ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తున్నదని భావిస్తుంటాం. ఈ విషయాన్ని , బైబిల్లో ప్రభువుకు ప్రియ శిష్యుడైన పౌలు మహర్షి, తాను గలతీయ జాతికి రాసిన లేఖలో ( 5:22) పేర్కొన్నాడు. వారు ఉండవలసిన మార్గం నిర్దేశం చేస్తూ.. వారికి కావలసినంత ధైర్యం చెబుతూ, ఆ అదృశ్య శక్తి పవిత్రాత్మే అనీ, అదే పరిశుద్ధాత్మ నడిపింస్తుదనీ లేఖలో వివరిస్తాడు. క్రైస్తవం త్రయైక దేవుని సూత్రాన్ని నమ్ముతుంది. ముగ్గురూ ఒకరిలోనే, ఆ ఒక్కరే ముగ్గురిలోనూ అనే దైవ సిద్ధాంతం అది. అంటే ఈ విశ్వాన్ని తండ్రి దేవుడు సృష్టిస్తే, భ్రష్టమైన ఆ లోకాన్ని కుమార దేవుడు క్రీస్తు రూపంలో రక్షిస్తే, ఆ తర్వాత ఈ లోకాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ అని నమ్ముతుంది. అయితే, ఆ పవిత్రాత్మ ఎలా కంటికి రెప్పలా అనుక్షణం కాచి కాపాడుతుందంటే, ఇతరుల పట్ల ప్రేమతో ప్రవర్తించమని చెబుతుంది.
దీన్నే సోదర ప్రేమగా చెప్పుకొంటాం. ఆ పవిత్రాత్మ ప్రతి మనిషిలోనూ సంతోషం నింపుతుంది. మనిషికీ మనిషికీ మధ్య శాంతి సమాధానాలు పెల్లుబికేలా చేస్తుంది. దానితో మనుషుల మధ్య భయం పోయి, స్నేహ భావం కలుగుతుంది. పునరుత్థానుడైన క్రీస్తు వెళ్లిపోయిన తర్వాత ప్రజలు అనాథలుగా ఉండకూడదని వారిలో పరస్పర దయా దాక్షిణ్యాలు, ఓర్పూ తోడు కావాలని… అందుకు తగిన రీతిలో నడిపించడానికి ఈ
పవిత్రాత్మ శక్తి నేటికీ విశ్వంలో ఆవరించి ఉంది.
దేవుడు ఎంత మహోపకారం చేశాడో మానవుడు గుర్తెరిగి ఆ దైవశక్తిని స్తుతిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞుడైపోయాడు. అందుకే శాంతంగా, సాత్త్వికంగా ఉండటమూ నేర్చాడు. కొన్ని కోరికల పట్ల, ఆశల పట్ల నిగ్రహంగా ఉండటం, పేరాశలకు విరక్తి చెంది దూరంగా ఉండటమూ నేర్చాడు. అలాగే అందుకు తగ్గట్టుగా మనిషి మనిషికీ కొన్ని సుగుణాలు నిక్షిప్తం చేసి లోకంలో ఎలా మెలగాలో, ఎలా సుమాతృకగా ఉండాలో పవిత్రాత్మ ఆదృశ్యంగా నేర్పుతూ, ముందుకు నడుపుతుందని క్రైస్తవులు బలంగా విశ్వసిస్తారు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024