శ్రీ బాలాజీ జిల్లా : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిమలను పల్లకీపై కొలువుదీర్చారు. 5 రకాల సంప్రదాయ పుష్పాలు, 5 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు ఈ పుష్ప పల్లకీ సేవకు వినియోగించారు. ఈరోడ్ పట్టణానికి చెందిన దాత సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీఓ బాలిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.