మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ధూప్ఖేడా గ్రామంలో చాంద్ భాయ్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు. అతను గ్రామాధికారి, ధనవంతుడు. ఓ రోజు ఔరంగాబాద్‌కు ప్రయాణంలో అతని గుర్రం తప్పిపోయింది. ఎంతగానో వెతికాడు చాంద్‌భాయ్ పటేల్. అయినా లాభం లేకపోయింది. నిరాశతో వెనుదిరిగాడు. గుర్రం మీది ప్రేమతో దాని జీను భుజాన వేసుకొని ఇంటిముఖం పట్టాడు. దిగాలుగా నడుస్తూ చాలా దూరం ప్రయాణించాడు. తోవలో ఓ మామిడి చెట్టు కింద ఒక ఫకీరు (సాయి) కూర్చుని ఉన్నాడు. నెత్తిన టోపీ, పొడవైన చొక్కా, చంకలో బెత్తం ఉంది. పొగ పీల్చడానికి చిలుము గొట్టం సవరిస్తున్నాడు. చాంద్భాయ్ని పొగతాగి వెళ్లమని పిలిచాడా ఫకీరు. ‘ఈ జీను ఏమిటి? ఎందుకు మోస్తున్నావు?’ అని అడిగాడు. ‘నా గుర్రం అంటే నాకెంతో ప్రేమ. అది తప్పిపోయింది. చాలా వెతికాను. ఎక్కడా దొరకలేదు. చివరికి ఈ జీను మిగిలింది’ అన్నాడు చాంద్‌భాయ్ ఏడుపు ముఖంతో!
‘ఎందుకైనా మంచిది ఈ చుట్టుపక్కల ఒకసారి వెతుకు’ అన్నాడు ఫకీరు. చాంద్భాయ్కి నమ్మకం కుదరలేదు. కానీ, ‘ఏ పుట్టలో ఏ పాముందో!’ అనుకొని బయల్దేరాడు. చుట్టుపక్కల చూశాడు. కాసేపటికి తన కోసం వెతుకుతున్న యజమాని కంటపడగానే గుర్రమే సకిలిస్తూ చాంద్‌భాయ్ దగ్గరికి పరుగెత్తుకొచ్చింది. ‘ఇతడు మామూలు ఫకీరు కాడు. ఏ మహానుభావుడో!’ అనుకున్నాడు. ఫకీరుకు సాష్టాంగపడి తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అతని మాట మన్నించి ఫకీరు వారింట్లో కొంతకాలం ఉన్నాడు. ఆ సమయంలోనే చాంద్‌భాయ్ మేనల్లుడికి పెండ్లి కుదిరింది. పెండ్లికూతురు పుట్టిల్లు షిరిడీ. చాంద్‌భాయ్ బంధుమిత్రులతో షిరిడీకి బయల్దేరాడు. ఫకీరు బాబా కూడా షిరిడీ చేరుకున్నాడు. ఆయన బండి దిగుతుండగా ఖండోబా (వీరభద్ర) దేవాలయ అర్చకుడు మహల్సాపతి ఫకీరును చూసి ఎంతో గౌరవంగా ‘ఆయియే! సాయీ!’ అని పిలుస్తూ ఆహ్వానం పలికాడు. అప్పటినుంచి షిరిడీలో ఉండిపోయాడు బాబా. ‘షిరిడీ సాయి’గా భక్తుల పిలుపు అందుకున్నాడు.
ఇది జరిగిన కథే అయినా ఇందులో గ్రహించాల్సిన అంతరార్థాలు కొన్ని దాగున్నాయి. గుర్రం కోరికకు సంకేతం. మనిషి కోరిక కోసం తపించి తపించి అన్వేషించి అలసిపోవడం సహజం. ఆ కోరిక తీరనిదే అతను భగవానుడికి సన్నిహితుడు కాలేడు. సాయితత్తంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, తనను ఆశ్రయించిన వారి కోరికను ముందుగా తీరుస్తాడు సాయి. అప్పుడా జీవుడు దేవుని పట్ల ఆకర్షితుడవుతాడు. తనపట్ల ఆకర్షితులు కాకున్నా పుణ్యబలం ఉన్నవాళ్లకు సాయి తానే ప్రసన్నుడై వారి కోరికలు తీర్చి దివ్యతత్తంలోకి వారిని ప్రవేశపెడతాడు.
సాయి చిలుము పీల్చడం మామూలు వ్యక్తిలా కనిపించడానికే! అవతార పురుషులు నిజమైన భక్తులను మాత్రమే తమ దగ్గరికి రప్పించుకోవడానికి ఇలాంటివి అవలంబిస్తారు. ‘ఈ పొగతాగే వ్యక్తి దగ్గర ఆధ్యాత్మిక శక్తి ఏముంటుందిలే?’ అని చూసినవాళ్లు చూసినట్టుగా వెనక్కి తిరిగిపోవడానికి మహనీయులు ఇలాంటి చర్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. యథార్థమైన భక్తులు మాత్రం జాగ్రత్తగా మసలుతూ క్రమంగా దివ్యశక్తి సంపన్నుల సాన్నిథ్య భాగ్యానికి నోచుకోగలుగుతారు.
ఆప్తులు దూరమైనా వారి మీద మమకారం విడిచిపెట్టలేరు చాలామంది. అదేవిధంగా గుర్రం పోయినా దాని జ్ఞాపకార్థం జీను భుజాన వేసుకొని తిరుగసాగాడు చాంద్ పటేల్. సాయి అతణ్ని సాదరంగా పిలిచాడు. పిలిస్తే వచ్చే గుణం అతనిలో ఉన్నది కాబట్టి పిలిచాడు. సాయి పిలవగానే వచ్చి చాంద్ పటేల్ ప్రయోజనం పొందాడు. ‘నువ్వు నాకు చెప్పేదేమిటి? నేనెంతో వెతికాను’ అని వితండవాదం చేయలేదు. తన ఆరాటంలోపడి సాయి ఆహ్వానాన్ని తిరస్కరించి ఉంటే అతనికి ప్రయోజనం దక్కి ఉండేది కాదు. తాత్కాలికమైన గుర్రం ఇహం. షిరిడీ సాయిబాబా అనుగ్రహం పరం వంటిది. అది శాశ్వతం. చాంద్‌భాయ్ రెండిటికీ నోచుకోగలిగాడు. అది అతని పుణ్య విశేషం. ఫకీరు పేరు లేని వాడే! అన్ని పేర్లూ భగవానుడివే మరి! షిరిడీలో బండి దిగుతూనే ఫకీరు ముఖ కమలాన్ని చూసి మహల్సాపతి ‘ఆయియే! సాయీ!’ అనగానే వచ్చాడు. సాయిని ఆప్యాయంగా ‘ఆయియే!’ అని గౌరవంగా పిలవడమే ప్రధానం.
–డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
94411 62863