e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home చింతన Importance of Navarathri | యాదేవీ నవ రూపేషు..

Importance of Navarathri | యాదేవీ నవ రూపేషు..

మనిషి తనను తాను చేరుకోవడానికి, తన మూలానికి తిరిగి వెళ్లడానికి అనువైన సమయం నవరాత్రి పర్వదినాలు. ఏటా ఈ సమయంలో సాధకులు ఉపవాసం, మౌనం, ధ్యానం, ప్రార్థనలు పాటిస్తారు. స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు స్థాయిల్లోనూ ఈ సమయం మనకు విశ్రాంతినిస్తుంది. శరీరంలోని మలినాలు, విషాలు ఉపవాసం వల్ల తొలగిపోతాయి. మౌనం వాక్కును శుద్ధి చేసి, నిరంతరాయంగా మాట్లాడుతూ ఉండే మనసుకు విశ్రాంతినిస్తుంది. ధ్యానం మనిషిని తనలోని ప్రగాఢమైన, స్వస్థలానికి తీసుకుపోతుంది. ఈ నవరాత్రి సమయంలో దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో ఆరాధించడం మనం చూస్తాం. ప్రతీ రూపంలో, ప్రతీ నామంలోనూ ఉన్న దివ్యత్వాన్ని గుర్తించడమే నవరాత్రి ప్రాధాన్యత.

శైలపుత్రి : శైల అంటే (పర్వత) శిఖరం. శైలపుత్రి అంటే పర్వతరాజు అయిన హిమవంతుడికి జన్మించిన పుత్రిక (పార్వతి) అని మనకు తెలుసు. అయితే ఇది స్థూలమైన అర్థం మాత్రమే. యోగ పరిభాషలో చైతన్యానికి అత్యున్నత స్థాయి. శక్తి, అత్యున్నతంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని గుర్తించగలం. అప్పుడు మాత్రమే స్వచ్ఛమైన చైతన్యాన్ని, దేవీ స్వరూపాన్ని అనుభూతి చెందగలం. ఇక్కడ శిఖరం అంటే తీవ్రమైన అనుభూతి అని అర్థం చేసుకోవాలి. ఏ అనుభూతి అయినా సరే, నూరుశాతం కలిగి ఉన్నప్పుడు.. అది సంపూర్ణంగా లీనమవుతుంది. అప్పుడు దుర్గాదేవి నిజంగా జన్మిస్తుంది.

- Advertisement -

బ్రహ్మచారిణి : అత్యంత స్వచ్ఛమైన, ఏ మరకలూ అంటని చైతన్యం బ్రహ్మచారిణి. ఇది కన్యా రూపం. బ్రహ్మాండం అంతటా, సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్న దివ్యశక్తి స్వరూపం ఈమె. పరబ్రహ్మంలో ఉంటూ.. మనలను
ఆవైపుగా నడిపిస్తుంది.

చంద్రఘంట: ఈ స్వరూపంలో ఆమె చంద్రుని, గంటను ధరించి కనిపిస్తుంది. కోటి చంద్రుల సౌందర్యం ఆమె చైతన్యంలో ఇమిడి ఉంటుంది. మనలోని చైతన్యాన్ని తట్టిలేపే సౌందర్య అధిదేవత చంద్రఘంట. గంట మోగినప్పుడు ఆ శబ్దం అంతటా నిండిపోతుంది. మన ఆలోచనలు, ఆందోళనలన్నీ ఆ శబ్దంలో కరిగిపోతాయి. ఒక పరమానందభరిత స్థితికి చేరుకుంటారు.

కూష్మాండ: శక్తిని ఒక గుండ్రని బంతిలా ఊహించగలిగితే అదే ఈ రూపం. కూష్మాండం అంటే గుమ్మడికాయ. కాయగూరలన్నిటిలో గుమ్మడికాయలో ప్రాణశక్తి అత్యధికంగా ఉండటం వల్ల, శక్తి ఈ రూపం గ్రహించిందని చెబుతారు.

స్కందమాత: స్కందుడు (కుమారస్వామి) దేవ సైన్యాధ్యక్షుడు. అటువంటి కుమారుణ్ని కన్నందుకు తల్లికి కలిగే ఆనందాన్ని, గర్వాన్ని సూచించే స్వరూపం ఇది. సైనికుడి తల్లికి ఉండే గర్వం (ఇతర తల్లుల కంటే) చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తన కుమారుడు ప్రపంచాన్ని కాపాడతాడని ఆమెకు తెలుసు. కాబట్టి ప్రేమ, విశ్వాసాలతో కూడిన గర్వం స్కందమాత గుణం.

కాత్యాయని: అనగనగా ఒక రుషి. ఆయనకు ఏ కోరికలు లేవు. అయితే ఒకనాడు ఆయన దుర్గాదేవిని ఉపాసిస్తూ ఉండగా ఆమె ప్రత్యక్షమై, ‘నీకేం కావాల’ని అడిగింది. అప్పుడు ఆ రుషి ‘నీవు నాకు కుమార్తెగా జన్మించి, నా వంశ నామాన్ని ధరించాలి’ అని కోరుకున్నాడు. అలా ఆ రుషి వంశనామంతో జన్మించిందే కాత్యాయనీ. కోరికలన్నీ తీర్చే శక్తి స్వరూపం ఆమె. అనంత చైతన్యం అమ్మ తత్వం.

కాళరాత్రి: పరాశక్తి భయంకరమైన స్వరూపం కాళరాత్రి. రాత్రిని, గాఢమైన శక్తిని ఇది సూచిస్తుంది. రాత్రిని దుర్గాదేవి అంశగా సూచిస్తారు. ఎందుకంటే రాత్రి మనకు విశ్రాంతిని, సౌఖ్యాన్ని కలిగించడమే కాక, అంతటా వ్యాపించిన అనంతమైన శక్తిని రేఖామాత్రంగా అనుభవంలోకి తెస్తుంది.

మహాగౌరి: సుందరమైన, పవిత్రమైన దుర్గా స్వరూపం ఇది. మహాగౌరి మనకు చలనశీలతను, జీవితంలో స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.

సిద్ధిధాత్రి: పూర్ణత్వాన్ని, కచ్చితత్వాన్ని ప్రసాదించే స్వరూపం సిద్ధిధాత్రి. పూర్ణత్వాన్ని సాధించాం అనే భావన మన అహంకారాన్ని దృఢపరుస్తుంది. అంటే మన పరిధిని కుదించివేస్తుంది. మనలో లేని పూర్ణత్వాన్ని ఆ దివ్యమాత ప్రసాదిస్తుందని విశ్వసించాలి. అప్పుడు మనలోని వెలితి తొలగిపోతుంది. జీవితంలో వేటినైనా స్వయంశక్తి చేతనే సాధించుకున్నట్లు అనిపించినప్పుడు.. అవన్నీ ఆ దివ్యమాత బహుమతిగా ప్రసాదించిందని గుర్తించాలి. ఆ మరుక్షణమే పరమాత్మ స్వచ్ఛమైన స్వభావంతో కలిసిపోతాం. పూర్ణత్వం అనేది ఏదో చేయడం వల్ల వచ్చేది కాదు. అది దేవీ ప్రసాదం మాత్రమే! అదే
సిద్ధిధాత్రి.

గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement