తిరుపతి : తిరుపతి(Tirupati) లోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం, అనంతరం పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం , రాత్రి ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని నిన్న 76,381 మంది భక్తులు దర్శించుకోగా 33,509 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.