రాసలీలా వైభవం-7
శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునితో… రాజేంద్రా! గోప విలాసినులు పలు విధాల పాటలు పాడుతూ, దీనాలాపాలాడుతూ శ్రీకృష్ణ దర్శన లాలస మానసలై ఇలా విలపించారు కృష్ణా! నీ నవ్వుల పువ్వులు, నీ చూపుల తూపు (బాణా)లు, నానా విధాలైన నీ మధువన విహారాలు, నీ ధ్యానాలు, పరిహాసానికి ఆటపట్టులైన నీ తేనెల ఊటల తేట మాటలు మా మానసాలలో ఘాటుగా నాటుకొని నేడు మరలి పోలేకున్నాయి మరపురాలేకున్నాయి. మురళీ మునోహరా! త్వరగా తరలి రావయ్యా!
ఆ॥ ‘సురత వర్ధనంబు శోకాపహరణంబు స్వనిత వంశనాళ సంగతంబునన్య రాగజయమునైన నీ మధురాధరామృతమున దాప మార్పు మీశ!’
ప్రాణేశ్వరా! ప్రాపంచిక రతుల- ఆసక్తుల పట్ల విరతి రోత కలిగించేదీ, ఆత్మరతి పరబ్రహ్మము నందు శ్రద్ధ అపేక్షలను పెంచేదీ, శోకాలను పోకార్చేదీ, అల్లన మ్రోగే కల్లకపటం లేని పిల్లనగ్రోవి ముద్దులందుకొనేదీ, ఇతరాలైన స్వర్గ, సార్వభౌమాది భౌతిక సుఖ సంతతుల (సమూహాల) యందలి ఆసక్తిని సుతరాం పూర్తిగా అధిగమించ జయించగలిగేదీ అయిన నీ మధుర అధరామృత పానంచే ఓ పాపనాశకా! ఓపలేని మా విరహ తాపాన్ని చల్లార్చు.
‘ఇందిరా రమణా! నీవు పగటిపూట బృందావనంలో తిరగడం వల్ల, ఉంగరాల ముంగురులచే అంగజుని మన్మథుని అందాలను కూడా భంగపరచే సందడించే (మించిపోయే) నీ ముఖారవిందాన్ని తనివి తీర తిలకించలేక పోతున్నాం. అందుకే ఓ జార చోర శిఖామణీ! మాకు క్షణాలు యుగాలుగా భారమవుతున్నాయి. పోనీ, రాత్రి వేళలందైనా ఎడ తెగకుండా కన్నుల నిండా నిను కనుగొందామనుకుంటే, ఓ వందారు మందారమా (కాళ్లు మొక్కువారికి కల్పవృక్షమా)! క్రూరుడైన/ మందు (జడు)డైన అరవిందభవుడు బ్రహ్మదేవుడు కళ్లకు ఈ రెప్పలను అడ్డంగా సృష్టించి, తప్పు చేసి గొప్ప ముప్పు తెచ్చిపెట్టాడు కదా!’
అక్షుల కన్నుల కున్న పక్ష్మా రెప్పల అడ్డం తొలగించుకొని జడ్డుదనం (సోమరితనం) లేక పొందిక (వీలు)గా ఇందీవరశ్యాముని (నల్లకలువ నిగారింపువానిని) వందించి ఆనందించువాడు దక్షుడు. కానివాడు కనకా(హిరణ్యా)క్షుడు. ‘నిర్నిమేషంగా నిరాటంకంగా యదుపతిని దర్శించుకొనే తీరుగా, తిప్పలు పెట్టే రెప్పలను తీసి అవతల వేరుగా పెట్టగలిగితే ఎంత బాగుండు’ అని అనుకుంటున్నారు అతివలు. గోపభామలది అట్టి నిరామయ భోగమనే రోగం లేని ఆరూఢ సిద్ధి పొందిన ప్రేమ! కళ్లకు మూతలు రెప్పలు అడ్డంగా పెట్టి వ్రేత గోపికలను వెతలపాలు చేసిన విధాత (సృష్టికర్త)ను మూలంలో వ్యాసుడు జడుడు (మందమతి)గా అధిక్షేపించగా తెగడగా, పోతన అమాత్యుడు మాత్రం పితామహుని బ్రహ్మదేవుని ‘క్రూరుడు’గా పేర్కొని గాని ఊరడిల్ల లేకపోయాడు!
