శుక మహర్షి పరీక్షిత్తుతో- రాజా! జలజ నేత్రుడు, ఖల విదారి కృష్ణుడు బలరామ సహితుడై కోటలు, విశాలమైన బాటలు, శృంగాటకములు-చతుష్పథాలు, హాటక (బంగారు) భవనాలు, ధనాలు, ధాన్యాలు, ఉద్యానవనాలు, ఘోటకాలు, పోటుదొరలు-రణశూరులు, రథాలు, ధ్వజాలు, భద్రగజాలు, సామజ గమనలు- అందగత్తెలతో కూడి అత్యద్భుతమైన కళతో మిలమిల మెరిసిపోతున్న మథురా నగరాన్ని కలయ చూచాడు. పురవీధుల్లో నడచి వస్తున్నస్మర జనకుని పురుషోత్తముని తిలకించి పులకించిన కలకంఠులు కలతలు- మనస్తాపాలు మాని…
ఉ॥ ‘నందు తపఃఫలంబు, సుగుణంబుల పుంజము గోపకామినీ
బృందము నోము పంట, సిరివిందు, దయాంబుధి, యోగి బృందముల్
డెందములందు గోరెడు కడింది నిధానము సేర వచ్చెనో
సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్’
‘ఓ ఇందువదనలారా! నందుని తపస్సుకు ఫలమైనవాడు, వాసి కెక్కిన మేలి గుణాల చాలు- రాశి, గోప తొగకంటుల (సుందరుల) నోముల పంట, ఇందిరా సుందరి (లక్ష్మి) హృదయానికి విందు- పరమానందం అందించువాడు, కరుణకు వరుణాలయుడు- సముద్రుడు, పరమ యోగి బృందాలు తమ డెందాలలో- హృదయాలలో కోరుకొనే కడింది- అపురూపమైన పెన్నిధి అయిన గోవిందుడు వస్తున్నాడు. కన్నుల కోరిక తీరేటట్లు కందాం రండి’ అంటూ నందనందనుని సందర్శించడానికి తొందరపడుతూ ఒకరినొకరు పిలుచుకున్నారు. వారు భోజనాలు చేస్తూ భాజనా- గిన్నెలను అవతలకు నెట్టారు. పరున్న వారు పడకలు వీడారు. స్నానాలు ఆడుతున్న మానవతులు- స్త్రీలు మధ్యలోనే మానివేశారు. రమణులతో రమణీయంగా రమిస్తున్నవారు కూడా గణనీయంగా విరమించారు.
గురువుల- పెద్దల వద్ద శిక్షణ పొందుతున్న ముద్దుగుమ్మలు, అది బరువని- వద్దనుకొని గ్రద్దన- వేగంగా బయటపడ్డారు. ఇంటి పనులలో నిండా మునిగి ఉన్న వాల్గంటులు కూడా వాటిని విడిచి పరుగుపరుగున వచ్చారు. చంటిపిల్లలను ఎత్తుకొని మోస్తున్న కిన్నెర కంఠులు తత్తరపడి చిన్నవారిని దింపివేశారు. తీరుబడిగా అలంకరించుకుంటున్న తరుణులు తడబడి చీరలు, హారాలు, పూదండలు, మైపూతలు తారుమారుగా ధరించి వచ్చారు. ఎత్తయిన బంగారు మేడలపై ముత్తయిదువులు గుంపులుగా చేరి మత్తచిత్తలై వారిజాక్షుని అవ్వారిగా- తనివి తీర వీక్షించి మనువు- జన్మ సఫలమని భావించారు. మథురా నగరపు అన్నువులు- స్త్రీలు చిన్నికృష్ణుని లీలా విలాసాలు విన్నవారే కాని, కన్నయ్యను ఎన్నడూ కన్నవారు కారు. అప్పటి వారి మనోభావాలను సహజ పాండిత్యుడు పోతన తనదైన కవనశైలిలో ఇలా వినసొంపుగా కనబరచాడు.
