శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే॥
‘అర్జునా! లోక కల్యాణం కోసం సర్వసమర్పణ భావనతో ఆచరించేది ‘యజ్ఞం’. ద్రవ్యయజ్ఞాలని, జ్ఞానయజ్ఞాలని రెండు విధాలుగా చెప్పిన యజ్ఞాలలో ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం ఉత్తమమైనది. కర్మలన్నీ జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి’ అంటాడు కృష్ణుడు. కఠోపనిషత్తు మనముందు ‘ప్రేయో మార్గం, శ్రేయో మార్గం’ అని రెండు మార్గాలను ఉంచింది. భౌతిక జగత్తులో సంపదలను పొంది విలాసవంతమైన జీవితాన్ని గడపడం ప్రేయోమార్గం. జీవన పరమార్థాన్ని తెలుసుకొని, సంతృప్తితో కూడిన విజయసాధనతో అర్థవంతం, ఫలవంతం, ఉత్తమమైన జీవితాన్ని గడపడం శ్రేయోమార్గం. మానవులకు ద్రవ్యయజ్ఞాలు ప్రేయస్సునిస్తే, జ్ఞానయజ్ఞాలు శ్రేయస్సునిస్తాయి. శ్రేయస్సులో ప్రేయస్సు కూడా అంతర్లీనంగా ఉంటుంది. అందుకే ఆరంభంలోనే ‘శ్రేయాన్’ అంటూ ఆరంభించాడు పరమాత్మ.
సనాతన ధర్మం భౌతిక సంపదను అమితంగా సృష్టించమని, దానిని అర్హత ప్రాతిపదికగా సద్వినియోగం చేయమని చెబుతుంది. సంపదలను సమాజానికి వినియోగించడం, హోమాదులు నిర్వహించడం ద్రవ్యయజ్ఞంగా పేర్కొంటారు. హోమాదుల నిర్వహణలో ‘కామన’ ఉంటుంది. అలాగే త్యాగంలో ‘నేను’ చేస్తున్నాననే భావన ఉంటుంది. సాధారణంగా ‘నీది.. నాది’ అనే భేదభావన భౌతిక వస్తువులను ఆశ్రయించి ఉంటుంది. అవే అహంకార మమకారాలకు మూలద్రవ్యాలు. ఎప్పుడైతే సమాజం నుంచి పొందిన సంపదను సమాజానికే అర్పించాలనే భావన కలుగుతుందో, అప్పుడు ఆ సంపదలపై వ్యామోహం పోతుంది. పరోపకార బుద్ధి జాగృతమైన వేళ సమభావన వికసిస్తుంది. దానితో అభ్యుదయంతో కూడిన ప్రశాంతత మనసులో నిలుస్తుంది. అదే భౌతిక విజయానికి సోపానమవుతుంది.
ద్రవ్యయజ్ఞం వల్ల స్వర్గభోగాలు లభిస్తాయి. ఆర్జించిన సంపదలు తరిగిపోయినట్లుగానే, ‘నేను’ చేస్తున్నాననే భావనతో చేసే ద్రవ్యయజ్ఞ గత భోగాలూ కాలక్రమేణా తరిగిపోతాయి. అయితే.. కర్తృత్వభావనకు దూరంగా ‘పనిని ప్రేమిస్తూ, ఉపాసనాభావన’తో చేసే కర్మల ఫలితం మాత్రం అహంకార మమకారాలను దరిచేరనీయదు. ఆ స్థాయిని పొందేందుకు ఉపకరించేదే జ్ఞానయజ్ఞం. నిజానికి.. ద్రవ్యయజ్ఞం లేనిదే జ్ఞానయజ్ఞం ఉండదు. కాకపోతే.. ద్రవ్యయజ్ఞంతో ఆగక జ్ఞానయజ్ఞాన్ని ఆచరించే వారికే శ్రేయస్సు కలుగుతుంది.
విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అది ఉత్తమమే కాని దానిని ఆచరణయోగ్యంగా మలచుకోవడం విజ్ఞానం అవుతుంది (విశేషతో జ్ఞానం విజ్ఞానం). విజ్ఞానం వల్ల ప్రయోజనం ఉంటుంది. చేసే ప్రతికర్మా ఫలితాన్ని ఇస్తుంది. అది సమాజహితమైనదా కాదా అనేదానిపై ఆ పని మంచిదా చెడ్డదా అనేది ఆధారపడి ఉంటుంది. చెడుపనుల వల్ల చెడు అనుభవాలు, మంచిపనుల వల్ల మంచి అనుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలే జ్ఞానాలుగా చెప్పుకొంటాం. ఆయా అనుభవాలు ప్రాతిపదికగా.. ఏది ఆచరణీయమో గుర్తెరిగి, కర్మఫల త్యాగంతో చేసే కర్మలు పరిణతినిస్తాయి. ఆ పరిణతి కాలక్రమేణా అభ్యాసమై… నిష్కామకర్మలకు మార్గం చూపుతుంది. నిష్కామకర్మలే యోగంగా మారి శ్రేయస్సునిస్తాయి. జీవితాన్ని భోగమయంగా కాక సాధనాపర్వంగా చేసుకోవడం వల్ల జీవన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ ప్రయాణంలో ఇష్టాయిష్టాలు ప్రలోభపెడతాయి. వాటిని అధిగమించి.. ద్రవ్యయజ్ఞం నుంచి జ్ఞానయజ్ఞం వైపు నడవడం మానవులకు కర్తవ్యం కావాలి. కర్మఫలాన్ని కోరకుండా సత్కర్మలను యజ్ఞాలుగా ఆచరించడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది.