శుక యోగి పరీక్షిత్తుతో- రాజా! సారమతి- స్థిరచిత్తంతో గిరిధారి, గోకుల విహారి, కంసారి కృష్ణుని కీర్తిస్తూ మథురాపురి చేరిన హరిదాసవర్యుడు ఉద్ధవుడు, అఘ సంహారి- పాపాలను రూపుమాపేవాడు, రిపుజన మదాపహారి- శత్రువుల మదమును మర్దించేవాడు, వనమాలాధారి శౌరిని- పరమాత్మని దర్శించాడు. నందాది గోపకులు, గోపికా బృందం ప్రేమబంధంతో పంపిన కానుకలను రామకృష్ణులకు, ఉగ్రసేన మహారాజుకి కడు వేడుకతో విడి- విడిగా సమర్పించాడు. తదుపరి ఏకాంతంగా, “ప్రేమమూర్తులైన గోప భామలను వ్రేపల్లెలో
దుస్సహమైన విరహవేదనకు గురిచేసి, ఓ రాధాకాంతా! నువ్వు మథురలో ఎలా మనగలుగుతున్నావు? గోవిందా! ఇదేనా నీ ‘సచ్చిదానంద’ స్వరూపం?” అని ఉద్ధవుడు అధిక్షేపించ- ఎత్తిపొడవగా మాధవుడు- ‘ఉద్ధవా! కామతప్తయైన కుబ్జను- సైరంధ్రిని సైతం నేను ఉపేక్షింపలేనే! అలాంటిది, తమ అన్ని అపేక్ష- ఆకాంక్షలను నాకే సమర్పించి ఉన్న ఆ గోప పురంధ్రీ- స్త్రీ మణులను ఉపేక్షిస్తానా? నా ప్రతి రోమకూపంలో ఆ రమణలే రమిస్తున్నారు’ అని పలికాడు.
రాజా! గతంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి అబ్జాక్షుడు- కృష్ణుడు ఉద్ధవునితో కలసి కుబ్జ గృహానికి వెళ్లి ఆ సరోజముఖిని మనోజ కేళిలో కరగించాడు. ఆమె మదనతాపాన్ని దిగవిడిచింది.
క॥ ‘ఏ వేదంబుల గానని
దేవోత్తము గాంచి ముక్తి తెరువడుగక రా
జీవేక్షణ రతి యడిగెను
భావింప దదీయ కర్మఫల మెట్టిదియో?’..
ఇందుముఖి త్రివక్ర- కుబ్జ పూర్వం తాను గోవిందునికి సమర్పించిన సుగంధ లేపనాల లేశమైన- కొద్ది పుణ్య ప్రభావం చేత, వేదాలకు కూడా అందరాని ముకుందుని కని కూడా ముక్తిని కోరక, పూనిక- పూర్వ జన్మ సంస్కార బలంతో అతని పొందును కోరింది. లీలా రసికుడు ఆ బాలామణిని మన్మథ సౌఖ్యాలలో ఓలలాడించాడు. కోరిన దానిని కాదనక ఆమోదించి ఇవ్వడం దామోదరుని స్వభావం కదా! కుబ్జ చెలికత్తెలందరూ ‘ఇది నిజంగా కనీవినీ ఎరుగని- అరుదైన భాగ్యం’ అని కొనియాడగా శ్రీశుకముని మాత్రం ఆమెని ‘భాగ్యహీన’గా పేర్కొని ముందుకు సాగాడు. అటుపిమ్మట చతుర నటమూర్తి కృష్ణుడు రామ, ఉద్ధవులను వెంటపెట్టుకొని అక్రూరుని ఇంటికి వెళ్లాడు. ఆనందంతో అందలమెక్కిన అక్రూరుడు కొందలపాటు (కలత, సంతాపం) మాని త్రివిక్రముని అడుగులను తన ఒడిలో ఇడు- పెట్టుకొని ఒత్తుతూ ఇలా నుడివాడు-
శా॥ ‘ఏ పుణ్యాతిశయ ప్రభావముతో యీ జన్మమందిక్కడన్
నీ పాదంబులు గంటి నిన్నెఱిగితిన్ నీవుం గృపాళుండవై
నాపై నర్మిలి జేసి మాన్పగదవే నానా ధనాగార కాం
తా పుత్రాదుల తోడి బంధనము భక్త వ్రాత చింతామణీ!’
