చికాగోలో ఓ అతిథి ఇంట్లో స్వామి వివేకానంద బస చేసి ఉన్నారు. ఆయన నగరంలో ఉన్నాడని అక్కడి ధనికుల్లో ఒకడైన రాక్ఫెల్లర్కి తెలిసింది. స్వామిని కలుసుకోవడానికి ఓరోజు ఆర్భాటంగా ఆ ఇంటికి వెళ్లాడు. తన రాక గురించి తెలిసి వివేకానంద ఎదురు వచ్చి ఆహ్వానం పలుకుతాడని భావించాడు రాక్ఫెల్లర్. కానీ, ఎవరూ బయటికి రాలేదు. రాక్ఫెల్లర్ లోపలికి వెళ్లి చూడగా.. వివేకానంద ఏదో రాసుకుంటూ కనిపించారు. ఆయనకు ఇంకా మండిపోయింది. ఆవేశంతో ‘నేనెవరో తెలుసా? ఈ నగరంలో అత్యంత సంపన్న వ్యక్తిని’ అన్నాడు. అప్పుడు వివేకానంద ‘మీకు అవసరానికి మించి సంపద వచ్చిందంటే అది మీది కాదని అర్థం. భగవంతుడు లోక హితార్థం ఆ ధనాన్ని మీ దగ్గర దాచి ఉంటాడు. ఆ సత్యాన్ని తెలుసుకొని లోక హితానికి పాటుపడండి’ అన్నారు రాసుకుంటూనే!
రాక్ఫెల్లర్ అహం దెబ్బతిన్నట్టయింది. ఇంతవరకు ఆయనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అక్కణ్నుంచి చరచరా వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లినా వివేకానందుడి మాటలే ఆయన చెవుల్లో మార్మోగాయి. వారం గడిచింది. ఓ పెద్ద సంస్థకు భూరి విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రాక్ఫెల్లర్. అందుకు సంబంధించిన పత్రాలతో వివేకానందస్వామి దగ్గరికి వెళ్లాడు.
గతంలో లాగే రాజసంగా ఆయన గదిలోకి అడుగుపెట్టాడు. తాను తెచ్చిన పత్రాలను వివేకానందకు చూపుతూ ‘ఇదిగో ఇంత సంపద విరాళంగా ఇస్తున్నందుకు మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి’ అన్నాడు. అప్పుడు వివేకానంద ‘నేను మీకు కాదు, మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ జీవన దృక్పథాన్ని మార్చినందుకు!’ అన్నారు. ఆ మాటలతో రాక్ఫెల్లర్కు వివేకానంద తత్వమేంటో అర్థమై మనసులోనే ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.
– మనోజ్ఞ