భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక చరిత్రలో శ్రీకృష్ణ తత్వం ఒక మహత్తరమైన మార్గం. శ్రీకృష్ణుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వేణువు, నెమలి పింఛం, రాధారాధన, గోపికలు, కురుక్షేత్ర యుద్ధం, అర్జునుడికి చెప్పిన భగవద్గీత మాత్రమే కాకుండా ఆయన చిన్నతనంలో చేసిన అల్లరిపనులు కూడా స్ఫురణకు వస్తాయి. కృష్ణుడి బాల్యంలో ఆయనలో కనిపించిన లీలాతత్వం, యౌవనంలో కనిపించిన ప్రేమ-భక్తి తత్వం, మథురలో కనిపించిన ధర్మరక్షణ, ద్వారకలో కనిపించిన రాజనీతి, కరుక్షేత్రంలో జ్ఞానబోధ ఇవన్నీ కలిపితేనే సంపూర్ణమైన కృష్ణతత్వం.
శ్రీకృష్ణుడు కేవలం పురాణపురుషుడు మాత్రమే కాదు. ధర్మం, రాజనీతి, తత్వశాస్త్రం, యోగం, భక్తి, జ్ఞానం, కర్మ, మనోవిజ్ఞానం, సామాజిక బాధ్యత లాంటి అనేక శాస్ర్తాల సమాహారం. భక్తి కోణంలో ఆయన భగవంతుడు, చరిత్ర ఇతిహాస కోణంలో మహాభారతంలోని కీలక వ్యక్తి, తత్వశాస్త్ర కోణంలో గీతాచార్యుడు, నాయకత్వ కోణంలో వ్యూహకర్త, మనోవిజ్ఞాన కోణంలో సంక్షోభంలో ఉన్న అర్జునుడికి మార్గదర్శి, సామాజిక కోణంలో వ్యవస్థను, సమాజాన్ని కాపాడే నాయకుడు, ఆధునిక ఆలోచనా కోణంలో పరిస్థితిని విశ్లేషించి, భావోద్వేగాలను నియంత్రించి, అందుబాటులో ఉన్న సమాచారంతో నిర్ణయం తీసుకుని తన బాధ్యతలను నిర్వర్తించమని చెప్పే మనోవిజ్ఞానవేత్త.
కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యాసుడన్నట్లు కృష్ణుడు స్వయం అవతరణ. భగవంతుడే స్వయంగా మానవుడిగా వచ్చిన రూపం. శ్రీకృష్ణుడు మనకు బాగా తెలిసిన దైవం. సమాజప్రక్షాళన అతని కార్యక్రమం. మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాం కానీ, ఆయన తత్వంలోని పరమార్థం మనకు ఏమాత్రం తెలియదు. బృందావనంలో ఆటలు, రేపల్లెలో లీలలు .. ఇలా ఇవన్నీ ఆయన 125 సంవత్సరాల దీర్ఘ జీవితంలో మొదటి 12 సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి! కానీ, శ్రీకృష్ణుడి పాత్ర ద్వాపర యుగాంతం వరకు ఉంటుంది. ఆయన జీవితంలో ప్రతీ అంశం ఏదో ఒక శాస్త్రంతో ముడిపడి ఉన్నట్లుగా భాగవతం, భారతాలలోని పలు ఘట్టాలు చెబుతాయి.
శ్రీకృష్ణుడిలోని బహుముఖాలను దర్శిస్తే ద్వారక నిర్మాణంతో వాస్తుశిల్పి, అర్జునుడి మానసిక సంఘర్షణను రూపుమాపి యుద్ధం చేయించిన సైకాలజిస్టు, తన వేణుగానంతో సకలజనులను సమ్మోహనపరిచిన సంగీతకారుడు, ఆరోగ్యం, జీవనశైలి, ఆయుర్వేద సంప్రదాయాలతో అనుసంధానమై గోవు ప్రాముఖ్యాన్ని చాటిన వైద్యుడు. ధర్మరక్షణ, యుద్ధ నిర్ణయాలతో మహా వీరుడయ్యాడు. ద్వారకపాలనతో రాజనీతిజ్ఞుడు, గోవర్ధనగిరి ఉద్ధరణ ఘట్టం, వర్షం-యుజ్ఞంపై భగవద్గీతలో చెప్పిన చర్చ వంటి వాటితో ైక్లెమటాలజిస్ట్. అంతేకాదు గతి, భ్రమణం, వేగం వంటి భౌతిక శాస్త్ర సూత్రాలతో సుదర్శన చక్రాన్ని నియంత్రించిన కైనెటిక్ ఇంజినీర్, ఇలా బహుముఖ ప్రజ్ఞలతో నేటి తరానికి తన జీవనాన్ని ఆదర్శంగా మలిచాడు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప రాజకీయవేత్త కూడా! పాండవుల తరఫున శాంతి రాయబారిగా వెళ్లడం, యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నించడం, చివరికి ధర్మయుద్ధంలో వ్యూహాత్మకంగా మార్గనిర్దేశనం చేయడం ఆయన రాజకీయ దూరదృష్టిని చూపుతుంది.
