ఓ పారిశ్రామికవేత్త ఒకానొకసారి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. మానసిక ప్రశాంతత కోరి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ గురువును కలిసి తనకు ఆనందంగా ఉండాలని ఉందని చెప్పాడు. ఎన్నో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు తిరిగినా తాను కోరుకున్న ఉపశమనం లభించలేదని బాధగా అన్నాడు. అప్పుడు గురువు ‘నీకో కథ చెబుతాను.. విను’ అంటూ ఇలా చెప్పాడు. ‘ఒకరోజు సముద్రంలోని చేపలు సమావేశమయ్యాయి. ‘మనలో ఎవరైనా సముద్రాన్ని చూశాయా?’ అనే చర్చను మొదలుబెట్టాయి. అక్కడ చేరిన చేపలేవీ ‘సముద్రాన్ని చూశాం!’ అని చెప్పలేకపోయాయి. ‘అయ్యో… ఇంత బతుకు బతికి సముద్రాన్ని చూడలేకపోయామే…’ అని బాధపడటం ప్రారంభించాయి. ఇంతలో ఒక చేప మా ముత్తాత సముద్రాన్ని చూశాడని మా అవ్వ చెప్పేది అన్నది. అప్పుడు రెండో చేప నిజమే, వాళ్ల ముత్తాత సముద్రాన్ని చూసినట్లు నేను కూడా విన్నాను అని సమర్థించింది. మూడో చేప ఇది ముమ్మాటికీ వాస్తవం. ఎందుకంటే మా బంధువులు కూడా ఆ విషయాన్ని చెప్పుకొంటూ ఉండగా విన్నాను అన్నది.
అప్పుడు చేపలన్నీ ఫర్వాలేదు.. సముద్రాన్ని చూసిన వాళ్ల తాలూకు వారు మన సమూహంలో ఉన్నారని గర్వించాయి. మొదటి చేపను ఎత్తుకుని ఊరేగించాయి. చివరిగా అన్ని చేపలూ చేరి ఆ చేప ముత్తాత బొమ్మ చేసి పూజలు ప్రారంభించాయి’ అని చెప్పాడు. ఈ కథ వినగానే ఆ పారిశ్రామికవేత్త.. ‘అదేమిటి? ఆ చేపలు ఉన్నది సముద్రంలోనే కదా! సముద్రంలోని చేప, సముద్రం కోసం వెదకడమేమిటి? ఆ చేపలు అంత మాత్రం గుర్తించలేకపోయాయా?’ అని ఆశ్చర్యపోతూ గురువును ప్రశ్నించాడు. గురువు మళ్లీ నవ్వి ‘మనల్ని ప్రకృతి సృష్టించిందే ఆనందకరమైన జీవితాన్ని గడపమని. మనమే ఏదేదో ఆలోచించి ఆనందానికి దూరమైపోతున్నాం. ఆనందమనేది ఎక్కడో ఉండదు, ఏ వస్తువులోనూ దొరకదు. ఏ ప్రదేశంలోనూ చిక్కదు. అది మనలో నుంచే రావాలి. ఎందుకంటే మనం ఆనంద స్వరూపులం కాబట్టి! ‘నాది’ అని… దేన్నీ గట్టిగా పట్టుకోకుండా భూత భవిష్యత్తు కాలాల్ని విడిచి పెట్టి వర్తమానంలో ఉంటే ఆ ఆనందం అనేది మనలోనే దొరుకుతుంది. దానికోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎవరినీ అడగాల్సిన అవసరమూ లేదు’ అని వివరించాడు. ఆనంద రహస్యం తెలుసుకున్న ఆ పారిశ్రామికవేత్త.. గురువుకు నమస్కరించి తృప్తిగా ఆశ్రమం నుంచి కదిలాడు.