సీ॥ ‘వీడటే రక్కసి విగత జీవగ జన్ను,
బాలు ద్రావిన మేటి బాలకుండు
వీడటే నందుని వెలదికి జగమెల్ల,
ముఖమందు జూపిన ముద్దులాడు
వీడటే, మందలో వెన్నలు దొంగిలి,
దర్పించి మెక్కిన దాపరీడు
వీడటే యెలయించి వ్రేతల మానంబు,
సూరలాడిన లోక సుందరుండు
తే॥ వీడు లేకున్న పుర మటవీస్థలంబు
వీని బొందని జన్మంబు విగత ఫలము
వీని బలుకని వచనంబు విహగరుతము
వీని జూడని చూడ్కులు వృథలు వృథలు’
…‘పసితనంలో మాయా (అవిద్యా) రక్కసి పూతన కసిగా ఇచ్చిన విసపు చనుబాలు త్రాగి దానిని ఉక్కడగించి అక్కున చేర్చుకొన్న- మోక్ష మిచ్చిన మేటి శిశువు ముకుందుడు వీడేటే! మన్ను తిని కూడా తిననట్లు నటించి కన్నతల్లికి తన ముఖంలో, మిన్ను మన్ను ఏకంగా జగమెల్ల- తన్ను, తల్లిని కూడా చూపిన వన్నెచిన్నెల ముద్దులాడు- చెన్నుడు (చక్కనయ్య) వెన్నుడు వీడేటే! మందలో గోపికల బృందాలు తమ మందిరాలలో దాచుకొన్న పాలు, పెరుగు, వెన్నలను, కాచి (వేచి ఉండి) దోచుకొని దర్పించి, తోటి గొల్లపిల్లలకు అర్పించి, తిన్న చిన్నికృష్ణుడు వీడేటే! అమాయకురాండ్రైన గోప కుమారికల వస్ర్తాలను- మానధనాన్ని చూరగొన్న చోరధీరుడు, మార జనకుడు- విష్ణువు వీడేటే! వీడు లేని నగరం బీడువారిన- ఎండిపోయిన అడవియే! వీని పొందు లభించని (ఇందు నిభాస్యల- మగువల) జన్మ పాడుపడినదే, ఎందుకూ పనికిరానిదే! నెలతలారా! వీనిని గురించి పలుకని వాక్కులు పక్షుల పలు కూతల వంటివే! వేల మాటలేల? ఈ బాలగోపాలుని చూడని చూపులు చాల చాల వృథలు- వ్యర్థాలు!’ అంటూ ఆ పౌర కామినులు రామకృష్ణులపై పూలవానలు కురిపించారు.
శుకుడు- రాజా! ఆ సమయంలో కృష్ణుడు, రాజవీధిలో వస్తున్న కంసుని ఆస్థాన రజకుని చూచి- ‘ఓ రజకకుల తిలకా! మేము మీ నగరానికి అతిథులం. మీ రాజుగారి మేన అల్లుళ్లం. మా మందలో అంత అందమైన వస్ర్తాలు లేవు. నీ మూటలోని దీటు- సరిపోలు వస్ర్తాలు మాకిచ్చెయ్యి. నీకు సాటిలేని మేలు జరుగుతుంది’ అన్నాడు. వాడు కోపించి రెచ్చిపోయి పొగరుగా, రామకృష్ణులు నొచ్చుకొను విధంగా హెచ్చుస్వరంతో దుర్భాషలాడాడు. గోప కిశోరునికి కూడా కోపం వచ్చి, అతనిని తన ముంజేతితో తల ఊడి పడేటట్లు కొట్టాడు. నేల కూలిన రజకుని చూచి వాని మనుషులు, దగ్గరున్న ప్రజలు బిగ్గరగా అరచి భయంతో పారిపోగా; శౌరి, సంకర్షణుడూ మూటలో ఉన్న తమకు వాటమైన వస్ర్తాలు ధరించి బాటలో ముందుకు సాగిపోయారు.
రామాయణంలోని ఉత్తరకాండలో లోకోత్తర చరిత్ర (సీతాయాశ్చరితం మహత్) కలిగిన భామామణి, భూజాత, రామపత్ని, అంతర్వత్ని (గర్భవతి) సీత అకారణ అరణ్యవాసానికి కారణమైన ఆ రజకుడే ఈ నిర్నేజకుడు- రేవడు అని వ్యాఖ్యానం. ‘క్రోధోపి దేవస్యవరేణ తుల్యః’ – (దేవదేవుని ఆగ్రహం కూడా అనుగ్రహం వంటిదే). కర్మఫలం అనుభవింప జేసి పరమాత్మ అతనికి జన్మరాహిత్యం అనుగ్రహించాడు. శుకుడు- రాజా! ఆ పైన ఒక వాయకుడు- చేనేత పనివాడు దారిలో వస్తున్న మథురా నాయకులను, నరవరులను- రామకృష్ణులను చూచి పరవశించి, అర్చించి వారికి పలు రంగుల మెత్తని వస్ర్తాలను, ఆభరణాలను సమర్పించాడు. హరిహలులు వానిని స్వీకరించి, సింగారించుకొని కరి (ఏనుగు) గున్నల మాదిరి చెన్ను (అందం, వన్నె) వహించారు.
శ్రీధరుడు ప్రసన్నుడై వానికి సారూప్యాన్ని, సంపదను ప్రసాదించాడు. అనంతరం రామశ్యాములు సుదాముడనే మాలాకారుని- పూలమాలలు అల్లి, వాటిని అమ్ముకొని జీవించే కడు పేదవాని, పరమ భాగవతుని గృహానికి వచ్చి సేద తీరారు. ఆ బీద భక్తుడు సుదాముడు దామోదర రాములకు మిక్కిలి సుగంధ భరితాలైన రెండు చక్కని కుసుమ దామా(దండ)లను సమర్పించాడు. వాని ఏకాంత భక్తికి మెచ్చి లోకాంతరంగుడు శ్రీకాంతుడు ‘నీ కోరిన వరమిచ్చెద, కోరుకోమ’ని అనగా ఆ అనఘుడు, ఘనయశుడు నంద తనయుని ఇలా కోరాడు…
క॥ ‘నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార! నాకు దయసేయ గదే!’
‘తాపసులకు కల్ప పాదపం (వృక్షం) వంటివాడా! గోవిందా! నీ పాద అరవిందాల పరిచర్యను, నీ పాదాలను పూజించే పరమ భక్తులతో చెలిమిని, సర్వప్రాణుల మీద అఖర్వ- అపరిమితమైన దయను, ఓ దానవ గర్వహరా! నాకు ప్రసాదించు’. కోరినవి అనుగ్రహించి శౌరి సుదామునికి బలం, ఆయుష్యం, తేజం, యశం, సిరిసంపదలు కూడా కరుణించాడు. పై కందం కన్నా మిన్నయైన ప్రోజ్ఝితకైతవ- నిష్కపటమైన భాగవత ధర్మం ఉన్నదా? భక్త జనులందరికీ ఉదార, ఉదాత్త, మహోన్నత, ఆదర్శప్రాయమైన కోరిక! భగవంతుని చేరికకు అతి సులభ, సురక్షిత సాధనం. తరతరాలుగా కరతలామలకంగా తెలుగువారి డెందాల (హృదయాల) మందారాలలో భక్తి మాధుర్య మరందాలు చిందిస్తున్నది ఈ అందమైన కందం. శుకయోగి- రాజా! అబ్జాక్షుడు రాజవీధిలో సాగిపోతూండగా, తనకు ఎదురుగా పలు లేపనాలు- సుగంధ భరితాలైన మైపూతల పాత్ర పట్టి తలదించుకు వస్తున్న ‘ఆననరుచి నిచయ వినమితాబ్జ’ (ఆ ఇంతి ముఖ కాంతి ముందు మహోత్పలం (కమలం) కూడా తల వంచుకుంటుంది) యైన కుబ్జను, మరుగుజ్జు పిల్లను చూచాడు. పరమాత్మ ఆమెను ఇలా ఆప్యాయంగా పలకరించాడు. ‘ఓ వనజాక్షీ! నీవెవరి దానవు? నీ పేరేమిటి? ఈ అంగరాగాలు ఏ శుభాంగునికి సమర్పిస్తావు? ఇవి మాకు ప్రసాదిస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు.’ ముకుందుని మాటలు విని ఆ ముగుద (యువతి) ఇలా అన్నది…
ఉ॥ ‘చక్కనివాడ వౌదు, సరసంబుల నొంపకు, మెల్లవారికిన్
జక్కదనంబు లెక్కడివి? చారు శరీర! త్రివక్ర యండ్రు, నే
నిక్కము కంసుదాసిని, వినిర్మల లేపన విద్యదాన, నన్
మిక్కిలి రాజు మెచ్చు, దగమీరు విలేపనముల్ ధరింపరే?’…
‘ఓ సుందరాకారా! నీవు భలే అందగాడివేలే! సరసాలతో నన్ను సాధించి, వేధించకు. నీ చమత్కారాలు చాలించు. అరవింద నేత్రా! నీవంటి అందాలు అందరికీ ఎక్కడినుంచి వస్తాయి. నా పేరు ‘త్రివక్ర’ (మెడ, వక్షము, నడుము- ఇలా మూడు వంకరలు). నేను కంస మహారాజు దాసిని. అచ్చమైన అంగరాగాలు చేయడమే నాకు వచ్చిన, నచ్చిన విద్య. నన్ను రాజు ఎంతో మెచ్చుకుంటాడు. ఈ విలేపనాలన్నీ మీరు స్వీకరించరా?’ అంటూ ఆ కుబ్జ ప్రేమతో వారికి మైపూతలు సమర్పించింది. వానిని తన మేనుకు అలదుకొని యదువీరుడు మిక్కిలి ముదమంది, మువ్వంపుల దాని మేనును చక్క చేయనెంచాడు. దాని మీగాళ్ల మీద తన పాదాలుంచి తొక్కిపట్టి, రెండు వేళ్లను గడ్డం క్రింద పెట్టి దేహం సాగునట్లుగ పైకెత్తాడు. అంతలో ఆ ఇంతి వంపులు దీరి కంతుని- మన్మథుని సమ్మోహనాస్త్రం వలె చక్కని చుక్కగా మారి నందగోకుల విహారిని- కమలాక్షుని కాంక్షతో చూచింది.
‘ఓ పంచశరా (మన్మథా)కారా! (తుంట విలుతుని వంటివాడా!) నా ఇంటికి వేంచేయుము’- అంటూ నందుపట్టి పై పుట్టం (ఉత్తరీయం) చెరగు పట్టుకొని లాగింది. శ్యాముడు బలరాముని చూచి నవ్వుతూ- ‘ఓ ఇందుముఖీ! నా వచ్చిన పని సాధించిన తరువాత నీ మందిరానికి వస్తా. ఓ చిలుకల కొలికీ! నేటికి అలుకమాను’ అంటూ ఆ కలికిని- కుబ్జను సాగనంపాడు. రామాయణంలో రాముని మోహించి, తన్ను పెళ్లాడమన్న కామిని శూర్పణఖయే కంజముఖియైన ఈ భామిని ‘కుబ్జ’ అని వ్యాఖ్యానం. ఆధ్యాత్మికంగా, కామ క్రోధ లోభాలనే త్రిదోషాలతో వక్రమైన మానవ బుద్ధియే త్రివక్ర. బుద్ధి అహంకార స్వరూపుడైన కంసుని సేవిస్తే వికృతమవుతుంది. కంసారి- కృష్ణుని సేవిస్తే సుకృతమై సంసారంపై విజయం సాధిస్తుంది! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006