‘మధుసూదనా! నీ ఆగమనం వలన మా సదనాలు- గృహాలు పావనమయ్యాయి. భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకాంతా! అశేషమైన ఏ పుణ్య విశేష మహిమ వల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణ కమలాలను కనగలిగాను. నిన్ను తెలుసుకొన గలిగాను. నీవు కూడా నా మీది ప్రేమతో కృప చూపి, నా చిత్తంలోని గృహవిత్త (ధన) దార (భార్యా) పుత్రాదుల మీది మోహ పాశాన్ని ఉత్తరించు- కత్తిరించు!’- పరమాత్మ ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు..
చ॥ ‘కొలుతురు మర్త్యులిష్టములు గోరి శిలామయ దేవ సంఘమున్
జలమయ తీర్థ సంఘమును సంతతమున్నటు వారు గొల్వగా
వలదనరాదు గాక భగవత్పద భక్తులరైన మీ క్రియన్
సొలయక దేవ తీర్థములు చూచినయంతనె కోర్కులిచ్చునే?’..
‘మహాత్మా! మరణ శీలురైన మానవులు కోరికలు తీర్చుకొనగోరి తమ కరణ కళేబరాలతో- ఏకాదశ ఇంద్రియాలతో దేవతల శిలా ప్రతిమలను, గంగాది జలాపూర్ణాలైన పుణ్యతీర్థాలను నిరంతరం సేవిస్తూ ఉంటారు. ప్రగాఢమైన భక్తి విశ్వాసాలతో కూడిన వారి సేవలను కూడదని వారించడం పాడి కాదు. నిజానికి, భగవత్పద భక్తులైన- జంగమ దేవరలు, తీర్థాలైన మీ వలె విగ్రహారాధనం, పుణ్య తీర్థ సేవనం దర్శన మాత్రాన అభీష్టాలను అనుగ్రహించ గలవా? అవి ఫలించడానికి చాలా సమయం పడుతుంది.’ అనంతరం ఉద్ధవ బలరామ సహితుడై శ్రీకృష్ణుడు తన నివాసానికి చేరాడు.
శుకుడు- రాజా! కంసుని భార్యలైన అస్తి, ప్రాప్తి వైధవ్యం పొంది దుఃఖిస్తూ తండ్రియైన జరాసంధుని చెంతకు చేరి, మాకు దానవహంత అయిన శ్రీకృష్ణుని వలన ఈ దుర్గతి కలిగిందని వాపోయారు. ‘బిడ్డలారా! ఈ గడ్డని యాదవ రహితం చేస్తా’ అని శపథం చేసి జరాసంధుడు యుద్ధభేరి మ్రోగించాడు. ఇరవై మూడు అక్షౌహిణీ సైన్యం వెంటరాగా, చెలియలికట్టను అతిక్రమించి పొంగి వెడలివచ్చే కడలి వలె మథురా నగరాన్ని చుట్టుముట్టాడు. సమయజ్ఞుడైన కమలాప్రియుడు కృష్ణుడు- ‘నేనవతరించింది భూభారాన్ని వారించడానికే కనుక నేటి నుండీ ఆ ప్రయోజనానికి పూనుకొంటా. ఈ జరాసంధుని పట్ల సామ దాన భేదోపాయాలు నిరుపయోగాలు. ఈ ఉద్దండుని యెడల దండోపాయం ప్రయోగించి భూభారం తొలగిస్తా. వీని సైన్యాన్ని నశింపజేసి, వీనిని చంపకుండా, వెనుకకు పంపిస్తే, మరల మరల మిగులు సైన్యంతో కసిగా కదనానికి కదలి వస్తూంటాడు. అలాగ ఇలా (భూ) భారాన్ని తొలగించి, అవతల వీడి తల తీయించవచ్చు’ అని తలపోశాడు.
