Jagannath Rath Yatra | ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర విశేష వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథినాడు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను లాగేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ రథయాత్రలో అనేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తుంటారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది బంగారు చీపురుతో మార్గ శుభ్రపరిచే ఆచారం. ఇది యాత్రకు ముందు జరుగుతుంది. బంగారు చీపురుతో చీపురుతో మార్గాన్ని శుభ్రం చేసే హక్కు పూరీ రాజవంశ వారసులకు మాత్రమే ఉంది. ప్రత్యేకంగా తయారు చేసిన చీపిరితో రాజు శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ప్రక్రియను ‘చెహ్రా పహరా’ (Chhera Panhara) అని పిలుస్తుంటారు. బంగారం హిందూ మతంలో పవిత్రతకు, శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. జగన్నాథుడి రథయాత్ర సాగే మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేయడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్తపరుస్తారు. రథయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకునే సంకేతంగా భావిస్తారు.
అనంతరం వేద మంత్రాల జపంతో యాత్ర ప్రారంభమవుతుంది. రాజవంశ వారసులు స్వయంగా రథ మార్గాన్ని శుభ్రం చేయడం వెనుక సందేశం ఉన్నది. దేవుడి ముందు అందరూ సమానమే అనే భావనకు ప్రతీకగా నిలుస్తుంది. భగవంతుడిని స్వాగతించడానికి మార్గాన్ని స్వచ్ఛంగా తయారు చేయడం భక్తి, వినయం, అంకితభావానికి సంకేతంగా భావిస్తారు. ఈ ప్రక్రియ వల్ల యాత్ర మార్గం శుభ్రంగా మాత్రమే కాక, ఆ ప్రాంతంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. బంగారం అదృష్టానికి, శ్రేయస్సుకి చిహ్నం కావడంతో.. దీనివల్ల వాతావరణంలో పవిత్రత నెలకొంటుంది. ఈ సంప్రదాయం జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. భారతదేశం సహా విదేశాల నుంచి భక్తులు జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు తరలివస్తుంటారు. ఇది కేవలం మతపరమైన కార్యక్రమంగా కాకుండా.. భారత సాంస్కృతిక వైభవానికి అద్దం పడే ఘట్టంగా నిలుస్తోంది. నేడు జరిగే రథయాత్ర కోసం యావత్ భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. యాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.