క॥ ‘కట్టా! మన్మథు కోలలు నెట్టిన నో నాట బెగడి నీ పాదంబుల్ పట్టి కొనగ వచ్చిన మము నట్టడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా!’
మాధవా! కమ్మవిల్తుని మన్మథుని అమ్ములు బాణాలు వమ్ము (వృథా) గాక మమ్ములను గట్టిగా బాధించగా భయపడి తట్టుకోలేక నీ పాదమ్ములు పట్టుకోడానికి వచ్చాము. అట్టి మమ్ము, జగజెట్టి (ప్రసిద్ధ శూరుడ)వైన ఓ నందు పట్టీ! కన్నయ్యా! నట్టేట ముంచినట్టుగ ఈ చిట్టడవిలో ఇట్టే వదలిపెట్టి వెళ్లడం న్యాయమా?
శుకయోగి రాజా! ‘ఈ తీరుగా ఆ గోప వెలదులు మృదు మధురమైన కంఠస్వరంతో యదుభూషణుని పొగడుచూ, పాడుచూ ‘ప్రియతమా! రావయ్యా! కావవయ్యా!’ అని పిలుస్తూ విలపించసాగారు. జగద్రక్షకుడైన ఆ జగన్నాథుడు జనార్దనుడు త్రిజగన్మోహనుడై, మన్మథ మన్మథుడై మదనుని కూడా మోహపెట్టు భువన సుందరుడై, ఆ మందరగిరిధారి మురారి హారియై అందమైన హారాలు ధరించి, ఘన పీతాంబర ధారియై పచ్చని పట్టు పుట్టము గట్టి వారి ముందు ఆవిర్భవించాడు. అలా కనిపించిన వల్లభుని శౌరిని గాంచి పల్లవాధరలైన ఆ వల్లవ వెలదులు గోపికలు, పోయిన ప్రాణాలు వస్తే దేహేంద్రియాలన్నీ చైతన్యవంతాలై విలసిల్లునట్లు, విచ్చిన మోములతో విరాజిల్లారు.’ ‘మన్మథ మన్మథుండయి’ అందరి డెందాలను తన కళలతో కలవర పెట్టే మన్మథుని మనస్సును కూడా మథించేవాడు కామజనకుడు, కంజలోచనుడు మధురానాథుడైన మధుసూదనుడు! ‘కాంతలం గరగించెన్ రతికేళి గృష్ణుడు గృపం గందర్పు బాలార్చుచున్’ ‘కందర్పుని దర్ప గర్వ మణస్తూ త్రైలోక్య సంతర్పి శ్రీకృష్ణుడు గోపకాంతలను కరుణతో కామకేళిలో కరగించాడు’ అని మన పోతన తెనిగింపు. ‘అయ్యో! నేను కూడా ఒక గోపభామనైతే నాకు కూడా పూర్ణకామత్వం నిష్కామత్వం లభించి ఉండేది కదా!’ అని అనంగుడు, సర్వాంగ సుందరుడు కామదేవుడు అంగలార్చాడట!
