గోవర్ధన లీలలో బాలకృష్ణుడు దరిద్ర నారాయణ- దీనజన సేవ, ఆర్తులను ఆదుకోవడమే పరమ ధర్మంగా ప్రకటించాడు. ‘గో’ అనగా ఆవు. గోవర్ధన మనగా గో సంరక్షణ, సంవర్ధనం. ‘గో’ అంటే భూమి. కృష్ణుడు అసురులను సంహరించి, అవనీభారం తొలగించి, ధరణిని ఉద్ధరించాడు. ‘గో’ శబ్దానికి వేదమని కూడా అర్థం. పరమాత్మ కనుమరుగవుతున్న వేద- సనాతన ధర్మాన్ని మనునట్లుగ ఉజ్జీవింప జేశాడు.‘గో’ అని ఇంద్రియానికి కూడా పేరు. అధోముఖంగా- యథా ప్రకారంగా ప్రపంచ పరంగా- విషయాల పట్ల ప్రవహించే ఇంద్రియ ధారను తన- పరమాత్మ వైపు మళ్లునట్లు చేశాడు గోవిందుడు. ఇదే గోవర్ధన లీలా పరమార్థం!
Krishnashtami | ఇంద్రదేవత పూజకన్న భాగవతేంద్రుని- భక్తవరుని పూజయే మిన్న అని ఈ గోవర్ధన లీలలో కన్నయ్య నిర్ణయం! శ్రీగిరిరాజైన గోవర్ధనుడు హరిదాసవర్యుడు- భక్తులలో శ్రేష్ఠుడు. భగవంతునికి చాల ఇష్టుడు. భగవల్లీలలో జడ- చేతన భేదం- తేడా పొడసూపదు. భగవత్పూజ లేక భాగవత పూజ- భక్తి సిద్ధాంత రీత్యా నిండైన ఈ రెండు విధాల పూజకే చెల్లుబాటు. సురపతి ఇంద్రుని మతిలో అసుర భావం- అహంకారం ముసురుకొంది. తన ఇష్టానికి- ఇష్టి (యాగాని)కి నష్టం వాటిల్లిందని రుష్టుడై, కోపావిష్టుడై దుష్టభావంతో అతడు అమాయక ప్రజలకు, పశువులకు నష్టం కలిగించాలని ఉపలవృష్టి- రాళ్లవాన కురిపించాడు. ‘నక్రోధో న చ మాత్సర్యం..’ కాని, భగవంతుని యందు, భక్తుని యందు రోషావేశాలు ఎప్పుడూ ఉండవు. ఇంద్రుడు గోజాతిని నశింప జేయ పూనగా ఉపేంద్రుడు కృష్ణచంద్రుడు ‘గోవర్ధనుడు’ దానిని రక్షించి వృద్ధి పరచాడు. అదృష్ట- పరోక్షమైన ఇంద్రుని కాక, దృష్ట- ప్రత్యక్షమైన దైవాన్ని పూజింప చేసి, పుణ్యాన్ని అందరికీ పంచిపెట్టాడు.
శుకముని అవనీపతితో- పరీక్షిత్ భూజానీ! గోవర్ధన గిరిని గొడుగుగా పైకెత్తి పట్టిన గోపాల శిరోమణి, గోప గోపీ రమణలను కని భయపడవద్దని ఊరడిస్తూ ఇలాగని పలికాడు.. గోప వనితలారా! కలత పడకండి. గోపకులారా! కొందలమందక- కలవరపడక మీమీ పసుల మందలతో వచ్చి మీకు నచ్చిన చోట ఈ కొండ క్రింద నిలవండి.
