తిరుపతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Murmu) రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం తిరుపతి ( Tirupati ) కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి రేణిగుంట విమానశ్రయంలో రాష్ట్ర మంత్రులు , ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె రోడ్డు మార్గాన తిరుచనూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో కొనసాగుతున్న కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెను శాలువాతో సన్మానించి , తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం రాష్ట్రపతి తిరుమలకు చేరుకుని పద్మావతి గెస్ట్‌హౌజ్‌లో బస చేయనున్నారు. శుక్రవారం తిరుమలలో ముందుగా వరహాస్వామిని అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు.