Vinayaka Chavithi | అమ్మ చదువు కుటుంబానికి వెలుగు అంటాం. అమ్మ శక్తి మంతురాలైతే కుటుంబమూ బలంగా ఉంటుంది. అలాంటిది వేదవేదాంగాలకూ జనని, సాక్షాత్తూ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత, గణపతికి తల్లిగా లభించింది. ఇంకేం, ఉగ్గుపాలతోనే విజ్ఞానాన్ని రంగరించింది. బుడిబుడి అడుగులూ తడబడ
కుండా వేయడం అలవాటు చేసింది. బాధ్యత అంటే బాల్యంలోనూ నేర్వచ్చని నేరుగా చూపించింది. ఉండాల్సిన లక్షణాలేమిటో, విడవాల్సిన అవలక్షణాలేమిటో విస్పష్టంగా వివరించింది. ఆయనా అంతే కొండ అద్దమందు చూపినా ఆసాంతం అర్థం చేసుకునే కుశాగ్ర బుద్ధి కలవాడు. అచ్చంగా అమ్మలాగే అనిపించే అచ్చెరువొందించే గుణాలను, ప్రమథ గణాలను చేజిక్కించు కున్నవాడు. తొలిపూజలు అందుకునే ఘనమైన దేవుడయ్యాడంటే పార్వతీ నందనుడు ఎన్ని విద్యలు నేర్చి ఉండాలి మరి! చవితి పండుగ నాడు ఆయన కరుణ కలగాలంటే వాటిలో కాసిన్నైనా మనమూ వంటబట్టించుకోవాల్సిందే!
పార్వతీ దేవి మాటంటే మాటే! తండ్రి దగ్గరైనా, భర్త దగ్గరైనా, భక్తుల దగ్గరైనా కూడా. ఆమె అభయం ఇచ్చిందంటే అవతలి వ్యక్తి మరో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. జగదంబ బాధ్యత తీసుకుంటే ఇక బాధ గురించి మరచిపోవచ్చు. అలాంటి అమ్మ ఒంటి నలుగు బొమ్మ గణపతి. ఆమె మనసు ఊపిరి పోసిన రూపం అది. మరి ఆయనెంత ఘనుడవ్వాలి. అందుకే బాధ్యత తీసుకున్నప్పుడు భయపడే ప్రసక్తే లేదు ఈ పార్వతి తనయుడి దగ్గర. ‘నేను స్నానం చేసి వచ్చేదాకా లోపలికి ఎవర్నీ రానివ్వకు’ చెప్పింది తల్లి. ‘అలాగే అమ్మ! ఆ బాధ్యత నాది!’ మాటిచ్చాడాయన. అంతే, తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. అవతలి వ్యక్తి ఎవరన్నది ఆయనకు అనవసరం. తొట్ట తొలి పనిలోనే అతి పెద్ద సవాలు ఎదుర్కొన్నాడాయన. ముద్దులొలికే ఈ బాల రూపం ముందు నిలబడ్డది లయకారుడైన మహాశివుడు. చేతిలో శూలం, నడుముకు పులి చర్మం, మెడలో విషనాగులు, ఒంటి నిండా విభూతి… తీక్షణమైన చూపులతో కనిపించే అంతెత్తు విగ్రహం ఆయన. అయితేనేం లోనికి వెళ్లకూడదు అంటే వెళ్లకూడదు అంటూ చెక్కు చెదరని ఆత్మబలంతో నిలబడ్డాడు బాల వినాయకుడు. సాక్షాత్తూ పరమశివుడి శూలం దూసుకొస్తున్నా అదే ైస్థెర్యం. మనం చూసే, గజాననుడి రూపమే ఆయన నిబద్ధతకునిలువెత్తు నిదర్శనం.
పని అంటే అంత పట్టుదలగల వాడు కాబట్టే వ్యాసుడు మహాభారత రచనకు గణపయ్యనే ఎన్నుకున్నాడు. ఆయన మాత్రమే ఆ క్రతువు నిర్వహించగలడన్న మహర్షి నమ్మకాన్ని ఉమాసుతుడు వమ్ము చేయలేదు. ఆగకుండా రచన చేయాలన్న ఒప్పందం కోసం ఏకంగా తన దంతాన్నే పెకిలించి మహాభారతమనే మహత్తర గ్రంథాన్ని మానవాళికి అందించాడాయన. అందుకే పనులు మొదలు పెట్టేటప్పుడు ‘తలచితినే గణనాథుని… తలచినే విఘ్నపతిని’ అంటూ ప్రార్థిస్తాం. నిజంగానే ఆయన పట్టుదల, నిబద్ధతలో పావు వంతు మనం ఆకళింపు చేసుకోగలిగినా తిరుగులేని జీవులుగా వర్థిల్లుతాం.