శా॥ ‘బాలుండీతడు, కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగా
జాలండో?యని దీనిక్రింద నిలువన్ శంకింపగా బోల, దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార! నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్’
‘ఓ బంధువులారా! ఈతడు బాలకుడు. ఈ కొండా! చాలా పెద్దది. కరవుతీర నిండా బరువైనది. మోయగలడో లేడో అని కింద నిలువడానికి సందేహించకండి. శైలాలు- కొండలు, సాగరాలు, సకల జంతుజాలంతో నిండిన ఈ ఇల- భూమండలమంతా మీదపడ్డా నాకేలు- చేయి చలించదు. ఇక మీకేల సంశయం? మీరందరూ ఆనందంగా దీని కింద చేరండి’ ఇలా అన్న నందనందనుని పలుకులు గోపకులు మనఃస్ఫూర్తిగా నమ్మి బంధు, మిత్ర పరివార సహితంగా తమతమ తావులలో ఆవుదూడలతోపాటు నిలిచారు.
మ॥ ‘హరి దోర్దండము గామ; గుబ్బ శిఖరం; బాలంబి ముక్తావళుల్
పరగన్ జారెడు తోయ బిందువులు; గోపాలాంగనాపాంగ హా
స రుచుల్ రత్న చయంబుగాగ; నచల చ్ఛత్రంబు శోభిల్లె ద
ద్గిరి భిద్దుర్మద భంజియై జలధరా క్లిన్న ప్రజారంజియై’
శుకుడు- రాజా! ‘శ్రీహరి ధరించిన గిరి అనే గొడుగు కొండల రెక్కలను ఖండించిన ఆఖండలు- ఇంద్రుని దురహంకారాన్ని భంజిస్తూ, ప్రళయంకర జలదా(మేఘా)ల జలధారలకు విలవిల్లాడిన గోకుల వాసుల ఉల్లము (మనసు)లను రంజిల్ల జేస్తూ విరాజిల్లింది. ఆ కొండ గొడుగుకు నందగోకుల మండనుని భుజదండమే కర్ర. శిఖరమే గుబ్బ. శైలంపై నుంచి జారుతున్న జల బిందువులే దాని చుట్టూ వ్రేలాడుతున్న ముత్యాల జాలరులు. మందలోని ఇందువదన- గోపకాంతల క్రీగంటి చూపుల, మందహాసాల జిలుగులే రత్నాల వెలుగులు.’ సాంగరూపక అలంకార కలంకారీ కలితమైన పై లలిత మాతంగ- మత్తేభ వృత్తం పోతన మహాకవి అద్భుత కల్పనా జల్పితం- ఆభాషితం!
క॥ ‘వడిగొని బలరిపు పనుపున
నుడుగక జడిగురిసె నేడహోరాత్రము, ల
య్యెడ గోపజనులు బ్రదికిరి
జడి దడియక కొండ గొడుగు చాటున నధిపా!’
రాజా! ‘బిడౌజు (ఇంద్రు)ని ఆనతిచే ఎడతెరపి లేక ఏడు అహోరాత్రాలు జోరున జడివాన కురిసింది. ఆ అచలచ్ఛత్రం- కొండ గొడుగు అండన గొల్లలెల్లరూ ఏమాత్రం దడవ(భయపడ)కుండా, కుండపోత వాన వాత పడుకుండా- తడవకుండా మనగలిగారు.’
గోవర్ధననాథుని దివ్య స్వరూపం గోకుల బృందావన వాసులకు ఏడు దినాల వరకు అనామయం- దేహం మీద ధ్యాస లేకుండా చేసింది. అటుపై ఆకలి దప్పికలనూ మటుమాయం కావించింది. ఈ మాదిరి- తీరున, సప్త వాసరాలు కరివరదుడు, మందరగిరిధారి హరి గోవర్ధనగిరిని ధరించి నందవ్రజ ప్రజల ఆర్తిని హరించాడు. విసిగి వేసారిన వాసవుడు- ఇంద్రుడు వాసుదేవుని భాసుర వీరచరితం కని విని అభాసు(నవ్వుల) పాలయ్యాడు. తన మనోరథం వ్యర్థం కాగా మేఘాలను మరలించుకొని తరలిపోయాడు.
