శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! మీనము (చేప)ల వలె తళుకులీనే కన్నులు గల ఆ మానవతులు- గోపికలు డెందాలలో అందాల వేడుకలు సందడి చేయగా, వెన్నుని- కృష్ణునికి తమ సన్నని- పలుచని పైట చెరగులచే పీట- ఆసనం కల్పించారు.
ఆ॥ ‘పరమయోగి హృదయ భద్ర పీఠంబుల
నుండు మేటి వ్రజవధూత్తరీయ
పీఠమున వసించి పెంపారె ద్రిభువన
దేవి లక్ష్మి మేనదేజరిల్ల’
పరమయోగుల హృదయ పీఠాలపై అధివసించే పరమాత్మ- మధుసూదనుడు, ముల్లోకాల సౌందర్య శోభ తన దివ్య దేహంలో రంగులీనగా, గొల్ల ముద్దియల పయ్యెద కొంగుల శయ్యమీద, ఆ నల్లనయ్య ఆసీనుడయ్యాడు. పైన ఇంచుక కోపంతో, లోన ముంచుకొస్తున్న ప్రేమ తాపంతో పొంకించు- ప్రకాశించు మోములతో ఆ అంచయానలు- హంస గమనలు పంచశర (కామ) జనకుని, పృశ్నిగర్భుని కృష్ణుని ఇలా ప్రశ్నించారు..
‘నందనందనా! కొందరు తమను కొలచిన- వలచిన వారినే కొలుస్తారు. మరికొందరు తమ్ము కొలవని వారిని సైతం కొలుస్తారు. ఇంకా కొందరు, ఓ పంకేరుహ నేత్రా! తమను కొలిచే వారినీ, కొలవని వారినీ కూడా కొలవరు, తలవరు. ముకుందా! వీనిలో నీవు ఏ తెగకు చెందిన వాడివో వివరించు?’ అందమైన ఈ ప్రశ్నకు మందరగిరి ధరుడు మాధవుడు ఇంకా సుందరంగా సమాధానం చెప్పాడు..
ఇందువదనలారా! ఫలాపేక్షతో పశువులను పోషించునట్లు, కొలిచేవారిని కొలవడం కేవలం స్వార్థమూలకం. అందులో స్నేహం గాని, పరమార్థ రూపమైన పరోపకార ధర్మం కాని ఉండవు. తల్లిదండ్రులు తమ బిడ్డలను వలె, దొడ్డ గుణం కల కొందరు దయామయులు ఏమిస్తారని చూడక ప్రేమించని వారిని కూడా నేమం- నియమంగా ప్రేమిస్తారు. వీరిలో సహృదయత నిండి ఉండటం వలన వీరికి ధర్మ, కామాలనే రెండు పురుషార్థాలూ మెండుగా సిద్ధిస్తాయి. ఇక, ప్రేమించే వారినే ప్రేమించని వారు, ప్రేమించని వారిని ఎలా ప్రేమిస్తారు. చెలువ (సుందరు)లారా! ఇట్టివారు నలుగురు- మొదటి వారు ఆత్మారాములు. ఆత్మయందే రమించు అంతర్ముఖులు. ద్వైత భానమే- ఆత్మకన్న అన్యమైనది ఉన్నదన్న భావమే లేని అవధూత శ్రేణికి చెందినవారు. అలివేణులారా! రెండవ వారు ఆప్తకాములు. భోగవాంఛలు లేని యోగి పుంగవులు. వీరికి ద్వైతం- అనేకత్వం భాసించినా ‘వాసుదేవస్సర్వం’ అని భేదంలో (అభేద దర్శనం జ్ఞానం) అభేదాన్ని దర్శించగల జ్ఞానులు. చేడియలారా! మూడవ వర్గం వారు అకృతజ్ఞులు. తమ వేడుక- అక్కర తీరగానే జాడ కూడా తెలియకుండా పోయేవారు, ఏరు దాటగానే తెప్ప తగలేసే రకం. ఇక చివరివారు- కొలిచిన వారినే మరువక చెరచువారు, నష్ట పరచువారు. పితృద్రోహం, మిత్రద్రోహం వంటి మేరలేని నేరగాళ్లు. అతి కఠినులు. తరుణీమణులారా! వీనిలో నేను ఏ శ్రేణికి చెందిన వాడను కాను. నేను పరమ కారుణికుడను. మీకు ఆత్మబంధువుణ్ని. నా యెడల మీకు సడలని- ఎడతెగని ధ్యానం కలగడానికే, ఓ కలకంఠులారా! నేను తలగి (మాయమై) పోయాను. అంతేకాని, మీమీద కినుక పూని కానీ, అలగి కానీ కనుమరుగవలేదు. నన్ను ఒకపరి (ఒకసారి) కన్నవారు మదించి ఏమరి- మరచి, ఇక మరి నా వరివస్య- పరిచర్యలు చేయరని మదినెంచి- తలచి, ఆ కనికరం వల్లనే నా రూపు చూపను. పేదవాడు తనకున్న పాటి ధనాన్ని పోగొట్టుకొని, ఘన (భరింపరాని)మైన ఆ చింతనలోనే మునిగిపోయి ఇతరం కననట్లు, నేను కనబడకుండా ఉంటేనే నన్ను కోరువారు నా రూపాన్ని నిరంతరం మననం చేస్తూంటారు.
