వృద్ధులంటే జీవిత సారాన్ని గ్రహించిన అనుభవజ్ఞులు. ముదిమి వయసులో కొన్ని పనులు చేసుకోలేరు. అందుకు వారు సంతానంపై, ఇతరులపై ఆధారపడతారు. వారిని గౌరవించి, సేవలు చేయడం మన విధి. వృద్ధుల విశిష్టతను, వారితో ఎలా ప్రవర్తించాలనే విషయాలను ఖురాన్ స్పష్టంగా వివరించింది. ‘మీ ముందు వారిద్దరి (తల్లిదండ్రులు)లో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని అస్సలు విసుక్కోవద్దు. వారితో గౌరవంగా మాట్లాడాలి. దయార్ద్ర హృదయంతో, వినయంతో వారిముందు తలవంచి ఉండండి’ అని ఖురాన్ బోధ. ‘ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచి పోషించారో అలా నీవు వారిని కరుణించు’ అని ప్రార్థించాలని ఖురాన్ సూచించింది.
అల్లామా షబ్బీర్ అహ్మద్ ఉస్మాని (రహ్మ)పై వాక్యాలకు వివరణ చెబుతూ.. ‘వృద్ధులకు సంతానంతో సేవలు చేయించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కొన్నివేళల్లో అయినవారు కూడా వృద్ధులను విసుక్కుంటారు. వృద్ధాప్యంలో బుద్ధి వివేకాలు పని చెయ్యవు. ఇలాంటి సందర్భంలో గొప్ప సౌభాగ్యవంతులైన బిడ్డలు వృద్ధులైన తమ తల్లిదండ్రులకు సేవ చేయడంలో ఎలాంటి అలసత్వానికి, సోమరితనానికి, ఏమరుపాటుకి చోటివ్వకూడదు. వారికి సేవ చేయకుండా ఉండటానికి సాకులు వెతకకూడదు. సముద్ర కెరటాల్లా ఎగసిపడే మీ ఆలోచనలతో ఎగిరెగిరి అలసిపోయిన వారి ఆలోచనలు సర్దుబాటు కాలేకపోవచ్చు. అయినా మీరు వారిని ‘ఉఫ్ఁ’ విసుక్కోవడానికి కూడా వీల్లేదని ఖురాన్ హెచ్చరించింద’ని పేర్కొన్నారు.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076