ప్రకాశం జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో పుట్టి, దళిత జీవితాన్ని అనుభవిస్తూ, పసితనంలోనే తల్లిప్రేమకి దూరమై తనను తాను నిలబెట్టుకోవడానికి తెలుగు సాహిత్య యవనిక మీద కవిగా అడుగుపెట్టి అటు విమర్శలో, ఇటు కవిత్వంలో తనదైన దిశలో ముందుకు పోతున్న కవి కోయి కోటేశ్వరరావు. గుండెడప్పు సంకలనం కోయి కోటేశ్వరరావుని కవిని చేసింది. తను రాసిన కవితే గుండెడప్పు దళిత సంకలనానికి శీర్షికయింది. కోయిది దళిత గ్రామీణ నేపథ్యం. బాల్యంలో నాన్న పడ్డకష్టం చూసి ఆ నాన్నని చెయ్యారా తడుముకున్నాడు. “అయ్య చెమటచుక్కలు పరిచిన రహదారి పైనే కదా/నేనంటూ ఇక్కడిదాకా నడిచి వచ్చాను/నాకే కాదు మా ఊరి అన్నదాతకి కూడావెన్నెముక మా అయ్యే/ ఊరి కి కూడా మా అయ్యే వెన్నెముక” అంటున్నాడు. అన్నదాత అంటే అగ్రకుల రైతు భూస్వాముల జాబితాలే కనబడతాయి. వాటివెనక నిలబడే దళిత కూలీల ముఖచిత్రాలన్నీ దాయబడతాయి. నాగస్వరంలోని కవిత్వం దళితతత్వంతో మార్మోగింది.
“పదిమంది కష్టాన్ని కొల్లగొట్టి/పండగ చేసుకోవడమే నేటి యుగ ధర్మం”. ఈ వాక్యాన్ని డీకోడ్ చేయండి. ఇందులో వ్యాపార లక్షణం కనబడుతుంది. ఆర్థిక సంస్కరణల పేరుతో మన ఇంటి ముందుకు వచ్చిన ప్రపంచీకరణ పాఠం ఉంది. ఆధిపత్యం అనేది కేవలం కులంలో మాత్రమే కాదు, అది అన్ని చోట్లా ఉందనే నిజాన్ని సోదాహరణంగా చాటి చెబుతుంది ‘నాగస్వరం’ కవిత.
‘కరుణ, ప్రేమ, ఆగ్రహాలను వ్యంగ్య రూపంలో చెప్పడం పెద్ద సాహసమే. కొంచం అతి జరిగినా మొత్తం లక్ష్యం దెబ్బ తింటుంది. భావసాంద్రత పలచబడి పోతుంది. కానీ కోయి ఏమాత్రం కష్ట పడకుండా ఈ సాహసకృత్యాన్ని సునాయాసంగా చేయగలిగాడు. అందుకు రూపకాన్ని శక్తివంతంగా వాడుకున్నాడు’ అని కలేకూరి ప్రసాద్.. కోయి కవితల వెనక ఉన్న మర్మాన్ని చెప్పాడు.‘ఒక మర్డర్ ప్లీజ్’ అనే కవితలో “దయచేసి ఎవరైనా పట్టపగలు పబ్లిగ్గా ఒక మంచి మర్డర్ చేస్తారా?/సాటి మనిషి దేహంపై వేటకొడవళ్లు చేసే రక్త నాట్యం నేత్రపర్వంగా దర్శించాలి/ ఉన్నపళంగా ఒక వేడివేడి వీడియో తీసి లక్షలాది లైకులు కొల్లగొట్టాలి” అని రుచీపచీ లేని సోషల్ మీడియా పనితనాన్ని ఎండ గడతాడు.
“ఊరందరికి మా అయ్య బానిసైతే/మా అమ్మ మా అయ్యకి కూడా బానిసే” ఎంత హృదయ విదారకమైన మాటిది. ఇందులో దళితతత్వం ఉంది, అమ్మతనం ఉంది. వెనుకబాటు తనపు అనుభవం లోనుంచి అమ్మని చేతుల్లో పెట్టుకుని ముద్దాడుతున్నాడీ కవి. ఈ సంపుటిలో స్త్రీ చాలా సందర్భాల్లో కనబడుతుంది.
కోయి కోటేశ్వరావుని వస్తు పరిణతితో పాటుగా శిల్ప పరిణతి సాధించిన కవిగా మనం గమనించొచ్చు. ఈ సంపుటికి ముందు మాటలు రాసిన ప్రొఫెసర్ శిఖామణి ఈ కవిత్వాన్ని చెయ్యారా కౌగిలించుకున్నాడు. కార్ల్ టాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జంగం చిన్నయ్య ప్రేమగా రాసిన ఆంగ్ల ముందు మాట చదివిస్తుంది. “నేనే నిజమైన దేశ భక్తుణ్ణి/నాగజాతి రక్త సంతకాన్ని నేను/దమ్మ పథ బాటసారిని నేను/సత్య’ జ్యోతి’ కిరణాన్ని/నేను ‘భీమ’ పతాకాన్ని/నాది నాగ స్వరం” అంటూ తనదైన కవిముద్రని తెలుగు సాహితీ యవనికపై వేసిన కోయి కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు. ‘నాగస్వరం’ ఒక దుఃఖ రాగం. నిరసన గానం. అన్నింటికీ మించి బుద్ధుడు, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ అందించిన తాత్వికతకు అక్షర పతాకం ‘నాగస్వరం’. రాజ్యాంగ నైతికతను చాటి చెప్పే ఇలాంటి మేలుకొలుపు కవిత్వం మరింతగా రావాలని కోరుకుందాం.