శుకుడు పరీక్షిత్తుతో… మానవనాథా! దద్దన్న (వ్యర్థుడు) ఐన తన పెద్దన్న- రుక్మి చెడు తలపు గ్రహించి అన్నవ నీరజగంధి- కొత్త తామరల నెత్తావులు- సుగంధాలు విత్తు (వెదజల్లు) ఆ వైదర్భి- రుక్మిణి రానున్న ఆపదను తలచి మదిలో కడు ఆపన్నత- బాధపడ్డది. తన హితం కోరే ఆప్తుని, భాగవతోత్తముని అగ్నిద్యోతనుడను ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని ఇలా ప్రార్థించింది. ‘ఓ విద్వన్మణీ! గర్వంతో కన్నులు గానక నా పెద్దన్న, పెద్దలందరూ వద్దన్నా వినక నన్నిప్పుడు బాలిశు- మూర్ఖుడైన శిశుపాలునికి కట్టబెట్టనున్నాడు! ఎట్టి పరిస్థితిలోనైనా నీవు ద్వారక వెళ్లి పన్నగశాయి- వెన్నునికి నా అసహాయతను విన్నవించు. అయ్యా! నా అయ్య- తండ్రి కూడా తన తనయుని ఆలోచన తగదని తెగబడి- సాహసించి చెప్పలేకున్నాడు. మా అన్న ఆటలు సాగకుండా నీవు వేగంగా వెళ్లి, తన భక్తుల చిత్తవృత్తి ననుసరించి నడచుకునే హరికి నా ప్రణయ వృత్తాంతం ఎరిగించి ఇచ్చటికి పిలుచుకు రావాలి’ ఇలా అని ఆ మానిని మరికొన్ని రహస్యపు మాటలు ఆ మహీదేవునికి చెప్పింది.
అగ్నిద్యోతనుడు (జ్ఞానాగ్నితో దేదీప్యమానంగా ప్రకాశించువాడు- బ్రహ్మజ్ఞాని) శరవేగంతో ద్వారకాపురి చేరి, తన రాక వార్తాహరుల ద్వారా హరికి ఎరిగించి, గిరిధారి నివసించే నగరి- భవనంలోని కరిగి- ప్రవేశించి అందు బంగారు గద్దెపై నయగారా- అలంకారాలతో రంగారు (ఒప్పుచున్న) శృంగార రత్నాకరుని శౌరిని దర్శించాడు. ‘వరుడు’- పెండ్లికుమారుడవు కమ్మని ఆ గరుడ గమనుని విప్రవరుడు ఆశీర్వదించాడు. ధరామరు- బ్రహ్మణులను దైవంగా భావించే ఆ మురారి తన బ్రహ్మణ్యతను- బ్రాహ్మణ ప్రియత్వాన్ని ప్రదర్శిస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ గ్రద్దన- తటాలున తన గద్దె దిగి, అతణ్ని తన ఆసనంపై కూర్చుండజేసి, అమరులు తనను ఆరాధించునట్లు తాను ఆ ధరామరుని అర్చించాడు. ఇష్ట మృష్టాన్నం- షడ్రుచులతో కూడిన కమ్మని భోజనం పెట్టించి సంతుష్టుని చేశాడు. అంతట, రెట్టించిన ప్రేమతో వసుదేవు పట్టి వాసుదేవుడు ఆ భూసురోత్తముని చెంతకు చేరి, జగద్రక్షణలో ప్రశస్తమైన- ఆరితేరిన తన హస్తంతో అతని పాదాలు ఒత్తుతూ నెమ్మదిగా ఇలా పలికాడు…
సీ॥ ‘జగతీసురేశ్వర సంతోష చిత్తుండ
వైయున్న నీ ధర్మమతి సులభము
వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది యైన
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
తన ధర్మమున నుండు దరలడాధర్మంబు
గోరికలతనికి గురియుచుండు
సంతోషిగాడేని శక్రుడైన నశించు
నిర్ధనుండైనను నిద్రవోవు’
ఆ॥ ‘సంతసించే నేని సర్వభూత సుహృత్త
ములకు బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతులేనొనర్తు’
భూసురోత్తమా! నీ మానసం భాసురం- భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ప్రకాశవంతం. కనుకనే నీవు నిత్య సంతోషివి. దుర్లభమైన సత్య సనాతన ధర్మం నీకు సులభమయింది. అనగా, ధర్మాచరణం కష్టతరం. ఐనా ఇష్టపూర్వకంగా, నిష్ఠతో శ్రమలేకుండా నీవు ఆచరిస్తున్నావు. నీ ధర్మ ప్రవర్తనం ఆదర్శప్రాయం. ఇది ఆర్యులకు- వృద్ధులకు కూడా ఆమోదయోగ్యమైన పద్ధతి. స్వల్పమైన విత్తం సంప్రాప్తమైనా పూర్ణ సంతృప్తి పొందే అల్ప సంతోషి విప్రుడు. ఎట్టిస్థితిలో కూడా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా పట్టిన ధర్మాన్ని తుదముట్ట పాటిస్తాడే తప్ప వట్టిపోయే- వ్యర్థమయ్యే విధంగా వదిలిపెట్టడు. ఆ ధర్మమే కామధేనువై అతని కోరికలన్నీ తీరుస్తుంది. తృప్తి అనేది లేని యెడల ఇంద్రుడైనా నశిస్తాడు. విత్తహీనుడైనా సంతృప్త చిత్తుడైతే సురపతి- ఇంద్రునితో సమానుడౌతాడు- వంత లేక నిశ్చింతగా నిదురిస్తాడు. సర్వజీవుల హితం కోరువారు, ఒనగూరిన దానితో మనగలమని సరిపెట్టుకొని సంతసించే స్వాంతం- మనస్సు గలవారు, శాంత స్వభావులు, గర్వహీనులు ఐన సజ్జనులు నాకు ఒజ్జలు (గురువులు). నేను వారికి తలవంచి నమస్కరిస్తా.
ప్రస్తావకం- సందర్భోచితంగా పరమాత్మ ఇచ్చట ధర్మం- విశేషంగా బ్రాహ్మణ ధర్మం ప్రాశస్త్యాన్ని ప్రకటించి ప్రశంసించాడు. సంతుష్టి- తృప్తి అనేది విప్ర ధర్మానికి విశిష్ట లక్షణం. ‘అసంతుష్టో ద్విజో నష్టః సంతుష్ట ఇవ పార్థివః’- విత్తంతో సంతృప్తి పొందే భూపాలకుడు- రాజు, సంతుష్టుడు కాని భూసురుడు, ఇద్దరూ నష్టపోతారని నీతిశాస్త్రం. ‘కోవా దరిద్రోహి విశాల తృష్ణః’- దురాశాపరుని మించిన దరిద్రుడు లేడు. ‘శ్రీమాంశ్చకో యస్య సమస్త తోషః’- సంతృప్తి కలవాని కన్న శ్రీమంతుడు లేడు అని ఆదిశంకరుల సుభాషితం.
శుకుడు- రాజా! పరమాత్మ ఇంకా ఇలా ప్రశ్నించాడు… ‘ప్రజ్ఞానిధీ! నీవు ఏ దేశపువాడవు? మీ రాజ్యమేలే ప్రభువు మీ యోగక్షేమాలను బాగా విచారిస్తున్నాడా? పాలితులను- ప్రజలను అన్నివిధాల సుఖపెట్టే ప్రభువే నాకు అత్యంత ప్రియుడు. అదిసరే కాని, సాగర మధ్యంలో ఉన్న మా కోటలోనికి నీవెలా వచ్చావో! ఇది మాకు చాలా అచ్చెరువు- ఆశ్చర్యంగా ఉంది. ఇచ్చకపు మాటలు కావు. నీ ఇచ్ఛ- మనోవాంఛ ఏమిటో తెలుపు. తప్పక తీరుస్తా! ఇలా లీలామానుష విగ్రహుడైన గోపాల కృష్ణుడు పలుకగా అగ్నిద్యోతనుడు చాలా అడకువ- వినయంగా ఇట్లా అన్నాడు- దేవా! మాది విదర్భ దేశం. మా ప్రభువు భీష్మకుడు. ఆయనకు ‘రుక్మిణి’ అను ఒక కన్యకామణి ఉన్నది. ఆ ఇందువదన- సుందరి నిన్ను సేవింప కోరుతోంది. ఇందిరా మందిరా! ఆనంద మంగళకరమైన వివాహ శుభ సందేశం మీకు విన్నవించమని నన్ను మీ పాలికి పంపింది. గోపాల దేవా! ఆలించు…
సీ॥ ‘ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక
దేహతాపంబులు దీరిపోవు
నేనీ శుభాకార మీక్షింప గన్నుల
కఖిలార్థలాభంబు కలుగుచుండు
నేనీ చరణసేవ లేప్రొద్దు జేసిన
భువనోన్నతత్వంబు బొందగలుగు
నేనీ లసన్నామ మేప్రొద్దు భక్తితో
దడవిన బంధ సంతతులు వాయు!’