త॥ ‘తగవు ధర్మము జూడ నొల్లక తల్లిదండ్రుల బంధులన్
మగల బిడ్డల బాసి వచ్చిన మన్నిషక్తల మిమ్మునే
దగదు, పాసితి దప్పుసైపుడు, తద్వియోగ భరంబునన్
వగల బొందుచు మీర లాడిన వాక్యముల్ వినుచుండితిన్’
మదిరాక్షులారా! మీ హృదయాలను నా యందు పదిలపరచి, న్యాయమూ ధర్మమూ పాటించక, మీ తల్లిదండ్రులను, భర్తలను, బిడ్డలను, బంధువులను వదలి నా పొందుకు కదలి వచ్చారు. అట్టి మిమ్ము వియోగ వ్యథకు గురిచేసి తలగిపోవుట నాకు తగని పనే! అయినా, అన్నువులారా! నా తప్పును మన్నించండి. నేనగపడక నా విరహంలో వగ (దుఃఖం) పొందుచూ మీరాడిన సెగల మాటలు నేను వింటూనే ఉన్నాను.
‘కాంతలారా! ఎంతలేసి విరాగులకైనా విడువరాని సంసారమనే నిగడాల- సంకెళ్లను వీడి నాయందే ఎడతెగని స్వాంతం (మనసు) నిల్పిన మీకు ఎన్ని యుగాల- కల్పాలకైనా నేను ఆసాంతం- పూర్తిగా ప్రత్యుపకారం చేయలేను. మీ రుణం తీర్చుకోలేను. మీ సౌశీల్యం చేతనే నాకు రుణ విముక్తి. నా ప్రత్యుపకార కౌశలం వలన మాత్రం కాదు. మిమ్ము ఎడబాయుట నాకు కృతజ్ఞత లేక కాదు. కడకు అది కూడా, నన్ను మీరు విడువకుండా కొలవడానికే! నేను మీకు కల్పించిన ఈ నిరంతర స్మరణాన్నే ప్రత్యుపకారం- వరణంగా భావించి, మీ నుంచి దైహికంగా దూరమవడాన్ని క్రూరంగా నేరంగా- తప్పుగా తలచబోకండి. నా మీది దయతో, మీ మంచితనంతో ఓర్చుకొని శాంతించండి’. శుకయోగి- రాజా! ఇలా చక్కగా వక్కాణించిన మాధవుని చిక్కని స్నేహ పూరితమైన వాక్కులు విని, ఆయన అక్కున చేరి ఆ ఎలనాగలు- గోపికలు ఎదలో నెలకొన్న దోషబుద్ధిని, వియోగ వ్యథను ఒక్క పెట్టున వదలిపెట్టారు.
ఆ శరత్కాల పున్నమి రేయి అంతటా ఉన్నవాడు, అనంతుడు- దేశ, కాల, వస్తు, పరిచ్ఛేద రహితుడు, ఆత్మారాముడూ అయిన రమారమణుడు అచ్యుతుడు చిత్రాకారుడై రమణీమణులతో రాసక్రీడ సలపడానికి తలపడ్డాడు. వ్రేతలు- గోప నెలతలు గోవిందుని చుట్టూ వృత్తా- వలయాకారంగా నిలిచి ‘అన్యోన్యాబద్ధ బాహుభిః’- ఒకరి చేతులు ఒకరు విలాసంగా పట్టుకొని (శ్రీహరి తమను ఏమార్చి- పరధ్యానం కల్గించి, రెండవసారి పారిపోకుండా) తిరిగారు. పలురీతుల స్ఫురించే- ప్రకాశించే (తోచే) ముఖ, హస్త, పాద విన్యాసాలతో ఆ రాస గోష్ఠి భాసిల్లింది. ఆకాశంలో నిలిచి తిలకిస్తున్న దేవతలకు కనువిందై, వారి డెందాలను ఆనందంతో పులకింపజేసింది.
ఉ॥ ‘పాయని గేహ శృంఖలల బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనైన నేర, నన్
బాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగా దలించి నా
పాయుట దప్పుగా గొనక భామినులార! కృపన్ శమింపరే!’
