వితంతువులు అంటే సమాజంలో చిన్నచూపు. ఒంటరి మహిళలు, వితంతువులు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, పని ప్రదేశాల్లో పలురకాల హింసకు గురవుతూ ఉంటారు. భర్త పోయిన మహిళను అపశకునంగా భావించే కుసంస్కారం సమాజంలో వేళ్లూనుకుని ఉంది. భర్తపోయిన సోదరిని ఆదరించడానికి బదులు భారంగా భావించే సోదరులు మన లోకంలో కోకొల్లలు. మూడు పదులు నిండకుండానే భర్తను కోల్పోయిన వనితకు మళ్లీ పెండ్లి చేయాలంటే చాలామంది తల్లిదండ్రులు వెనకాముందు ఆలోచిస్తుంటారు. వితంతువుగా మారిన కోడలిపట్ల అత్తామామలు ఎంత నిర్దయగా వ్యవహిరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలైనంత త్వరగా కోడల్ని వదిలించుకోవాలని భావిస్తారు.
ప్రవక్త మహనీయుల కాలంలో ఇలాంటి విపరీతాలను ఆయన తీవ్రంగా ఖండించేవారు. వితంతువుల పునర్వివాహాన్ని ఆయన ప్రోత్సహించారు. వితంతు పోషణను అత్యున్నత పుణ్యకార్యమని ప్రవక్త (స) ప్రబోధించారు. ‘అనాథ పిల్లల, ఏ అండాలేని వితంతు మహిళల పోషణ భారం చూసేవారు అల్లాహ్కు ప్రీతి పాత్రులు’ అన్నారు ప్రవక్త (స). భర్తలేని యువతులకు మరో వివాహం చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని ప్రవక్త స్పష్టం చేశారు. ప్రవక్త కాలంలో యుద్ధాల్లో అనేకమంది సైనికులు హతమయ్యేవారు. పెద్ద సంఖ్యలో వితంతువులు, అనాథలు సమాజంలో మిగిలేవారు. ఈ వితంతువులు, అనాథలను కాపాడే పద్ధతుల్లో వారి పునర్వివాహం ఒకటి.
ఈ క్రమంలో ప్రవక్త (స) వితంతువులైన నిస్సహాయ మహిళలను వివాహం చేసుకుని ఆశ్రయమిచ్చారు. చట్టబద్ధమైన వివాహాల ద్వారా వారికి పునరావాసం కల్పించారు. యుద్ధాల్లో బందీలైన మహిళలు, వితంతువులు వారి పిల్లలకు భద్రత, పునరావాసం కల్పించి, వారు ఆకలిదప్పులతో అలమటించకుండా, వారి జీవితాలు మోడుబారిపోకుండా ఆదుకున్నారు. ప్రవక్త (స) కానీ, ఆయన అనుచరులు కాని యుద్ధఖైదీలుగా వచ్చిన ఈ మహిళలను, వితంతువులను తమ బానిసలుగా చేసుకోలేదు, గౌరవప్రదంగా వివాహం చేసుకున్నారు. వారికి గౌరవప్రదమైన హెూదా ఇచ్చారు. ఈ వితంతువులు, వారి అనాథ పిల్లల సమస్యకు చక్కటి పరిష్కారాన్ని సూచించారు.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076