తిరుమల : ప్రముఖ ఆధాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావుపై (Chaganti Koteswara Rao) సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను టీటీడీ (TTD) ఖండించింది. వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రతి ఏడాది జనవరిలో తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకునే చాగంటి ఈ నెల 14న శ్రీవారి దర్శనం,16వ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ ప్రొసిడింగ్స్ ఇచ్చింది. కేబినేట్ ర్యాంక్ (Cabinet Rank) ప్రోటోకాల్ ఉన్న చాగంటికి ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులోభాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి చాగంటిని తీసుకెళ్లేందుకు బగ్గీసును, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసిందని టీటీడీ అధికారులు వివరించారు.
అయితే తాను సామాన్య భక్తుడిలానే వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటానని అధికారులకు వివరించి అదేవిధంగా స్వామివారిని దర్శించుకున్నారు. జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో ప్రవచన కార్యక్రమాన్ని చాగంటి అనుమతితో మరొక తేదీకి వాయిదా వేశామని తెలిపారు.
వాస్తవాలు ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చాగంటి ప్రవచనాలను చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల టీటీడీ రద్దు చేసిందని తప్పుడు ప్రచారాలు చేసింది. అవాస్తవ ప్రచారాలను టీటీడీ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.