‘జగముల చిరునగవుల పరిపాలించే జననీ… అనయము మము కనికరమున కాపాడే జననీ…’ అని అమ్మను స్తుతిస్తారు భక్తులు. సదా మందస్మిత వదనగా అలరారుతుందామె. కానీ జగన్మాత కూడా అనేక గడ్డు సందర్భాలను ఎదుర్కొంది. చెప్పలేనన్ని ఒడుదొడుకులను చూసింది. ఇందులో ఏ ఒక్కసారీ తల్లి కరుణను విడలేదు. అమ్మ నుంచి ఆ పోలికను అచ్చంగా పుణికి పుచ్చుకున్నాడు గణపతి. విఘ్నాలను బాపే కష్టసాధ్యమైన పనిని తలకెత్తుకున్నా సరే… ప్రశాంత రూపుడిగానే దర్శనమిస్తాడు. శ్రమనంతా బొజ్జలో దాచుకుని బుజ్జి గణపతిగా మనముందు కనిపిస్తాడు. అందుకే ఆయన్ను ‘ప్రసన్న వదనం ధ్యాయేత్…సర్వ విఘ్నోపశాంతయే!’ అంటూ నమస్కరిస్తాం. నిజానికి చిరునవ్వు సడలనివ్వకపోవడం అన్నది ఒక బలమైన లక్షణం. గణపతి నుంచి దాన్ని మనమూ అలవర్చుకుంటే ఎంతటి కష్టాన్నైనా నిబ్బరంగా ఎదుర్కొనగలిగే శక్తిని సంపాదించుకుంటాం.
గిరితనయకు తన తనయుడంటే వల్లమాలిన ప్రేమ. ముద్దులొలికే ఆ చిన్నారిని గారం చేసి లాలిస్తూ ఉండేది. ఆహారం విషయంలోనూ ఆమె అమిత అనురాగాన్ని ప్రదర్శించేది. చిన్ని గణపతి కూడా ఆమె పెట్టేవన్నీ ప్రేమగా తినేవాడు. దానికి తోడు ఆయనకు బోలెడు మంది భక్తులు. ఓ పుట్టిన రోజు నాడు వీళ్లంతా కొసరి కొసరి వడ్డించిన భక్ష్య భోజ్యాలను బొజ్జ నిండా తిన్నాడు బుజ్జి గణపయ్య. అలా సాయంత్రమయ్యే సరికి, కాస్త ఉబ్బరంగా ఉండటంతో ఉదరాన్ని రుద్దుకుంటూ నడవడం ప్రారంభించాడట. ఆ పెద్ద బొజ్జను చూసే సరికి చంద్రుడికి ఫక్కున నవ్వు వచ్చిందట. ఆ నవ్వు ప్రభావంతో దృష్టి తగిలి, వినాయకుడి పొట్ట పగిలిపోయిందట. దీంతో జగన్మాత ఆక్రోశించింది. నా బిడ్డ రూపాన్ని చూసి నవ్వుతావా… అందంతో వెలిగిపోతున్నావనుకునే నిన్ను చూసిన ఎవరైనా నీలాపనిందల పాలు అవుగాక… అంటూ శపించింది. దీంతో చంద్రుడు అమ్మను శరణు వేడాడు. శాపానికి ఉపశమనాన్ని ఇమ్మని కోరాడు. ఒక్క వినాయక చవితి నాడు తప్ప మిగతా రోజులకు ఆమె మినహాయింపునిచ్చింది. వినాయకుడి కథాక్షతలు వేసుకున్న వారికి ఆరోజూ ఏ ఆపదా రాదని చెప్పింది. దీంతో చంద్రుడితో పాటు లోకమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ ఒక్క సందర్భం చాలు ఎవరైనా వ్యక్తి రూపాన్ని చూసి వెక్కిరించకూడదనీ, అలా చేస్తే ఎంతటి వారైనా జీవితంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనీ అర్థం చేసుకోవడానికి. గణపతి అమ్మ నుంచి అదే తెలుసుకున్నాడు. అంతేకాదు, ఎంత కోపమొచ్చినా సత్వరమే శాంతపడి ఎదుటి వాళ్లను కరుణించే గుణమూ ఉండాలని అర్థం చేసుకున్నాడు. గజముఖుడిలాగే.. మనమూ ఆ క్షమను అలవరచుకోవాలి. దీర్ఘకాలిక కోపం ఆరోగ్యానికి చెదలాంటిది మరి!
