వివిధ మత సంప్రదాయాల్లో వానప్రస్థాశ్రమం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో తపస్సు, గ్రంథపఠనం, ధ్యానం అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇప్పటికీ ఇంకా ఆచరిస్తున్నారా అంటే.. బాహ్యంగా కాకున్నా, అజ్ఞాతంగా కొందరు ఆచరిస్తున్నారనే చెప్పొచ్చు. క్రైస్తవ సమాజంలోనూ ఈ తరహా విధానం ఉంది. క్రీస్తుకు శిలువ వేసే రోజుకు ముందున్న నలభైరోజుల పాటు వారు ఈ తపోదీక్ష పాటిస్తారు. దీన్ని కొంతమంది ‘తపఃకాలం’ అని చెబుతారు. కొందరు క్రీస్తు శ్రమలకు సంబంధించిన ధ్యానంలో ఉంటారు కనుక శ్రమ దినాలని అంటారు. కొందరు గుడిలో కూర్చొని ధ్యానం చేస్తారు కాబట్టి, ఉపవాస దినాలంటారు.
ఉపవాసం అంటే కొందరి దృష్టిలో ఒక్కపొద్దు పాటించడంగా భావిస్తారు. ఫస్కా పండుగకు ఆయత్త దినాలని కూడా అంటారు. ఈ నలభై రోజులూ ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకొంటారు. ఏదేమైనా పవిత్ర బైబిలు పఠనం, ధ్యానం, ఉపవాసాలు, ప్రార్థనలు, ఆత్మ పరిశీలనతో ఈ నలభై రోజులూ గడుపుతుంటారు. పాత జీవితానికి, చెడు ప్రవర్తనలకూ స్వస్తి చెప్పడమే వీటి వెనుకున్న ప్రధాన ఉద్దేశం. ఇవి పాటిస్తూనే దానధర్మాలు ఆచరిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. విలాసాలకు స్వస్తి పలుకుతారు. సత్కర్మలు ఆచరిస్తారు. ఇవన్నీ శ్రమదినాల్లో ఆచరించి.. క్రీస్తు మరణ దినమైన ‘గుడ్ ఫ్రైడే’నాటికి ఉన్నతులుగా సిద్ధమవుతారు.
– డా॥ దేవదాసు బెర్నార్డ్ రాజు, 98667 55024