మంత్రం సాధన ఉపకరణం. తంత్రం శక్తి వశీకరణం. స్తోత్రం దేవుణ్నిస్తుతించే మార్గం. సూక్తం దైవత్వాన్ని విశ్లేషించే సాధనం. అష్టోత్తర శతనామావళి భగవంతుడి నామాలను వివరిస్తే.. సూక్తాలు దైవీశక్తిని సమగ్రంగా నిరూపణ చేస్తాయి. అలాంటి సూక్తాలు ఎన్నో మన వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీళా సూక్తం పంచసూక్తాలుగా ప్రాచుర్యం పొందాయి, ఆ సూక్తాల ప్రత్యేకతలివి..
పంచసూక్తాలకు మకుటాయమానం పురుష సూక్తం. రుగ్వేదం పదోమండలంలో ఈ సూక్తం ఉంది. కృష్ణ యజుర్వేదంలోనూ పురుష సూక్తం ఉంది. ‘పురుష’ అనే పదానికి భగవంతుడు అని అర్థం. విరాట్ పురుషుడి స్వరూపాన్ని, స్వభావాన్ని పురుష సూక్తం వర్ణిస్తుంది.
‘ఓం తచ్ఛం యోరావృణీమ హే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే….’ అని మొదలవుతుంది పురుష సూక్తం. ‘చెట్లు ఊర్ద ముఖంగా పెరుగుగాక, ద్విపాద జీవులకు మంగళకరమగుగాక, చతుష్పాద జీవులకు మేలు కలుగుగాక’ అని శాంతి వచనం పలుకుతుంది ఇది. విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం ఒకటే అని చెబుతుంది. ఆ చైతన్యాన్ని ఎవరు ఏ రూపంలో కొలిస్తే, ఆ రూపంలో అనుగ్రహిస్తుంది అని ప్రకటిస్తుంది. వైష్ణవాలయమైనా, శివాలయమైనా అభిషేక సమయంలో, మంత్రపుష్పంలో పురుషసూక్తం పఠించడం గమనించవచ్చు. విశ్వశాంతి కోరుతూ పురుషసూక్త పారాయణాలు చేస్తుంటారు
నారాయణ సూక్తం నారాయణుడి మహిమను తెలియజేస్తుంది. స్వామిని ఎలా ధ్యానం చేయాలో కూడా వివరిస్తుంది. కృష్ణయజుర్వేదం నారాయణోపనిషత్తు, 13వ అనువాకంలో
ఈ సూక్తం ఉంది.
‘ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై॥ ఓం శాంతిః శాంతిః శాంతిః॥’ మంత్రంతో నారాయణ సూక్తం మొదలవుతుంది. ‘గురు శిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాం! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ, ఫలవంతమూ
అగుగాక! ఎన్నడూ మనం పరస్పరం
ద్వేషించకుండా ఉండుదుము గాక’ అంటూ గురుశిష్యుల మైత్రికి పీఠికగా నిలుస్తుంది
నారాయణ సూక్తం. దీనిద్వారా నారాయణుడి మహిమలనూ తెలుసుకోవచ్చు.
‘నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః’ అని కీర్తిస్తుంది నారాయణ సూక్తం. ‘నారాయణుడే పరజ్యోతి. ఆయనే పరమాత్మ, పరబ్రహ్మం. నారాయణుడే పరతత్తం. నారాయణుడే ఉత్కృష్టమైన ధ్యానం’ అని తెలుపుతుంది ఈ మంత్రం. ప్రతి వస్తువులోనూ నారాయణ అంశను, నారాయణ తత్తాన్ని దర్శించడం ఇందులో ప్రధానాంశం.
పంచసూక్తాల్లో మూడోది శ్రీ సూక్తం. ‘అలక్ష్మీం మే నశ్యతాం’ అంటుందీ సూక్తం. అంటే భావదారిద్య్రాన్ని తొలగించమని కోరుకోవడం. శ్రీ సూక్తం మంత్రభాగం రుగ్వేదంలో ఉంది. శ్రీ అంటే సంపద. పరమాత్మ శక్తుల్లో లక్ష్మి ఒకటి. జగత్తును పోషించేందుకు ఆమె అనుగ్రహం కావాలి. ఆ లక్ష్మిని నిలబెట్టుకోవడానికి జ్ఞానం అవసరం. ధన, కనక, వస్తు, వాహనాలే లక్ష్మీరూపాలు అనుకోవద్దు. తరిగిపోని జ్ఞానసంపదే నిజమైన లక్ష్మి. వివిధ రూపాల్లో లక్ష్మీదేవి తమ ఇంట్లో, తమ మనసులలో కొలువుదీరాలని ఆకాంక్షిస్తారు. అదే సమయంలో ‘అలక్ష్మీర్నాశయామ్యహం..’ అని ‘నాలోని అలక్ష్మి నశించుగాక’ అని కోరుకుంటారు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే! అవన్నీ తొలగిపోతే మిగిలేది అనంతమైన జ్ఞానమే! అదే నిజమైన లక్ష్మి.
సమస్త జీవరాశుల కనీస అవసరాలు గాలి, నీరు, ఆహారం. వాటిని సమృద్ధిగా కలిగి ఉన్న గ్రహం భూమి. మనిషి జీవించడానికి భూదేవి లక్షణాలు పుణికిపుచ్చుకున్న అనువైన గ్రహం కోసం శాస్త్రవేత్తలు ఏండ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ, భూమిని మించిన మరో గ్రహం మరొకటి ఉండదేమో! మనిషి నిలబడటానికి ఆధారం భూమి. ఆ మనిషి ఎదగడానికి కావాల్సిన ఆహార పదార్థాలూ భూమి నుంచి వచ్చినవే. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మనుగడకు భూమిక భూమే! అందుకే భూమిపై మనిషికి కృతజ్ఞత ఉండాలి. భూదేవి చూపిస్తున్న ఉదారతకు, ఆమెను దైవంగా కొలిచే వేద మంత్ర భాగమే భూ సూక్తం.
‘స్యోనా పృథివి భవానృక్షరా నివేశనీ యచ్ఛానః శర్మ సప్రథః’- ‘సుఖాన్ని ఇచ్చే ఓ పృథ్వీదేవతా! నీవు కంటకాలు లేని చక్కని నివాసంగా ఉండు. మాకు విస్తృతమైన శుభాలను చేకూర్చు’ అని భూదేవిని ప్రార్థిస్తారు. భూమిని తల్లిగా భావించమని గుర్తుచేస్తుంది భూ సూక్తం.
నీళాదేవిని మహావిష్ణువు సఖిగా నీళా సూక్తం అభివర్ణిస్తుంది. కృష్ణ యజుర్వేదంలో భాగమైన ఈ సూక్తంలో ఆకాశానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. నీలాకాశం ప్రాణికోటి అవసరాలు ఎన్నిటినో తీరుస్తుంది. భూమికీ, ఆకాశానికీ మధ్య సంబంధాన్ని వివరిస్తుంది నీళా సూక్తం. మన వాతావరణంలో ఉండే వాయువుల గురించి ఇందులో ప్రస్తావించారు. నీళా
సూక్తంలో భూమిని విష్ణుపత్నిగా సంబోధిస్తుంది వేదం.. ఇక్కడ విష్ణుపత్ని అంటే విష్ణువును పరిపాలకుడిగా కలిగినది అనే అర్థం. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశం ఈ సూక్తంలో అంతర్లీనంగా ఉంటుంది.
– టి.వి.ఫణీంద్రకుమార్