మహాభారతంలో అరుదైన పాత్ర భీష్ముడు. శాపవశాత్తు.. మనిషిగా జన్మించాడు. వరప్రభావంతో.. ఇచ్ఛా మరణాన్ని పొందాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి, చేయని తప్పులకు శిక్ష అనుభవించాడు. జీవితంలో అలుపెరుగని పోరాటం చేసిన ఈ యోధుడు సదా స్మరణీయుడు.
ఇక్ష్వాకు వంశరాజు అయిన మహాభిషుడు పుణ్యవశంతో శాశ్వత దేవలోక నివాసార్హుడయ్యాడు. ఒకనొకనాడు దేవతల సభ జరుగుతున్నది. ఆ సభకు గంగాదేవి వచ్చింది. చిరుగాలి వల్ల ఆమె పయ్యద తొలుగగా మహాభిషుడు గంగాదేవిని సాభిప్రాయంగా చూశాడు. వీరిని చూసిన బ్రహ్మదేవుడు కోపగించి మానవజన్మ ఎత్తి సంతానము కనమని శపించాడు.
అష్టవసువులు తమ తమ భార్యలతో వశిష్టాశ్రమానికి వచ్చారు. వశిష్టుడు సురభి సాయంతో వారికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశాడు. అన్నదమ్ములలో ఎనిమిదో వాని పేరు ప్రభాసుడు. సురభి పాలను తాగిన వారికి జరామరణాలు ఉండవని విన్న ప్రభాసుని భార్య యోగసిద్ధికి సురభిని తీసుకెళ్లి తన చెలికత్తకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. యాగధేనువును అడిగితే వశిష్టుడు ఇవ్వడేమోనన్న అనుమానంతో వారు ఆ గోవును దొంగలించారు. విషయాన్ని కనిపెట్టిన వశిష్టుడు మానవుల్లా చోరబుద్ధితో వ్యహరించారు కాబట్టి, మనుషులుగా పుట్టమని అష్టవసువులను శపించాడు. వసువులు తమను క్షమించమని వేడుకోగా, పెద్దవారు ఏడుగురు మనుషులుగా జన్మిస్తే సరిపోతుంది, ప్రభాసుడు మాత్రం దీర్ఘకాలం జీవించవలసి ఉంటుందని చెప్పాడు వశిష్ఠుడు.
మహాభిషుడు కురువంశ రాజైన ప్రతీపునికి శంతను నామంతో కుమారుడిగా జన్మించాడు. శంతనుని వివాహం చేసుకోవడానికి గంగ దివి నుంచి భువికి దిగి వస్తుండగా అష్ట వసువులు ఆమెను కలిశారు. ఎవరో మానవ కాంతకు జన్మించడం కన్నా.. నీ కడుపున పుట్టడం ఉత్తమం కదా! కాబట్టి నీవు తల్లిగా మమ్మల్ని మోయాలని ప్రార్థించారు వసువులు. మొదట పుట్టిన ఏడుగురు శిశువులను జన్మించగానే నదిలో పడవేయమని, ఎనిమిదో వాడు దీర్ఘకాలం నీకు కుమారుడిగా ఉంటాడని చెప్పారు.
‘నా మాటకు ఎదురాడకుండా ఉన్నన్నాళ్లే నీతో కాపురం’ అన్న షరతు మీద శంతనుణ్ని వివాహమాడింది గంగాదేవి. పుట్టిన శిశువును పుట్టినట్లు నదిలో పారేసి రాసాగింది. ఆమెపై ఉన్న వ్యామోహంతో మిన్నకున్నాడు శంతనుడు. కానీ, ఎనిమిదో శిశువును పారేయడానికి వీల్లేదన్నాడు. శంతనుడు అడ్డుకోకున్నా.. గంగ తన ఎనిమిదో శిశువును నదిలో పారేసేది కాదు. దేవ రహస్యం తెలియక శంతనుడు ఆమెను అడ్డుకున్నాడు. భర్తతో విడిపోయిన గంగ కొడుకును పరశురాముని శిష్యరికంలో సర్వ విద్యా పారంగతునిగా చేసి.. తిరిగి భర్తకు అప్పగించి వెళ్లిపోయింది. శంతనుని కుమారుడు కాబట్టి శాంతనవుడు. గంగ కొడుకు కనుక గాంగేయుడు. వారిరువురు కలిసి శిశువుకు పెట్టిన పేరు దేవవ్రతుడు.
సత్యవతిని తన తండ్రి వివాహమాడే సందర్భంలో దాశరాజు విధించిన షరతులను నెరవేర్చే క్రమంలో తాను అసలు పెండ్లి చేసుకోనని, జన్మాంతమూ బ్రహ్మచారిగానే మిగిలిపోతానని భీషణ ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు భీష్ముడిగా పేరొందాడు.
చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు సత్యవతి సంతానం. వీరి బాల్యంలోనే శంతనుడు మరణించాడు. చిత్రాంగదుడు కయ్యానికి కాలుదువ్వే మనస్తత్వం కలవాడు. గంధర్వునితో కొని తెచ్చుకున్న యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యునికి రాజుకు ఉండవలసిన లక్షణాలు కొరవడటంతో.. అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. తమ్ముడి వివాహం కోసం బీష్ముడు కాశీరాజు పుత్రికలైన అంబ, అంబిక, అంబాలికలను చెరపట్టి తీసుకొచ్చాడు. అంబ తాను సాళ్వుడిని ప్రేమించిన విషయం చెప్పడంతో, ఆమెను కట్నకానుకలతో వెనుకకు పంపాడు. అంబిక, అంబాలికలతో విచిత్ర వీర్యుని వివాహం జరిపించాడు. సాళ్వుడు అంబను తిరస్కరించాడు. అభిమానవతి అయిన ఆమె భీష్మునిపై పగబూని యోగాగ్నిలో దగ్ధమై ద్రుపద మహారాజుకు పుత్రికగా జన్మించి, పుత్రునిగా మారి శిఖండి నామంతో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నది. శిఖండి ఎదురుపడిన కారణంగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్యను వరించాడు.
విచిత్ర వీర్యుడు నిస్సంతుగా మరణించాడు. శంతనునితో వివాహం జరగకముందే సత్యవతికి పరాశర మహర్షి కారణంగా కృష్ణ ద్వైపాయనుడు (వేదవ్యాసుడు) జన్మించాడు. సత్యవతి వేదవ్యాసుణ్ని పిలిపించి నియోగ పద్ధతిలో తనకు మనుమనలను ప్రసాదించమని కోరింది. అంబికకు గుడ్డివాడైన ధృతరాష్ర్టుడు, అంబాలికకు పాండురోగ గ్రస్తుడైన పాండురాజు జన్మించారు. ఇటువంటి పుత్రులు జన్మిస్తారని వేదవ్యాసుడు ముందే చెప్పడంతో మరొక ఆరోగ్యకరమైన శిశువును ప్రసాదించమని వ్యాసుణ్ని కోరింది సత్యవతి. కోడళ్ల అతి తెలివి వల్ల అన్ని రకాల యోగ్యుడైన వ్యక్తి దాసీ పుత్రుడిగా జన్మించాడు. అతడే విదురుడు.
భీష్మ ప్రతిజ్ఞ చేసిన రోజున తండ్రి శంతనుడు.. దేవవ్రతునికి ఇచ్ఛా మరణాన్ని ప్రసాదించాడు. సత్యవతి తనకు పినతల్లిగా వచ్చిన నాటినుంచి ఆమె అభీష్టాన్ని ఎదురాడకుండా.. నెరవేర్చేందుకు తన జీవన సర్వస్వాన్నీ వెచ్చించిన పురుషోత్తముడు భీష్ముడు. తండ్రి వరంగా ప్రసాదించిన ఇచ్ఛా మరణం అతని పాలిట శాపమైంది.
నియోగ సంతానం ముగ్గురూ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చారు. ధృతరాష్ర్టునికే పట్టాభిషేకం అన్న వార్త ప్రకటించడంతో.. అంధునికి రాజ్యార్హత లేదంటూ అభ్యంతరం తెలిపాడు విదురుడు. పాండురాజు పాలకుడయ్యాడు. విదురునికి తెలిసిన విషయం భీష్మునికి తెలియదా! పెద్ద మనుమనికి రాజ్యమన్నది సత్యవతి నిర్ణయం. భీష్ముడు కాదనడు. అందివచ్చిన సింహాసనం చేజారడంతో ధృతరాష్ర్టునికి పాండురాజుపై విద్వేషం. అన్నగారిదని ప్రకటించిన రాజ్యాన్ని స్వీకరించాల్సి వస్తున్నందున పాండురాజు కలత చెందాడు. పాండురాజు రాజ్య విస్తరణ చేసి, రాజ్యాన్ని సుస్థిర పరిచాడు. కానీ, సింహాసనం ఎక్కి పాలించలేదు. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ధృతరాష్ట్ర, పాండురాజులలో కలుగబోయే మొదటి సంతానానికి రాజ్యార్హత అన్న నిర్ణయం జరిగింది.
కిందమ మహర్షి పెట్టిన శాపంతో సంతానార్హతను కోల్పోయిన పాండురాజు తపస్సు నిమిత్తం హిమవత్పర్వత సానువులకు వెళ్లిపోయాడు. అర్హత లేని ధృతరాష్ర్టుడు మహారాజయ్యాడు. ఒక విధంగా ఇది పాదుకా పట్టాభిషేకం. పాదుకలు మాట్లాడవు గనుక భరతునికి ధర్మబద్ధ పాలన సులువైంది. ఈర్ష్యాళువైన ధృతరాష్ర్టుడు, కులక్షయానికి జన్మించిన దుర్యోధనుడు వీరిద్దరూ భీష్ముని ధర్మబద్ధ పాలనకు అవరోధాలై నిలిచారు. పైగా అది పినతల్లి అభిష్టానుసారం నడువవలసిన అధికారం లేని పాలన.