క॥ ‘ఖరులై దృఢ కవచ ధను
శ్శరులై యధిగత రథానుచరులై మదవ
త్కరులై ఘన హరులై బల
హరులయ్యెడ నాజికేగి రతి భీకరులై’…
వాడిమి- తేజః ప్రతాపాలు గల రామ కృష్ణులు దృఢమైన కవచాలు, ధనుస్సులు, నారాచాలు- బాణాలు, మదగజాలు, ఘనమైన అశ్వాలు, అనుచరులతో అతి భయంకరులై సంగర రంగానికి తరలి వచ్చారు. ‘బలహరులు’ అనగా బలరామకృష్ణులని, ‘శత్రు బలాన్ని హరించేవారు’ అని కూడా శ్లేషార్థం! గంభీరము, దివిజ తాపస మాన్యము- దేవ మునులచే మన్నింపబడేది, ప్రీత భక్త రాజన్యము- భక్తులైన రాజవర్గాన్ని ఆనంద పరచేది, భీత దుశ్చరిత శాత్రవ సైన్యము- చెడు నడతగల శత్రుసైన్యానికి కడు భయంకరము, ధన్యమూ అయిన పాంచజన్య శంఖాన్ని పూరించాడు కాంచనచేలుడు కృష్ణుడు.
క॥ ‘సింధుర భంజన పూరిత
బంధుర తర శంఖ నినద భారమున జరా
సంధునికింగల సైన్యము
లంధములై సంచలించె నాహవ భూమిన్’…
సింధుర- గజములను, భంజిస్తూ- భంగపరుస్తూ, పంకజనాభుడు పూరించిన, బంధురతర- సింహగర్జన వంటి కఠినమైన పాంచజన్య శంఖ నినాద భారంతో జరాసంధుని సేనలన్నీ వరాక (యుద్ధ) రంగంలో, అంధములై- కన్నులు కానరాక కంపించిపోయాయి. వీనులకు విందు చేసే ఇలాంటి అందమైన కందాల కెందామరలు (రక్త కమలాలు) పోతనగారి భాగవత సరస్సులో కోకొల్లలు. శుకుడు- రాజా! ఆ సమయంలో మగథనాథుడు మథురానాథునితో ఇలా చులకనగా పలికాడు..
సీ॥ ‘అదలించి రొప్పంగ నాల మందలుగావు
గంధ గజేంద్ర సంఘములు గాని
పరికించి వినగ నంభా రవంబులు గావు
వాజీంద్ర హేషా రవములు గాని
పదహతి గూల్పంగ బ్రాత బండ్లివి గావు
నగ సమాన స్యందనములు గాని
ప్రియము లాడంగ నాభీరలోకము గాదు
కాలాభవైరి వర్గంబుగాని
తే॥ యార్ప వనవహ్ని గాదు బాణాగ్ని గాని
మురియు బృందావనము గాదు మొనలు గాని
యమున గాదు నటింప ఘోరాజి గాని
పోరు నీకేల? గోపాల! పొమ్ము పొమ్ము’…
ఓయీ! గోపాలకా! ఇవి మదించిన ఏనుగుల గుంపులు గాని, అదలించి పారదోలడానికి ఆలమందలు గావు. ఇవి సింధు దేశపు గుర్రాల సకలింపులు గాని, వీనులొగ్గి వినడానికి వృషభాల అంభారావాలు గావు. ఇవి కొండల వంటి రథాలు గాని, కాలితో తంతే కూలి ముక్కలయ్యే పాత చెక్కబండ్లు గావు. ఇది శమను- యముని వంటి శత్రు సమూహం గాని, సరస సల్లాపాలు ఆడుకోడానికి గొల్లపిల్లల గుంపు గాదు. ఇది ప్రచండమైన బాణాగ్ని గాని, లీలగా ఆర్పివేయడానికి దావానలం- కార్చిచ్చు కాదు. మురిసిపోయి తిరగడానికి ఇది కదనరంగం- సేనా వ్యూహంగాని, మెరిసిపోయే బృందావనం కాదు. నర్తించడానికిది (జీవించినంత వరకు గుర్తుండిపోయే) ఘోరమైన యుద్ధభూమి గాని, వన్నెచిన్నెల యమున ఇసుక తిన్నెలు గావు. శశివదనా! మదన జనకా! ఈ కదనం- యుద్ధం నీకేల? నీ సదనానికి పోపొమ్ము. ఈ సీస పద్యం ‘వ్యాజ స్తుతి’ (నిందలో స్తుతి, స్తుతిలో నింద) అలంకారానికి అవ్యాజమైన- అకృత్రిమమైన దృష్టాంతము.