వాన వెలియగానే గగనాన భానుని ప్రభ కానవచ్చింది. కొండ కింద ఉన్న మంద(వ్రజ) వాసులను తమ ఆలమందలతో వెలుపలికి రమ్మని ఆనతీయగా అందరూ వెడలివచ్చారు. అంతట, బాలకృష్ణుడు శైలాన్ని దించి యథాస్థానంలో ఉంచాడు. ఈ నల్లవాడు తమను చల్లగా కాపాడినాడని వల్లవులు- గొల్లలెల్లరూ పల్లవించిన ఉల్లములతో బాలకృష్ణుని పలువిధాల ప్రశంసించారు. కాలరూపుని అచ్యుతుని ఆలింగనం చేసుకొని ఆశీర్వదించారు. నంద యశోదాదులు నందనుని పరమానందంతో అక్కున జేర్చుకొని పెక్కు శుభవాక్యాలు వక్కాణించారు. ఆకాశ సంచారులు విరులు కురియించారు. సురులు శంఖాలు, దుందుభులు మ్రోగించారు. అంబర వీధిలో తుంబురాది గంధర్వులు సంబరపడుతూ పాడారు. నల్లనయ్య గొల్లలతో గోవులతో కూడి మెల్లగా గోష్ఠం- వ్రేపల్లె చేరాడు.
రాజా! అనంతరం, బాలగోపాలుని లీలా విలాసాలు ఆలపిస్తూ గోపాల జనం చాల విస్మయపడి నందరాజుతో ఇలా విన్నవించుకున్నారు..
క॥ ఏడేండ్ల బాలుడెక్కడ?
క్రీడం గరి తమ్మి యెత్తుక్రియ నందఱముం
జూడ గిరి యెత్తుటెక్కడ?
వేడుక నొకకేల నేడు వెఱగౌ గాదే?…
‘ఏడేళ్ల పిల్లవాడెక్కడ? ఏనుగు అరవిందా(పద్మా)న్ని ఎత్తిన చందంగా, మనమందరం చూస్తూండగా, అందంగా అద్రి (కొండ)ని భద్రంగా పైకెత్తడమెక్కడ? ఇది ఎంత వింత? గోపనాయకా! నందా! నీ పాపడు మానవమాత్రుడు కాడయ్యా! సాక్షాత్ మాధవుడయ్యా!’ అంటూ కృష్ణుని, విష్ణు అవతారమని ఎంచి సేవించారు.
హరి ఒక కేల- చేతితో లీలగా శైలాన్ని ఎత్తిపట్టి తాను (ఇంద్రుడు) ఆకుల పరచిన- కలవరపెట్టిన గోకులాన్ని కాపాడినాడని విని నాకపతి పాకశాసనుడు పశ్చాత్తాపపు కాక (వేడిమి)తో పరితపించాడు. త్రిలోకపతిననే అహంకారానికి తిలోదకాలిచ్చి ఆ గిరిభిత్తు- ఇంద్రుడు అణకువతో సురభిని- కామధేనువుని మున్నిడుకొని అమరావతి నుంచి అరుదెంచాడు. దుష్టులైన మానవేంద్రుల దురహంకార, దురితాలను దూరీకరించు వాడు, అపార కరుణానిధి అయిన నందనందనుని సందర్శించి, ఆయన పాదారవిందాలను సేవించాడు. అంజలి ఘటించి అమర ప్రభువు, ఆపన్న ప్రపన్నుడు కంజదళాక్షునితో ఇలా విన్నవించుకొన్నాడు.. అనంతా! ఒక్కొక్క లోకాన్నీ పాలిస్తూ- చక్కబరుస్తూ, మిక్కిలి మదంతో నిక్కుతూ, నీలుగుతూ నిఖిలానికీ నేనే ప్రభువునని ఒడలు మరచి మసలుకొనే నావంటి జడులు- ఉన్మాదులు నిజంగా నీ మహిమను తెలియనేరరు.