శుకుడు రాజా! మానవతులంతా తమ మనోహరుని గోవర్ధన ధరుని చుట్టూ మూగిపోయారు. ఆ మోహనాంగులందరూ మదన మోహనుని ఎలాగైనా ముట్టుకొని, ముద్దాడి ‘సోహం’ భావంతో తన్మయలై, తలమునకలై మురిసిపోవాలని కనువిందుగా మునుముందుకు తోసుకు వస్తున్నారు. నందనందనుని చరణారవిందాలను సందర్శిస్తూ రుచి మరగి, తనివి పొందని సత్పురుషుని వలె, ఒక సుందరి హరి ముఖారవిందాన్ని అవలోకిస్తూ తృప్తి పొందలేకపోయింది. ఒక హేలావతి విలాసిని అనురక్తితో అంజలించి కుంజవిహారి కెందామర (ఎర్ర కమలం) వంటి అందమైన కేలు (చెయ్యి) పట్టుకుంది. మరో వల్లవి (గోపిక) ప్రాణవల్లభుని పాణిని హస్తాన్ని తన బుజాన పెట్టుకొని మురిసిపోయింది. వేరొక జాంబూనదాభ హరణ్యవర్ణ తను వరించిన యదువరుని శ్రీధరుని తాంబూల చర్వితాన్ని (వమితం మధురం శమితం మధురం, మధురాధిపతే రఖిలం మధురం!) తన చేత ధరించి తరించింది. మరొక పంకేరుహాక్షి పంకజాక్షుని పాదపల్లవాలను విరహాగ్నిచే ఉడికిపోతున్న తన ఉరోజాలపై ఉంచుకొని ఇంచుక రవంత సేద తీరింది. మరొక కొమరాలు ముద్దుగుమ్మ కనుబొమలు ముడిచి, రసక్రీడా భంగం కలిగించాడు కనుక, కినుక పూని, వేడి పలుకులతో ఆడిపోసుకుంటూ, పెదవి కొరుకుతూ దండించు కైవడి కొట్టేదానివలె, వాడి చురుకు చూపులతో వన్నెకాడిని వెన్నదొంగను చూచింది. ఈమెనే మహాభావ స్వరూపిణి ‘ఆరాధనా రూపిణి’ యైన ‘రాధా మహారాణి’గా మహాత్ములు తమ వ్యాఖ్యానాలలో నిర్ణయించారు.
రాజా! ఒక లతాంగి ఉజ్జలంగా వెలుగొందే నీలమణిని కజ్జల (కాటుక) గోపాలుని కమనీయ రూపాన్ని తన చూపులనే తీగలతో బంధించి, హృదయంలో నిలిపి, చిలిపి కృష్ణుడు వెలుపలికి రాకుండా కళ్ల తలుపులు రెప్పలు తటాలున మూసివేసింది. లోలోన కౌగిలించుకొని తనువు పులకించగా మహా యోగీంద్రుని వలె అంతర్ముఖ సమారాధనతో సొంపైన లోరుచులతో ఆ కాంత సొక్కి (పరవశించి) సోలి (వాలి) పోయింది.
సీ॥ ‘ఎలయించి ప్రాణేశ! యెందు బోయితివని, తోరంపుటలుకతో దూఱె నొకతె జలజాక్ష! నను చూసి చనగ నీ పాదంబు, లెట్లాడెనని వగ నెయిదె నొకతె నాథ! నీ వరిగిన నా ప్రాణమున్నది, కూర్మియే యిది యని కుందెనొకతె యీశ్వర! నను నిన్ను నిందాక బాపనే, పాపపు విధి యని పలికె నొకతె’ ఆ॥ ‘తలగి పోవునట్టి తప్పేమి సేసితి?నధిప! పలుకు ధర్మ మనియె నొకతె యేమి నోము ఫలమొ హృదయేశ! నీ మోము మరల గంటి మనుచు మసలె నొకతె’
ప్రాణేశ్వరా! నను కికురించి మోసగించి ఎక్కడికెళ్లావు? అని ఒక అన్నువ చక్కనిది మిక్కిలి కినుక పూని వెన్నుని నిలదీసి నిందించింది. ‘కమలాక్షా! నన్ను వీడి వెళ్లడానికి నీకు కాళ్లు ఎలా ఆడాయి’ అని మరో వామాక్షి వాపోయింది. ‘ముకుందా! నీ వియోగంతో ఇంకా నా ప్రాణాలు నిలిచే ఉన్నాయే! ప్రేమంటే ఇదా?’ అంటూ ఒక కుందరదన డెందంలో కుందింది వగచింది. ‘శ్రీకాంతా! ఇంతదనుక దయ ఒకింత లేక పాపపు దైవం నలువ (విధి) మనలను విడదీసి ఉంచాడు గదా!’ అని ఇంకో చెలువ పలవించింది విలవిలలాడింది. ఒక ఒప్పుల కుప్ప ‘ప్రభూ! తప్పించుకుపోయేటంత ఏమి తప్పు చేశానో, ధర్మం చెప్పు’ అన్నది. ‘ఏ నోము ఫలమో ఇది, ఘనాఘన సుందరా! మరల నిన్ను కనగలిగాను, మన గలిగాను’ అని వెను దిరిగి మేను మరచింది ఒక రమణి.
క॥ ‘హరి సురుచిర లలితాకృతిదరుణులు గని ముక్త విరహ తాప జ్వరలై పరమోత్సవంబు సలిపిరి పరమేశ్వరు గనిన ముక్త బంధుల భంగిన్’
ఈ విధంగా భగవంతుని దర్శించి భవ బంధాల నుంచి బయటపడిన భాగవతుల వలె, నందనందనుని సుందర సముజ్జల స్వరూపం దర్శించిన ఆ ఇందువదనలు అందరూ విరహతాప జ్వరం తొలగిపోగా పరమానంద భరితలయ్యారు. వారి అంతరంగంలోని అధి వ్యాధులు సాంతం అంతరించిపోయాయి. ఎలా? ‘వారును జ్ఞానకాండంబున నీశ్వరుంగని శ్రుతులు ప్రమోదంబునం గామాను బంధంబులు విడిచిన విధంబున, హరింగని, విరహ వేదనలు విడిచి, పరిపూర్ణ మనోరథలై’… అని అమాత్యుడు శ్రీధరుని వ్యాఖ్యానాన్ని కూడ తెనిగించి, పరమార్థాన్ని కని తరించండని పాఠకలోకాన్ని కనికరించాడు. శ్రుతులు కర్మకాండను వర్ణించి వర్ణించి పరమేశ్వరుని మర్మం కనలేక కడకు జ్ఞానకాండ (ఉపనిషత్తుల)ను ప్రతిపాదించి, సమస్త మనోవాంఛలూ అధిగమించి అతిక్రమించి అకామత్వం అమనస్కత పొంది కృతకృత్యలైన విధంగా, గోపికలూ గోవిందుని పొందుతో పూర్ణకామలయ్యారు. వాసుదేవునితో గోప వనితల మానసిక మేళనమే రాసలీల! (సశేషం)
మ॥ ‘అని యిట్లంగన లంచిత స్వరముతో నంకించుచుం బాడుచుందను ‘రావే’యని చీరి యేడువ జగత్త్రాణుండు త్రైలోక్య మోహనుడై మన్మథ మన్మథుండయి మనోజ్ఞాకారియై హారియై ఘన పీతాంబర ధారియై పొడమె దత్కాంతా సమీపంబునన్’
ఉ॥ ‘నీ వడవిం బవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మిచ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుంగావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ లక్ష్మీవర! ఱెప్పలడ్డముగ జేసె నిదేల? విధాత క్రూరుడై’…
ఉ॥ ‘ఒక్క లతాంగి మాధవుని యుజ్జల రూపము సూడ్కి తీవలం జిక్కగ బట్టి హృద్గతము జేసి వెలిం జనకుండ నేత్రముల్గ్రక్కున మూసి మేన బులకంబులు గ్రమ్మగ గౌగిలించుచుం జొక్కములైన లోచవుల జొక్కుచు నుండెను యోగి కైవడిన్’
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006