‘వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం..’ ఆయన ముఖ్యమైన తత్వం జగద్గురు తత్వం. గీతాచార్యుడుగా ఆయన జగద్గురువయ్యాడు. ఆయన అర్జునుడికి కేవలం యుద్ధం చేయమని చెప్పలేదు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే వివేకాన్ని ముందుగా బోధించి ఆ తర్వాత యుద్ధం చేయమన్నారు. ‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించిన ధర్మసిద్దాంతం కేవలం ఒక కాలానికి సంబంధించినది కాదు. సమాజంలో ధర్మం బలహీనపడినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, ధర్మాన్ని పునఃస్థాపించడానికి ప్రతీ వ్యక్తి తన వంతు బాధ్యతను సర్వకాలాలలో నిర్వర్తించాలనే సందేశంతో కూడుకున్నది.

Krishma
శ్రీకృష్ణుడు అంటేనే యోగం. ఆయన మహాయోగి. భగవద్గీతలో ప్రతీ అధ్యాయం యోగమే. అందుకే ‘యోగక్షేమం వవామ్యహం’ అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిది లభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడటం. కృష్ణతత్వం చెప్పేది మొదటగా శాంతియే కానీ అధర్మం శాంతిని దుర్వినియోగం చేస్తే ధర్మరక్షణ కోసం కఠిన నిర్ణయం అవసరమంటారు. శ్రీకృష్ణతత్వంలో వేదాంతం కనిపిస్తుండగా అందులో అత్యున్నతమైన అంశం ఆత్మజ్ఞానం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి శరీరం నశించినా ఆత్మ నశించదని వివరిస్తాడు. ఆత్మకు జననం, మరణం లేవనే భావన ద్వారా శ్రీకృష్ణుడు మనిషిని భౌతికభయాల నుంచి ఆధ్మాత్మిక ధైర్యం వైపు నడిపిస్తాడు.
మరో అంశం కర్మశాస్త్రం. ఇందులో కర్తవ్యమే మార్గమని చెబుతారు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన..’ మనిషికి తన కర్తవ్యంపై అధికారం ఉంది కానీ దాని ఫలితంపై సంపూర్ణ నియంత్రణ ఉండదంటారు. ఇది మనిషి జీవితంలో ఉద్యోగం, విద్య, కుటుంబం, సమాజసేవ ప్రతీ రంగానికి వర్తించే జీవనసూత్రం. ప్రస్తుత సమాజంలో భగవద్గీత వృద్ధులకు మాత్రమే పనికి వచ్చే పుస్తకమనుకుంటున్న యువత తెలుసుకోవలసినది ప్రతీ మనిషి తన నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతీ సంఘర్షణకు మార్గం చూపించేది గీత. దానిని మించిన మేనేజ్మెంట్ పుస్తకం ప్రపంచంలో మరొకటి కనిపించదు.
శ్రీకృష్ణుడి తత్వం మనిషి జీవితంలోని ప్రతీ సమస్యకు ఏదో ఒకవిధంగా ఆలోచించే మార్గాన్ని చూపించే పరిష్కారమవుతుంది. కృష్ణుడిని కేవలం పూజించడమేనా లేక ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడమా.. ఏం చేయాలి.. ఎందుకు చేయాలి.. ఈ ప్రశ్నలకు కృష్ణుడి మార్గమే సమాధానం చెబుతుంది. కృష్ణుడు కేవలం దేవతాస్వరూపం మాత్రమే కాదు.. మనిషి, మనసు, సమాజం, నిర్ణయం, నాయకత్వం గురించి ఆలోచించడానికి వేల సంవత్సరాలుగా మన ముందున్న ఒక మహత్తరమైన ప్రశ్నతో కూడిన సమాధానం. ఆయన చెప్పిన మాటలను మన జీవితంలో ఎంతవరకు అర్థం చేసుకుని ఆచరిస్తున్నామన్నదే కృష్ణుడి ఆరాధనలో పరమార్థం. కృష్ణతత్వం ఒక మతపరమైన ఆరాధనా భావనకు మాత్రమే పరిమితం కాకుండా.. అది మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎలా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఎలా సమాజానికి ఉపయోగపడాలి, చివరికి తన నిజమైన స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నలకు మార్గనిర్దేశనం చేసే సమగ్ర జీవనదర్శనం.
రంగనాథ్ మిద్దెల, 9866573461