మండుటెండలు, తొలకరి జల్లులు కలగలసిన మాసం జ్యేష్ఠం. పేరులో పెద్ద(జ్యేష్ఠ) కలిగిన మాసమిది. ఈ నెలలో బ్రహ్మదేవుని అర్చిస్తే శీఘ్రంగా సత్ఫలితాలు పొందవచ్చని చెబుతారు. గ్రీష్మతాపం హెచ్చుగా ఉండే నెల ఇది. ఈ కాలంలో మనుషులు, జీవజాలమంతా దాహార్తితో అలమటిస్తుంటుంది. అందుకే జ్యేష్ఠంలో జలదానాన్ని విశేషంగా చేయమని నిర్దేశించారు మన పూర్వికులు. విధిగా చలివేంద్రాలు నెలకొల్పడం, పశుపక్ష్యాదుల కోసం నీటి తొట్టెలు, ముంతలు ఏర్పాటు చేయమని సూచించారు. నీటి విలువ అనుభవ పూర్వకంగా తెలియడం కోసమే ఈ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ‘నిర్జల ఏకాదశి’గా జరుపుకొంటారు. నిర్జల ఏకాదశి నాడు మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవసిస్తారు. జ్యేష్ఠ మాసం మొదటి పదిరోజులు దీక్షగా నదీ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. శుక్ల దశమిని ‘దశపాపహర దశమి’ అంటారు. ఈ రోజు నదీస్నానం చేస్తే దశవిధ పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలు దక్కించుకున్న సతీసావిత్రిని ఆదర్శంగా తీసుకొని సౌభాగ్యం కోసం సుమంగళులు గౌరీదేవిని అర్చిస్తారు. అదేరోజు రైతులు ఎంతో ప్రియమైన ‘ఏరువాక పౌర్ణమి’ చేసుకుంటారు. ఈ సందర్భంగా రైతులు సాగులో సాయం చేసే ఎడ్లను, నాగలి, కొర్రు వంటి వ్యవసాయ ఉపకరణాలను అలంకరించి వర్షాలకు స్వాగతం పలుకుతారు.