శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగనున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేయడంతో పాటు ఆర్జిన సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.
భక్తులతో పాటు శివస్వాములకు సైతం స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఇరుముడితో వచ్చే శివస్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో నాలుగు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి, ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కాలినడకన వచ్చే భక్తులను గుర్తించి దర్శనాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కంకణాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా శీఘ్ర, అతిశీఘ్ర, ఉచిత దర్శాలకు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చలువ పందిర్లు, అడుగడుగున ఈ టాయిలెట్స్, మంచినీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలతో పాటు అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఉచిత దర్శనానికి 14 కంపార్ట్మెంట్లు, శ్రీఘ్ర దర్శనానికి 8 కంపార్ట్మెంట్ల్లో భక్తులు వేచి ఉండేందుకు క్యూ కాంప్లెక్స్‌లను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 30 నుంచి 40 లక్షల లడ్డూ ప్రసాదాలను 15 ప్రత్యేక కౌంటర్లు, అదనంగా 5 కౌంటర్లు మహిళలకు, దివ్యాంగుల కోసం సిద్ధం చేశారు.
క్షేత్రంలో నిరంతరం మంచినీరు, అన్నప్రసాదాలు, అల్పాహరం, బిస్కెట్లు అందిస్తున్నట్లు పీఆర్వో శ్రీనివాస్‌రావు తెలిపారు. పాతళగంగ వద్ద షవర్లు, గంగాభవాని స్నానగట్టాలు మరియు ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖద్వారం నుంచి అడుగడుగున సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్ తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుద్దీపాలతో ఆలయాన్ని తీర్చిదిద్దగా ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది.