మనిషిని మహాత్ముడిని చేసే ప్రయత్నమే రామకృష్ణ పరమహంస ఉన్నన్నాళ్లూ చేశారు. రక్తమాంస శరీరులమైన మనం పరమాత్మకు ఎలా దగ్గరవ్వాలన్న మార్గాన్ని ఆయన అన్వేషించి మనకు అందించారు. మనిషి ఉన్నత స్థితిని పొందేందుకు ఎలా ఆలోచించాలి, దానికి అనుగుణమైన ఆచరణ ఎలా చేయాలన్నదీ గురువుగా ఆయన నిర్దేశించారు. పుట్టుక తర్వాతి అవస్థలు, మనల్ని మనం రూపుదిద్దుకోవడం గురించి ఓ సందర్భంలో పరమహంస ఇలా చెబుతారు. ‘తల్లి కడుపులో ఉన్నప్పుడు యోగావస్థలో ఉన్నాను. బయటికి రాగానే మంత్రసాని నా బొడ్డుతాడు తెంపేసింది. కానీ ఈ ప్రపంచమనే మాయావరణంలో చిక్కుకున్నాను.
మరి దీన్ని తెంచడం ఎలా? కాంత, కాంచనాలు ఇక్కడి అత్యంత ఆకర్షణలు. ఆ రెండు మాయలనుంచి దూరం కాగలిగితేనే యోగం సిద్ధిస్తుంది. పరమాత్మ అనే అయస్కాంతం మనిషి అనే సూదిని ఆకర్షించాలంటే, ఆ వ్యక్తిలోని ఆత్మకు మట్టి అంటుకుని ఉండకూడదు. ఎప్పుడైతే భగవంతుడి కోసం మనం పరితపించి కన్నీరు కారుస్తామో అప్పుడా మట్టి కరిగి పోతుంది. అలాంటి శుద్ధమైన ఆత్మను అయస్కాంతం ఆకర్షిస్తుంది.
నిజానికి భగవంతుడు అందరిలోనూ ప్రభవిల్లుతుంటాడు. లౌకికమైన జీవితం గడిపేవారిలో ఆ ప్రకాశం మట్టితో కప్పి ఉంటుంది. అలాంటి జీవితంలో ఉండే జ్ఞాని మట్టి ముద్దలా దర్శనమిస్తాడు. కానీ వాళ్ల అంతరంగాన్ని కూడా అన్వేషించగలిగితే మంచి గురువు లభిస్తాడు.’