోని చెట్టుపై కూర్చుంటాయట. ఆ వ్యక్తి తిరుగు ప్రయాణంలో కాశీ పొలిమేర దాటగానే తిరిగి పట్టుకుందామని వేచి చూస్తాయట.
తొమ్మిది రాత్రులు పొలిమేరలు దాటకుండా కాశీలో ఉంటే, ఆ పాపాలు తిరిగి వారిని అంటవని, ఆ వ్యక్తులకు పునర్జన్మ ఉండదని స్వయంగా శివుడు పార్వతితో అన్నట్టుగా కాశీఖండం చెబుతున్నది. ఈ క్రమంలో కాశీకి వచ్చిన యాత్రికుల్లో నవరాత్రులు అక్కడే ఉండాలనే విశ్వాసం ఏర్పడింది. అయితే, మరో కోణంలో ఆలోచిస్తే, కాశీ క్షేత్రాన్ని ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా సందర్శించలేం. కనీసం తొమ్మిది రోజులు ఉండగలిగితే, ఆ క్షేత్రంలోని విశేషాలన్నిటినీ చూసే వీలుంటుంది.