కృష్ణాష్టమి సందర్భంగా..
Krishnashtami | అంబాడుతూ వెళ్లి మానులను కూల్చడం చిన్నికృష్ణుడి లీల. కాళీయుడిపై కేళి బాలకృష్ణుడి లీల. గోవర్ధన గిరినెత్తడం గోపాలకృష్ణుడి లీల. ఆయన అవలీలగా ప్రదర్శించిన లీలలన్నీ విని మురిసిపోవడానికి కాదు! మురళీ గానంతో రేపల్లెను మురిపించినా.. గీతోపదేశంతో అర్జునుణ్ని కార్యోన్ముఖుణ్ని చేసినా.. తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రదర్శించాడు. ధర్మ పరిరక్షణ, ప్రజల జీవిత ప్రయోజనాలు ఆకాంక్షించి అనుగ్రహించినవే! పాలకులకు, అధికారులకు ఆయనచూపిన లీలలు పాఠాలే!!
ప్రతివ్యక్తికీ బతకడం ఒక అవసరం. జీవించడం ఒక కళ. అందులో అంతర్గత ప్రజ్ఞ, చైతన్యం జాగృతమవుతాయి. జాగృత చైతన్యం ఆనందానుభూతిని ఇస్తుంది. భారతీయ సాహిత్యం వ్యక్తి భౌతిక, ఆధ్యాత్మిక పార్శ్వాలలో విజయం సాధించేందుకు అవసరమైన ప్రేరణనిస్తుంది. కాలం ఏదైనా వ్యక్తి ఇష్టాయిష్టాలు, జీవిత ప్రయోజనాల మధ్య ఎన్నుకోవలసిన అవసరం వచ్చినప్పుడు.. జీవిత ప్రయోజనాలనే ఆదరించాలి. ముఖ్యంగా సమాజాన్ని నడిపే పాలకులు తమ స్వార్థం కన్నా ప్రజాప్రయోజనాలకే పెద్దపీట వేయాల్సి వస్తుంది.
ప్రాకృతిక కార్య నిర్వహణే లక్ష్యంగా భూమిపై అవతరించిన ఉదాత్త చరితులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. రామాయణ కాలం నాటికి మానవ నాగరికత అప్పుడప్పుడే విస్తరిస్తున్నది. దార్శనికులైన మహర్షులు ప్రజా జీవితం ప్రశాంతంగా నడిచేందుకు, సమగ్రమైన, ఆచరణాత్మకమైన మానవ ధార్మిక చట్టాన్ని నిర్వచిస్తున్న కాలమది. మానవ విలువలు, వృత్తి ధర్మనియమాలు, నైతికత తమ జీవనగతిలో అంతర్భాగంగా జీవించిన కాలమది. ఆ సమయంలో శ్రీరాముడు అవతరించి అనుక్షణమూ ధర్మాన్ని తాను అనుసరిస్తూ ప్రజలకు మార్గదర్శనం చేశాడు. బాధలు తాను అనుభవించాడు… పాలకునిగా రాముడి కర్తవ్యమది. అందుకే తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో పాటుపడ్డాడు, ప్రజావాణికి విలువ ఇచ్చాడు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలిపాడు. తనకన్నా, తనవారికన్నా ప్రజాప్రయోజనాలే ముఖ్యమని భావించిన నాయకుడిగా రాముడు నిలిచాడు.
కృష్ణుడి కాలం వరకు నాగరికత పూర్తిగా విస్తరించింది. పాలకులలో స్వార్థం పడగవిప్పింది. ప్రజాప్రయోజనాల కన్నా తమ ఇష్టాయిష్టాలే ప్రధానమయ్యాయి. ఆ సమయంలో కృష్ణుడు అవసరమైన ప్రతిచోటా ధర్మాన్ని అతిక్రమించి ధర్మరక్షణ చేశాడు. ఇక్కడా ప్రజా ప్రయోజనాలను కాపాడటమే ప్రాధాన్యత అంశం. రాముడైనా, కృష్ణుడైనా తామెన్ని కష్టనష్టాలు అనుభవించినా ధర్మస్థాపన లక్ష్యంగా ఉద్యమించారు… నాయకులయ్యారు. శిక్షించాల్సినవారిని శిక్షించారు, కాపాడవలసిన వారిని కాపాడారు. సమాజంలో పరివర్తన తెచ్చారు. వారి విద్యుక్తధర్మ నిర్వహణలో, కర్తవ్య నిష్ఠలో వ్యక్తిగత భావోద్వేగాలకు చోటివ్వలేదు. వారి అలసట ఎరుగని కార్యదీక్ష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సహచరులను సమర్థంగా నడిపించే నైపుణ్యం, ఉత్సాహం, సాధించగలమనే వారి నమ్మకం, జీవన విలువలు వారిని ఉత్తమ నాయకులుగా నిలిపాయి.