రాసమనగా నర్తకీమణులైన బహుగోపికలతో కలసి నీలమణి కృష్ణుడు లీలగా ఆడిన సంగీత నృత్య విశేషం. పలు పోకడలు పోవనేర్చిన ఆ పురుషోత్తముడు విజృంభించి రాసక్రీడకు పూనుకొన్నాడు. తామర రేకుల నడుమ కర్ణిక- దుద్దు వలె గోప భామల మధ్యలో ముద్దుల కృష్ణుడు త్రిభంగియై- మువ్వంపుల సొంపుల మురిపాలతో ఇంపుగా నిలిచాడు. ‘కృత్వా తావంత మాత్మానం యావతీర్గోప యోషితః’- ఎందరు గోప సుందరులో, అందరకూ తానే అందరైనాడు. ‘అంగనా మంగనా మంతరే మాధవో, మాధవం మాధవం చాంతరేణాంగనా’- ‘నారీ నారీ నడుమ మురారీ, హరికీ హరికీ నడుమ వయ్యారి’ (సీనియర్ సముద్రాల)- గోపిక పక్క తాను, తన పక్క గోపిక (ఇద్దరు ముద్దరాళ్ల మధ్య మాధవుడు, ఇద్దరు మాధవుల మధ్య ముద్దుగుమ్మ) విలసిల్లే విధంగా నిలిచి వాసుదేవుడు భువన త్రయాన్నీ- అణువణువునూ సమ్మోహన పరచే వేణుగానం చేస్తూ రాసమండలాన్ని భాసిల్ల- ప్రకాశింప జేశాడు. అది వేయి కన్నుల వాసవు- ఇంద్రునికి సయితం విస్మయం గొలిపింది. వేల్పులు సంతోషంతో వినువీధి నుంచి విరుల వాన కురిపించారు.
ఉ॥ ‘ఆ సమయంబునన్ విభుడనంతుడు గృష్ణుడు చిత్రమూర్తియై
చేసెను మండల భ్రమణ శీల పరస్పర బద్ధ బాహు కాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్త పాద వి
న్యాసము రాసముం గృత వియచ్చర నేత్ర మనో వికాసమున్’
‘మధ్యే మణీనాం హైమానాం మహా మరకతో యథా’- బంగారు మణుల మధ్య రంగారు- (ప్రశస్తమైన వన్నెతో విలాసంగా ఒప్పు), ఇంద్రనీల మణి వలె భగవంతుడు ఉపేంద్రుడు మిక్కిలి శోభిల్లాడు. అరవిందాల వంటి అతి సుందరాలైన రెండు హస్తాలను తనకు ఇరువంకల ఉన్న ఇగురుబోణు- గోపికల మెడలపై ఉంచాడు. పాటకు అనుగుణంగా ఆశ్చర్యకరంగా అడుగులు వేశాడు. వలయాకృతిలో ఉన్న రాసబంధాలలో భాసమానుడై భవబంధ మోచకుడు వాసుదేవుడు నాట్యమాడాడు. శుభాంగులైన గోపికలందరూ త్రిభంగి మొదలైన భంగిమలతో నిలువగా, వారి బంగారు చిరుగంటల సవ్వడి, మనోజ్ఞాలై పొంగారు- అతిశయించు అందెల రవళి జగత్ జనావళి వీనులకు విందు గావించాయి. గోపాంగనలు అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడిస్తూ నిక్షేపంగా అనేక అంగ విక్షేపాలు ప్రకటించారు. ఇక్కడ పోతన అమూలకంగా, సాలంకార హావభావ బంధురమైన దీర్ఘ గద్యలో బ్రహ్మానంద సింధు (సాగర) సదృశమైన ‘రాసలీల’ను అనాయాసంగా వర్ణిస్తూ అంత్యప్రాసల అందాలతో సందడించే పలు అసదృశ పవిత్ర ఉపమానాలతో సుపవిత్రం చేశాడు.
శుకుడు- రాజా! ఇలా రాసక్రీడ భూమండలాన్నంతా నిండా ఆనందంతో నింపివేసింది. శృంగార రస పయోధిలాగా పొంగారింది. శంకరాభరణాది రాగాలతో సంకులమై శోభించింది. అనురాగ భరితమైన రామరాజ్యంలాగా రమణీయంగా తనరారింది. సదాచారవంతుని సద్వర్తనం- ముదావహమైన నడవడిలాగా అవనీ ఆకాశమండలాలకి మండన (అలంకార)మయింది. గౌరీ నిలయమైన హిమవంతం మాదిరి మహిమావంతమై తేజరిల్లింది. గుణవంతుడైన పుత్రుని వలన కులం ప్రకాశించునట్లు వంశీ విలాసంతో వాసుదేవుని రాసలీల భాసమానమయింది. నానా విధాలైన ప్రబంధాలు కూర్చే కుశలుడైన పోతనవంటి మహాకవి కవితా వనితా శ్రీ విలాసం వలె ప్రకృష్టమైన నాట్యబంధాలతో విలసిల్లింది. (సశేషం)