గాంధారి ముందుగా గర్భం ధరించింది. కానీ, ముందుగా పుట్టిన వాడు ధర్మరాజు. ఇది కూడా ధృతరాష్ర్టునికి మింగుడుపడలేదు. దుర్యోధనుడు ఔరస పుత్రుడని, ధర్మరాజు నియోగ పుత్రుడనీ వాదం. తాను స్వయంగా నియోగ పుత్రుడన్న విషయం ధృతరాష్ర్టునికి గుర్తులేదు. ఆయనకు సంతానమన్నది రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి సాధనం. సంతానం ఉన్నవారే స్వర్గాన్ని పొందగలరు. కనుక తనకు పిల్లలు కావాలనుకున్నాడు పాండురాజు.
పది రోజుల యుద్ధం తర్వాత శిఖండి కారణంగా భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యను ఎంచుకున్నాడు. ఇచ్ఛా మరణం ఉన్నది కాబట్టి, ఆయన ఉత్తరాయణంలో మరణించాలని భావించాడు. సుమారు రెండు నెలలు యుద్ధభూమిలో, ఆరుబయట పదునైన బాణాలు తన దేహంలోకి కొద్దికొద్దిగా చొచ్చుకొని పోతుండగా, ప్రాణాలను ఉగ్గబట్టుకొని జీవించాడు. అందుకు రెండు కారణాలు.
మొదటిది పాప ప్రక్షాళన. విచిత్ర వీర్యుని కోసం అంబ, అంబిక, అంబాలికలను చెరపట్టవలసి రావడం, గాంధార రాజ్యాన్ని బెదిరించి గాంధారి వివాహాన్ని ధృతరాష్ర్టునితో జరిపించడం. ధృతరాష్ర్టుని పాప చింతనం, దుష్ట చతుష్టయ దుర్మార్గ కార్యాచరణను నియంత్రించలేకపోవడం, మాయా ద్యూతాన్ని, ద్రౌపది వస్ర్తాపహరణాన్ని నివారించలేకపోవడం, ఇత్యాదులెన్నో భీష్ముడి మనసులో మెదులుతున్న కారణంగా ఆయన ఇహలోక నరకాన్ని ఎంచుకొన్నాడు. ఈ తనువు విడిచి పెట్టగానే అష్ట వసువుల్లో అతను తన బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నది కదా!
రెండో కారణం.. ధర్మ సంస్థాపనం. అసంఖ్యాకమైన మరణాల వల్ల వచ్చిన రాజ్యాన్ని స్వీకరించడానికి ధర్మరాజు సిద్ధంగా లేడు. ధర్మ బద్ధమైన యుద్ధం క్షత్రియుని బాధ్యత, రాజ్యపాలనం ఒక కర్తవ్యం, సౌఖ్యం కాదు అన్న విషయాన్ని ధర్మరాజుకు బోధించి, అతనిని పట్టాభిషేకానికి సుముఖుడిగా చేయగలిగే శక్తి భీష్మునికి మాత్రమే ఉన్నది.
అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన నిష్కామ కర్మను భీష్ముడు తాను బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తూనే ఉన్నాడు. అర్జునుడికి సంశయాలు ఉండేవి. భీష్ముడికి లేవు. శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో అర్జునుడికి బోధించిన భగవద్గీతకు, భీష్ముడు అంపశయ్యపై నుంచి ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్ర నామానికి సారాంశంలో భేదం లేదు. అందుకే విష్ణు సహస్ర నామానికి ‘భీష్మ గీత’ అని పేరు వచ్చింది.
పినతల్లికి ఇచ్చిన మాట ప్రకారం హస్తిన రాజ్యం సుస్థిరత కోసం, తన ధర్మబద్ద పాలనతో ప్రతీప, శంతనుల పేరు నిలబెట్ట గలిగిన మనువడు ధర్మరాజుకు రాజ్యపాలన అప్పగించాలని భీష్ముడు ఉత్తరాయణ నెపంతో మకర సంక్రమణం అనంతరం వచ్చిన శుక్ల పక్ష అష్టమి వరకు ప్రాణాలతో ఉన్నాడు. భీష్ముని త్యాగపూరిత, ధర్మాచరణాత్మక జీవితాన్ని రాబోయే యుగాలలో ప్రజలు గుర్తుంచుకునేందుకు గానూ, శ్రీకృష్ణుడు అష్టమి తదుపరి వచ్చే ఏకాదశిని ‘భీష్మైకాదశి’గా ప్రకటించాడు.
– వరిగొండ కాంతారావు