ఓ భౌతికశాస్త్ర అధ్యాపకుడు స్వామివారి దర్శనానికని తిరుమలకు కాలినడకన బయల్దేరాడు. అలిపిరి మొదటి మెట్టుకు కర్పూర హారతి ఇచ్చి, టెంకాయి కొట్టి నడక ప్రారంభించాడు. దారిలో ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిచయమయ్యాడు. మూడు వందల మెట్లు ఎక్కేసరికి ఆ యువకుడికి కాళ్లనొప్పులు ప్రారంభమయ్యాయి. ‘ఇంకెన్ని మెట్లు ఉన్నాయో…’ అంటూ అస్సుబుస్సుమని గసపోసుకుంటూ చాలా కష్టంగా ఎక్కుతూ ఉన్నాడు. ఆ యువకుడి బాధ చూసి అధ్యాపకుడు చిన్నగా నవ్వుకున్నాడు.
మోకాళ్ల పర్వతం వచ్చేసరికి ఆ యువకుడు బాగా అలసిపోయాడు. ఏడుపు ముఖం పెట్టిన యువకుడు అధ్యాపకుడితో ‘దేవుణ్ని చూడటానికి ఇన్ని కష్టాలు పడాలా?’ అని ప్రశ్నించాడు. అధ్యాపకుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో కుండపోత వాన మొదలైంది. జోరు వర్షాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఆ యువకుడు. ఇద్దరూ గబగబా వెళ్లి ఓ పెద్దచెట్టు కింద నిలబడ్డారు. కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది.
ఆకాశంలో ఇంద్రధనుస్సు వెలిసింది. ఆ యువకుడి కళ్లు మెరిశాయి. దాన్నే చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ‘నీకు ఇంద్రధనుస్సు అంటే అంత ఇష్టమా?’ అని అడిగాడు అధ్యాపకుడు. ‘చాలా ఇష్టం సార్ … ఆకాశంలో అరుదుగా కనిపించే ఆ అందాల హరివిల్లును చూస్తూ ఉంటే నాకు ఆకలి ఉండదు, దాహమూ ఉండదు’ అని బదులిచ్చాడు. యువకుడి ముఖంలోకి చూస్తూ ‘వాన అంటే ఇష్టం లేదా?’ అని అడిగాడు అధ్యాపకుడు.
‘వానంటే నాకు గిట్టదు. వానపడితే నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు యువకుడు. దానికి అధ్యాపకుడు నవ్వుతూ ‘వాన రాకుంటే ఇంద్రధనుస్సు ఆకాశంలోకి ఎలా వస్తుంది. మనకు ఇష్టంలేదని వాన రాకపోతే ఇంద్రధనుస్సు ఆకాశంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగే ఈ కొండ మెట్లు ఎక్కడం కష్టంగా తోస్తే ఆ దేవదేవుడి దర్శనం మనకు ఎలా లభిస్తుంది?’ అని సూటిగా అడిగాడు. ‘నిజమే… ఇంద్రధనుస్సు చూడాలంటే వర్షం తప్పదు.
దైవానుగ్రహం కావాలనుకుంటే కొన్ని కష్టాలకు ఓర్చుకోవాలి’ అని అర్థం చేసుకున్నాడు ఆ యువకుడు. కొండ మెట్లు చకచకా ఎక్కడం ప్రారంభించాడు. ఇద్దరూ స్వామివారి దర్శనం చేసుకుని వెనుదిరిగారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821