నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్!
(భగవద్గీత – 2-66)
మనసు, ఇంద్రియాలు వశంలో లేని వారిలో నిశ్చయాత్మక బుద్ధి నిలవదు. వారిని ‘అయుక్తుడు’ అంటున్నది గీత. అలాంటి అయుక్తుల మనసులో ఆస్తిక భావన కలుగదు. ఆస్తిక భావన లేనివారికి శాంతి లభించదు. శాంతి లేని వారికి సుఖం లభించడం ఎట్లు? అంటున్నాడు, కృష్ణపరమాత్మ.
యుక్తుడు అంటే యుక్తి కలిగిన వాడు. యుక్తి అంటే ఉపాయమని సాధారణార్థం. యుక్తి అంటే యోగమని పెద్దలు చెబుతారు. ‘యుక్తి అంటే వస్తువుల చక్కని కూర్పు’ అనేది విశేషార్థం. అనగా బుద్ధియందు మనసు, మనసులో ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధీనమైన ఇంద్రియార్థాలు… వీటన్నిటి వ్యాపారాలకు సదుపాయమైన యంత్రశాలగా దేహం చక్కగా ‘కూర్పు’ చెందుటే ‘యుక్తి’ అని పండితుల వ్యాఖ్యానం. ఎవరిలోనైతే ఈ కూర్పు చక్కగా సిద్ధిస్తుందో అతనిని ‘యుక్తుడు’ అంటారు. అలాంటి వారిలో మనసు ప్రసన్నమై శాంతిని పొందుతుంది. అలాంటి కూర్పు జరగని వారిని ‘అయుక్తులు’ అన్నారు. వారి మనసు అశాంతితో ఉంటుంది కాబట్టి సుఖం లభించదు. సుఖం అంటే? నిజానికి సుఖం, దుఃఖం రెండూ సాపేక్షాలే. ఒకదానికి అతీతంగా మరొకటి ఉండదు. కాబట్టి సుఖానికి ఎప్పుడూ దుఃఖ స్పర్శ ఉంటుంది. నిరంతర సుఖం గానీ దుఃఖం గానీ ఉండవు. అయితే సుఖదుఃఖ స్పర్శ లేకుండా ఆ రెండిటికీ అతీతమైన స్థితి మరొకటి ఉంటుంది. ఆ స్థితే శాంతస్థితి. అదే శాశ్వత స్థితి, పొందదగినది.. కాబట్టే దానిని ‘యోగం’ అన్నారు.
భోగాలపై ఆసక్తి కలగడం వల్ల వాటిని సాధించే క్రమంలో మనసు విక్షిప్తమై వ్యగ్రతను ఆశ్రయిస్తుంది. దానితో కర్తవ్యాకర్తవ్యాలను నిర్ణయించుకునే వివేచనకు దూరమవుతాం. వివేచన లేకపోవడమే బుద్ధి పనిచేయని స్థితి. పరమాత్మపై నిశ్చలంగా నిలవని భావనారహిత స్థితిలో శాంతి దూరమవుతుంది. మట్టికి రూపాన్నిచ్చి దానికి రకరకాలుగా రంగులనద్ది ఆకర్షణీయమైన కుండగా తయారుచేస్తాం. కానీ దాని మూలస్థితి మట్టి అనే భావనకు దూరమవుతాం. అలాగే శరీరమనే ఉపాధిని పొందాక.. ఆ శరీరానికి మూలమైన పరమాత్మను మరిచిపోతాం. దానికి కారణం మోహం లేదా అజ్ఞానం. ఆ మోహాదులను వదిలివేయ గలిగితేనే పరమాత్మపై మనసు నిలుస్తుంది. దానితో శాంతి లభిస్తుంది. శాంతితో కూడిన మనసు నిరంతరం ‘ఆనంద’ స్థితిలో రమిస్తుంది.