యోగీశ్వరుడు, ద్రష్ట అయిన శ్రీకృష్ణుడు సర్వవ్యాపకత్వాన్ని సాధించి బ్రహ్మతత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఈ ప్రపంచానికి ఈనాటి వరకూ వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో కృష్ణుడు ప్రవచించిన భగవద్గీతను మించిన గ్రంథంగాని, ఆయన్ను మించిన శిక్షకులుగాని లేరంటారు. కారాగృహంలో జన్మించాడు. పుట్టగానే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. పుట్టిన నాటి నుంచీ తనను చంపేందుకు కుట్రలు జరిగాయి. బాలారిష్టాలతో బాల్యం గతించినా ఏనాడూ బాధపడలేదు. గతాన్ని తవ్వుకుంటూ వర్తమానాన్ని నరకప్రాయం చేసుకోలేదు. తన జీవితం ఇలా అయిందని ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. తన ప్రాధాన్యాలను నిర్వచించుకున్నాడు. ఏది ధర్మం.. ఏది ఆచరణీయం.. గుర్తించాడు. ఆ మార్గంలో గమించాడు. ప్రతి అవరోధం.. పురోగతికి మార్గమని ఆచరణలో నిరూపించి నాయకుడిగా, యుగకర్తగా నిలిచాడు.. నాయకులను తయారుచేశాడు.
ఐశ్వర్యం, కోరిక, గొప్పదనం, శక్తి, ప్రయత్నం, జ్ఞానం, యశస్సు ఎవరిలో ఉంటాయో వారిని భగవంతుడు అంటారు. అలాంటి ఉత్తమ లక్షణాలను సాధించి, భగవంతుడిగా, ద్వాదశాత్ముడిగా కీర్తిగడించిన మహిమోన్నత నాయకుడు శ్రీకృష్ణుడు. మిత్ర ధర్మాన్ని పాటించడం నాయకుడి లక్షణం. చిన్నప్పటి మైత్రిని పురస్కరించుకొని వచ్చిన కుచేలుని ఆదరించి, అడగకుండానే అవసరానికి మించి సంపదనిచ్చి ఆదర్శమైత్రిని పాటించాడు. తనకు విద్య నేర్పిన సాందీప మహర్షి మరణించిన పుత్రుడిని పునర్జీవితుని చేసి గురుదక్షిణగా సమర్పించడం శ్రీకృష్ణుడి మానవాతీత శక్తికి తార్కాణం. నాయకుడైన వాడు తనను ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించాలి. కృష్ణుడు పాండవులను, ద్రౌపదిని వాళ్లు తనను ‘స్మరించిన’ అన్ని కాలాల్లోనూ రక్షించాడు. అలాగే సామాజిక ప్రయోజనాలు లక్ష్యంగా, ధర్మాన్ని గెలిపించడం ముఖ్యమని కురుక్షేత్రంలో కౌరవుల బాణాలకు తాను ఎదురునిలిచి ధర్మాన్ని రక్షించాడు. కృష్ణుడి దార్శనికతకు ఉదాహరణగా సైంధవుడి వధనాటి ఘట్టాన్ని చెప్పుకోవచ్చు. తానే యుద్ధ బాధ్యతను పూర్తిగా భుజానికి ఎత్తుకున్నా, ఫలితాన్ని పాండవులకే కట్టబెట్టడం నల్లనయ్య నాయకత్వ లక్షణానికి ప్రతీక.
ఇక మహాభారతంలో కృష్ణరాయబారం ఉదాత్తఘట్టం. అందులో కృష్ణుడు వ్యవహరించిన విధానం ఈనాటి కార్పొరేట్ నాయకులకు మార్గదర్శనం చేస్తుంది. ఎదుటివారి దృష్టి కోణం నుంచి ఆలోచించి ప్రియంగా, సూటిగా, ఎదుటివారి హావభావాలను అవగాహన చేసుకుంటూ తదనుగుణంగా మాట్లాడటం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం, తాను చెప్పే విషయాన్ని అనుసరిస్తే ఎదుటివారికి వచ్చే ఫలితం ఏమిటో స్పష్టంగా చెప్పడం, తాను చెప్పిన విషయానికి పూర్తి బాధ్యత వహించడం, ఆత్మ విశ్వాసంతో, పలుకులో స్థాయీభేదాన్ని పాటిస్తూ మాట్లాడటం, శారీరక భాషను ప్రదర్శించడం… ఇవన్నీ మనకు రాయబార ఘట్టంలో కనిపిస్తాయి.
…? పాలకుర్తి రామమూర్తి