తే॥ ‘నట్టి నీయందు నా చిత్తమనవరతము
నచ్చియున్నది నీ యాన నానలేదు
కరుణ జూడుము కంసారి ఖలవిదారి
శ్రీయుతాకార! మానినీ చిత్తచోర!’
సంసారవైరీ! ఓ కంసారీ! సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వశక్తిమత్వం, సర్వాంతర్యామిత్వం ఇత్యాది ప్రశస్తాలైన నీ కల్యాణ గుణాల ప్రశంసలు చెవులకు సోకితే చాలు, శరీర తాపాలు శమిస్తాయి- తొలగిపోతాయి. దుష్ట సంహారా! దర్శనీయతమమైన నీ దివ్యమంగళ గాత్రం- స్వరూపం తిలకిస్తే చాలు, మనస్సు పులకించి కన్నుల కరవు తీరిపోతుంది- నేత్రాలున్నందుకు పాత్రత సిద్ధించి అన్ని అర్థలాభాలూ చేకూరుతాయి. ‘అఖిలార్థ లాభం’- చతుర్విధ పురుషార్థ ప్రాప్తి! ధర్మార్థ కామ మోక్షాలు నాలుగూ సారసాక్షుని, నారసింహుని- పురుషోత్తముని ప్రతిరూపాలే కనుక. త్రిభువనాలలో మందరగిరి ధరుని- మాధవుని కన్నా సుందర రూపుడున్నాడా? లేడు. కారణం? లోకంలో గుణముంటే రూపం ఉండదు. రూపముంటే, పాపం! గుణం ఉండదు. అదృష్టం కొద్దీ ఈ రెండూ అమరినా, అమృతత్తం- చావులేనితనం అస్సలు ఉండదు. అచ్యుతుని యందు మృతి- వినాశనం గాని, తత్కారణం గాని లేనందున ఆయన ‘సత్యం, శివం, సుందరం’- అమృత స్వరూపుడు. కృష్ణుని చూడగానే ఆవులు గడ్డి తినడం మానేవి, నదులు పొంగేవి, మేఘాలు గర్జించి వర్షించేవి, రాళ్లు కరిగేవి. జనార్దనుడు అట్టి జగన్మోహన రూపుడు!
శ్రీయుతాకారా! కల్యాణ స్వరూపా! అనవరతమూ నీ చరణ సేవలు చేయువారికి, ఈ భువనం- లోకంలో మహోన్నత స్థితి- అలోకమైన వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది. మానవతీ మనోహరా! నిన్ను నిరంతరం ధ్యానించేవారి- సంతతం నీ దివ్యనామం భక్తితో స్మరించేవారి సంసార బంధాలు అన్నీ నీ కటాక్ష వీక్షణంతో పటాపంచలవుతాయి. అహి (కాళియ) మర్దనా! నీ మహిమ ఎక్కడ? ఈ మహీ (భూ) మండలంలోని మహిళా మండలిలో ఒకతెనైన నేనెక్కడ? ‘గూఢో గభీరో గహనః’- జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్యాది గుణాలచే మీరు మహా గంభీరులు. కాన, ముందుగా ప్రస్తావించరు, స్పందించరు- బయటపడరు. కాని, మీ సౌందర్య, ఐశ్వర్య, మాధుర్య లీలాశ్రవణం చేసి చేసి నా డెందం సిగ్గు చెందక, ఓ ఆనందమయా! నిరంతరం నీయందే, నచ్చి- లగ్నమైయున్నది. నేను నిక్కచ్చి- నిష్కర్షగా చెబుతున్నా. ఇది పచ్చి నిజం. సచ్చరితా! దయతో వచ్చి నన్ను స్వీకరించండి’ భగవన్నుతితో భాసమానమగు ఈ సీస పద్యపు వాసి- సొంపు, సౌందర్యం, మహత్తు అంతా భావుక భక్తుల చిత్తాలను గమ్మత్తుగా, చమత్కృతం- చిత్తు చేయగల దాని ఎత్తుగడ (ఏ నీ గుణములు, ఏ నీ శుభాకారము.. అట్టి నీ యందు)లో ఉంది. మూల శ్లోకంలో ‘నిర్విశ్య కర్ణ వివరైః’ (కర్ణ రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన నీ గుణాలు) అని ఉండగా, ‘కర్ణేంద్రియంబులు సోక’ (చెవులకు తగిలితే, తాకితే చాలు) అంటూ మూలానికి చాలా వన్నె తెచ్చాడు అమాత్యుడు పోతన్న. ఇలాంటి జిలుగు- నగిషీ పోకడలు (చేష్టలు) తెలుగు భాగవతంలో ఎన్నో!