ఈ శ్లోకాన్ని ఆధునిక యాజమాన్య నిర్వహణతో అనుసంధానిస్తే… మనసు, బుద్ధి, ఇంద్రియాల సమన్వయ భావన… ఆత్మనిర్వహణ, భావోద్వేగాల నిర్వహణ, సరైన సమయంలో నిశ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, లక్ష్యంపై చెదరని దృష్టి, పనిని-జీవితాన్ని సమన్వయం చేసుకునే విధానం లాంటి పలు అంశాలను స్ఫురింపచేస్తుంది. ‘అయుక్తత’ అనేది బుద్ధి అస్థిరత లేదా భావనలో లోపం. మనసుపై నియంత్రణ లేకపోవడం వల్ల స్పష్టమైన ఆలోచన నిలవదు. దానితో సరైన దృక్పథం ఉండదు. ప్రణాళిక లేకుండా కార్యాన్ని ఆరంభించడం వల్ల కార్య సాఫల్యత జరగక మనసు ప్రశాంతతకు దూరమవుతుంది. దానితో కార్యభంగం జరిగి లక్ష్యాన్ని చేరలేం, దానితో శాంతి లోపిస్తుంది, సుఖానికి దూరమవుతాం.
‘యుక్తత’ అంటే నియమాలు పాటించడం మాత్రమే కాదు. మనసు, బుద్ధి, ఇంద్రియాలు, కోరికలు, కర్తవ్యాలు.. వీటన్నిటినీ సమన్వయ పరచి చక్కని వ్యవస్థగా నిర్వహించగల సామర్థ్యం. ‘యుక్తి’ అంటే యాజమాన్య నిర్వహణలో వివిధ విభాగాలను, కార్యక్రమాలను సమన్వయ పరచి సంస్థ సంస్కృతితో అనుసంధానించడంగా భావించవచ్చు. సంస్థలో సమున్నత లక్ష్యం ఉండటం, చక్కని వ్యూహ రచన, అవసరానికి సరిపోయే వనరులు, సమర్థత కలిగిన ఉద్యోగులు ఉండి కూడా వేటికవే పనిచేస్తే ఫలితం ఉండదు. ఈ విభాగాలను అన్నిటినీ సమన్వయపరచ గలిగిన నాయకత్వమే ఫలితాన్ని సాధిస్తుంది. దానినే యుక్తిగా భావించవచ్చు. అలాగే వ్యక్తిలో బుద్ధి లక్ష్యాన్ని నిర్ణయించాలి, మనసు దానిపై నిలవాలి, ఇంద్రియాలు ఆ దిశలో పనిచేయాలి. ఈ అంతర్గత సమన్వయం లేకపోతే వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా నిర్ణయాలలో అస్థిరత అశాంతికి మూలమవుతుంది.
అధికమైన ఫలితాసక్తి ‘భోగం’గా భావిస్తే.. పదవి, అధికారం, డబ్బు, ప్రశంస, గుర్తింపు.. వీటిని సాధించే క్రమంలో మనోవ్యగ్రత అధికమవుతుంది. దానితో ఒత్తిడి పెరిగిపోయి ఆందోళన కలుగుతుంది. తద్వారా భావోద్వేగాలకు లోనై విచక్షణను కోల్పోతాం. దానితో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఫలితంగా ప్రశాంతత దూరమవుతుంది. యాజమాన్య నిర్వహణలో ప్రతి విజయం సంతోషాన్ని, అపజయం దుఃఖాన్ని కలిగిస్తే నాయకుడు పరిస్థితులకు బానిసవుతాడు. అయితే విజయంలో పొంగిపోకుండా, అపజయంలో కుంగిపోకుండా, పరిస్థితిని ప్రశాంతంగా పరిశీలించి సముచిత నిర్ణయాలు తీసుకునే మానసిక స్థితి కలిగిన నాయకుడు సుఖదుఃఖాలకు అతీతునిగా చెప్పవచ్చు.
కుండకు అందమైన రూపం, రంగు, విలువ వచ్చినప్పటికీ దాని మూలం మట్టే. అలాగే ఉద్యోగికి పదవి, హోదా, సంపద, పేరు, ప్రతిష్ఠ వచ్చినా, అవి అతని అసలు స్వరూపాలు కావు. ఒక నాయకుడు తన పదవినే తన వ్యక్తిత్వంగా భావించినప్పుడు, పదవి కోల్పోతే అతని అంతర్గత సమతుల్యత కూడా దెబ్బతింటుంది. అందువల్ల పదవి మనకు బాధ్యతను ఇస్తుందే కానీ మన అసలు విలువను నిర్ణయించదు. తనను తాను నిర్వహించుకోలేని వ్యక్తి, ఇతరులను ప్రభావవంతంగా నిర్వహించలేడు. ఆధ్యాత్మికమైనా సంస్థ నిర్వహణ అయినా అంతర్గత సమన్వయమే సమర్థవంతమైన నిర్వహణకు పునాది.