ఆ॥ ‘వాసుదేవ! కృష్ణ! వరద! స్వతంత్ర! వి
జ్ఞానమయ! మహాత్మ! సర్వపుణ్య
పురుష! నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ!
నీకు వందనంబు నిష్కళంక!’
‘వసుదేవనందనా! నీకు వందనాలు. వాసుదేవా! నీ దాసుణ్ని. అపరాధిని, తప్పు సైరించి నన్ను మన్నించు.’ వాసవుని వాక్కులు విని వాసుదేవుడు దరహాసం చిందిస్తూ, మేఘ గంభీరమైన అమోఘ ఘోషతో ఇలా పలికాడు- ‘సురేశ్వరా! సంపదచే కన్ను మిన్ను కానక నీవు నన్ను కూడ కానకున్నందున, నీ మదాతిరేకం రూపు మాన్పడానికే ఈ నీ యాగాన్ని నేను మానిపించాను. ఐశ్వర్యం వల్ల మత్తిల్లిన- మదించిన వారు దండ ధారినైన నా ఊసెత్తరు. ఓ వాసవా! వాస్తవంగానే నేనెవణ్ణి రక్షింప దలుస్తానో, వానిని ఇలా శిక్షిస్తా- వాణ్ని ధనహీనునిగా చేస్తా. సితకరిగమనా- ఓ ఐరావత వాహనా! నీ అల్ప ప్రభుత- అధికారంతో అనల్పంగా గర్వించకు. నా ఆనతి నిర్వర్తిస్తూ నీ అధికారం నిలుపుకో. నీకు శుభమగు గాక! వెళ్లిరా.’ రాజా! గోగణంతో కూడి ఉన్న కామధేనువు- సురభి, భక్తజన కామధేనువైన దామోదరునికి ప్రణమిల్లి ఇలా పలికింది..
క॥ విశ్వేశ! విశ్వభావన!
విశ్వాకృతి! యోగివంద్య! విను నీ చేతన్
శాశ్వతుల మైతి మిప్పుడు
శాశ్వతముగ గంటి మధిక సౌఖ్యంబు హరీ!
‘విశ్వేశ్వరా! విశ్వకల్యాణ మూర్తీ! విరాడ్రూపా! పరమ యతీశ్వరులచే నుతింపబడువాడా! నా విన్నప మాలకించు. నీ అనుగ్రహం చే మేమిప్పుడు శాశ్వతులం- శుభ చిత్తులమయ్యాం. మాకు సుస్థిరమైన గొప్ప సౌఖ్యం సమకూరింది.’ దేవా! నీవే మాకు పరమదైవం, ప్రభువు. సర్వలోక సౌఖ్యం కొరకు నీకు పట్టం కట్టమని నీటి పుట్టుగు పట్టి- బ్రహ్మదేవుడు నన్ను నియమించి పంపాడు. ఓ గిరిధారీ! నీవే ఈ భూభారాన్ని నివారించడానికి అవతరించిన శ్రీహరివి. శుకుడు- రాజా! అనంతరం అమర ప్రభువు, దేవమాత అదితి మరియు మహర్షుల సమక్షంలో, కామధేనువు క్షీరంతో, ఐరావతం తన శుండాలం- తొండంతో కొని తెచ్చిన దివ్య ధునీ (గంగా) జలాలతో- రణరంగంలో విపక్షులను శిక్షించువాడు, సాధు సంరక్షకుడు అయిన జలజాక్షుని, గోవులకు గోపకులకు అధిపతిగా ‘గోవిందుడు’ అని నామకరణం చేసి అభిషేకించాడు. పావనమైన ఆ పాలు, గంగాజలాలు నిలిచిన ప్రదేశం నేటికీ ‘సురభికుండం’గా ప్రశస్తి పొందుతోంది.(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006