సద్గురు కటాక్ష లేశ విశేషేణ సర్వసిద్ధయః
సిద్ధంతి, సర్వబంధాః ప్రవినశ్యంతి
శ్రేయో విఘ్నాః సర్వే ప్రలయం యాంతి
సర్వాణి శ్రేయాంసి స్వయం ఏవ యాంతి
(త్రిపాద్విభూతి మహా నారాయణోపనిషత్తు 5)
‘సద్గురు కటాక్షంతో అన్ని సిద్ధులూ కలుగుతాయి. బంధాలన్నీ నశిస్తాయి. విఘ్నాలన్నీ తొలగిపోతాయి. శ్రేయములన్నీ వరిస్తాయి. హృదయంలో పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు..’ అని పై శ్లోకానికి భావం. పరమాత్మ సాక్షాత్కారానికి గురువు అనుగ్రహం ఎంత ముఖ్యమో చెబుతూ గురువైన తోతాపురి చెప్పిన కథ రామకృష్ణ పరమహంస ఇలా వివరించారు..
‘ఒకసారి ఒక చూలాలైన ఆడపులి ఒక మేకలమందపై పడింది. అప్పుడే ఒక వేటగాడు బాణం వేశాడు. పులి ఒక పిల్లను ప్రసవిస్తూ చనిపోయింది. పులికూన మేకలమందలో కలిసిపోయింది. మేకలే పాలిచ్చి దాన్ని పెంచాయి. పులిపిల్ల మేకలతో కలిసి తిరగసాగింది. మేకలతో కలిసి గడ్డి మేసేది. మేకలతో పెరగడం వల్ల ‘మే.. మే..’ అనడం నేర్చుకుంది. అదే వాతావరణంలో పెరిగింది. ఏదైనా క్రూరజంతువు తరిమితే పులి భయంతో పారిపోయేది.
ఒకసారి భయంకరమైన పులి మేకలమందపై దూకింది. పారిపోయే ఈ ‘మేక-పులి’ని పట్టుకుంది అసలు పులి. అది వణికిపోయింది. పెద్దపులి దాన్ని నోట కరుచుకొని ఓ నీటి కొలను దగ్గరికి తీసుకుపోయింది. నీళ్లలో దాన్ని ప్రతిబింబాన్ని చూపుతూ.. ‘నువ్వూ నాలాంటి పులివే! చూడు నాలాగే ఉన్నావు కదా!’
అని నోటిలో మాంసం కుక్కింది. గడ్డికి అలవాటుపడిన ‘మేక-పులి’ మెల్లగా మాంసం రుచి చూసింది. తన నిజ స్వరూపాన్ని పోల్చుకోగలిగింది. పెద్ద పులివెంట అడవిలోకి పరుగుతీసింది.’గురువు నీ నిజతత్త్వాన్ని తెలియజేస్తాడు. ‘గడ్డి తినడం’ అంటే, ‘కామినీ కాంచనా’లలో మునిగితేలడం. ‘మే..మే’, అంటే పామరునిలా సంసారంలో మెలగడం. ‘నీటిలో ముఖం చూసుకోవడం’ అంటే ఆత్మతత్త్వాన్ని’ అనుభూతి చెందడం. ‘కొత్త పులిని అనుసరించడం’ చైతన్యాన్ని మేల్కొల్పిన గురువును శరణు వేడటం.
– డా॥ వెలుదండ సత్యనారాయణ