మ॥ ‘తరుణిం జంపుటయో బకుం గెడపుటో ధాత్రీజముల్ గూల్చుటో
ఖరముం ద్రుంచుటయో ఫణిం బరపుటో గాలిన్ నిబంధించుటో
గిరి హస్తంబున దాల్చుటో లయ మహాగ్ని స్ఫార దుర్వార దు
ర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు స ప్రాణుండవై గోపకా!’..
గోపకిశోరా! ఇది (యుద్ధం) యువతిని చంపడం (పూతనా మోక్షణం) కాదు. బకాన్ని- కొంగను తెగవేయడం (బకాసుర వధ) కాదు. చెట్లను కూల్చడం (యమళార్జున భంజనం) కాదు. గాడిదను కూలదన్నుట (గార్దభాకారుడైన ధేనకాసుర వధ) కాదు. పామును పారదోలుట (కాళియ మర్దనం) కాదు. గాలిని నిరోధించడం (తృణావర్త తృణీకారం- వధ) కాదు. కరమున గిరిని ధరించుట (గోవర్ధనోద్ధరణం) కాదు. ప్రళయకాల అగ్నివలె దీపించు- మండు దుర్వారాలు- వారింపరానివి, దుస్సహాలు- సహింపజాలనివి అయిన నా బాణాల దెబ్బలకు ఓర్చుకొని ఓ యబ్బా! నీవు ప్రాణాలతో ఉండగలవా? కంత (కామ) జనకా! అంతేకాదు..
సీ॥ ‘గోపికా వల్లకీ ఘోషణంబులు గావు,
శింజినీ రవములు చెవుడు పరుచు
వల్లవీ కరముక్త వారి ధారలు గావు,
శరవృష్టిధారలు చక్కుసేయు
ఘోషాంగనా పాంగ కుటిలాహతులు గావు,
నిశితాసి నిహతులు నిగ్రహించు
నా భీరకామినీ హస్తాబ్జములు గావు,
ముష్టిఘాతంబులు మురువుడించు’
తే॥ నల్ల వ్రేపల్లెగాదు ఘోరావనీశ
మకర సంఘాత సంపూర్ణ మగధరాజ
వాహినీ సాగరంబిది వనజనేత్ర!
నెరసి నిను దీవికైవడి నేడు ముంచు’
వారిజాక్షా! ఈ రణభేరి రంగంలో వినబడేవి చెవులు చిల్లులు పడే శింజనీ- అల్లే త్రాటి మోతలు కాని, మనోరంజనం చేసే గొల్ల పడతుల వల్లకీ ఘోషణాలు- వీణానాదాలు కావు. ఇవి జలక్రీడలో గోపికా ప్రోడలు నీపై చల్లే నీటి జల్లులు కావు, శత్రు సైనికులు అమర్షం- క్రోధంతో కురిపించు బాణాల వర్షధారలు. నీ దేహాన్ని తుత్తనియలు చేస్తాయి. ఇవి గొల్ల వాల్గంటుల క్రీగంటి చూపుల విరుల తూపులు- పూల బాణాలు కావు, భండనంలో నిశితమైన అసి ఖండనాలు- వాడి అయిన కత్తి వ్రేటులు. నీ తిత్తి తీస్తాయి. ఇవి, వ్రేతల- గోపికల తామర తూట్ల వంటి సుతిమెత్తని చేతులు కావు, అతి కఠినమైన పిడికిటి పోట్లు. నీ పోడిమి (సొంపు, సంపద, గర్వం)ని పాడు చేస్తాయి. ఇది గొల్లపల్లె కాదు, ఉగ్ర రాజులనే గ్రాహాల- మొసళ్లతో నిండిన జరాసంధుని సేనా సాగరం. మహా సముద్రం ఉప్పొంగి దీవిని ముంచునట్లు ఇది నిన్ను ముంచేస్తుంది సుమా! అమూలకాలైన పై రెండు సీస పద్యాలు, మత్తేభ వృత్తం సహజ పాండిత్యుని అసమాన కల్పనాప్రతిభా భాసమానాలు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006