పరాశక్తి రాక్షస సంహారిణే కాదు, రాక్షస గుణ సంహారిణి కూడా. గణపతినీ అచ్చంగా అలాగే తీర్చిదిద్దింది. ఓ అసుర సంహార ఘట్టం ద్వారా మనం ఈ విషయాన్ని అవగతం చేసుకోవచ్చు. పరమేశ్వరి భండాసురుడితో యుద్ధం చేస్తున్నది. ఆమె శక్తిని చూసి భీతిల్లిపోతున్న ఆ రాక్షసుల గుంపులోని భండాసురుడి సోదరుడు విశుక్రుడు అమ్మవారి మీద విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. అంటే అందులో… బేలతనం, దీనత్వం, అలసత్వం, సంకుచిత తత్వం, ఆత్మవిశ్వాస రాహిత్యం, వెనకాడటం, నిద్రమత్తు, పరధ్యానం… అనే అష్టవిఘ్నాలు ఉంటాయి. దీని ప్రయోగంతో అమ్మవారి శక్తి కాసేపు స్తంభించిపోయింది. అయితే అవతల ఉన్నది శ్రీలలిత. అందుకే అంతటి క్లిష్ట సమయంలోనూ ఓ చిరునవ్వు చిందించిందట. ఆ వెలుగుల్లోంచి వినాయకుడు ఉద్భవించాడనీ, ఆ ఎనిమిది విఘ్నాలనూ తొలగించి విఘ్నేశ్వరుడిగా విరాజిల్లాడనీ బ్రహ్మాండ పురాణం చెబుతుంది. నిజంగానే సోమరితనం, నిద్రమత్తు, పరధ్యానం, దీనత్వంలాంటి గుణాలు ఆవహించాయంటే ఎంతటి శక్తి అయినా చిత్తు కావాల్సిందే. ఆయా గుణాలు వ్యక్తిని నిర్వీర్యం చేస్తాయి. అందుకే అమ్మవారు గణపతి ద్వారా అలాంటి విఘ్నయంత్రాన్ని నాశనం చేయించి, జగతికి ఆయా గుణాల ప్రభావాన్ని తెలియజేసింది. మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా సరే ఈ లక్షణాలను దరిచేరనివ్వకపోతే వ్యక్తిగా విజయం సాధించినట్టే! ఆటంకాలను తొలగించే ఆదిదేవుడి నుంచి మనం ఈ శక్తిని సంపాదించుకుంటే అదే నిజమైన వినాయక చవితి.
‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితాః…’ అన్నట్టు పరాశక్తి ప్రతి జీవిలోనూ ఉంటుంది. అన్నింటి ఆలనాపాలనా చూస్తుంది. అందుకే ఆమె జగతికి అమ్మ. తన ముద్దుల బిడ్డ గణపతికీ ఇదే విషయాన్ని నేర్పిందామె. నేనంటే నీకెంత ఇష్టమో ప్రతి జీవినీ అంతే ప్రేమగా చూడమంటుంది. ఈ విషయమై ఓ పురాణ కథ కూడా ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడట. అప్పుడు ఒక పిల్లి కూడా వారి మధ్య చేరిందట. ఆటకు అడ్డం వస్తున్నదన్న కారణంతో గణేశుడు దాన్ని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆ పిల్లి ముఖానికి దెబ్బ తగిలిందట. అయితే, ఆ సాయంత్రం ఆటలు ముగించుకొని బాల గణపతి ఇంటికి చేరే సమయానికి పార్వతమ్మ ముఖం మీద గాయం కనిపించిందట. ‘అయ్యో… ఏమైందమ్మా… నీ ముఖం మీద ఆ దెబ్బ ఏంటి?’ అంటూ బాధతో అడిగాడట చిన్ని స్వామి. ఉదయం నువ్వు ఆడుకునేప్పుడు నీ వల్ల పిల్లికి గాయం అయింది కదూ.. అదే ఇది, సర్వ ప్రాణులందూ నేనే ఉంటాను కదా.. మరి వాటినీ నన్ను చూసినట్టే ప్రేమగా చూడాలి’ అందట అమ్మవారు. బాలుడే అయినప్పటికీ ప్రేమ రూపంలో దైవ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు హేరంబుడు. అప్పటి నుంచీ ప్రతిప్రాణినీ కరుణతో పాలించే పెద్ద మనసున్న దొడ్డ దేవుడయ్యాడు! ఓ చిన్న ఎలుకను తన వాహనంగా మలచుకోవడంలోనే ఆయన అంతరార్థం అర్థం చేసుకోవచ్చు. గణపతి సాక్షిగా ఈ పండుగ వేళ మనమూ వంటబట్టించుకోవాల్సింది ఆ ప్రేమ తత్వాన్నే. ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడగలిగిన వారే మహాత్ములయ్యారన్న కథలు మనకెన్నో తెలుసు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి