శనివారం 05 డిసెంబర్ 2020
Devotional - Oct 22, 2020 , 11:27:08

సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు

సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు

తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం స్వామి వారు శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. స్వామి వారు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. కార్యక్రమంలో పెద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, డాక్టర్‌ నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్‌, గోవింద హరి, డీపీ అనంత, సీవీఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.